Skip to main content

విధేయత – విశ్వాసం యొక్క ఫలితం

 విధేయతను గురించి ఆదికాండము 17:22–27 నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు: 

1. నిజమైన విశ్వాసం విధేయతగా ఫలిస్తుంది. అబ్రహాము దేవుని ఆజ్ఞను విన్నాడు, అంగీకరించాడు, వెంటనే ఆచరణలో పెట్టాడు. విశ్వాసం కేవలం మాటల్లోనే కాదు, మన క్రియల్లో కూడా కనిపించాలి. Faith alone saves, but the faith that saves is never alone.

2. విధేయతలో ఆలస్యం చేయకూడదు. దేవుడు అబ్రహాముకు సున్నతి చేయమని ఆజ్ఞాపించినప్పుడు, అతడు తనకు అనుకూలమైన సమయం కోసం ఎదురుచూడలేదు. అదే దినమున తనకు, ఇష్మాయేలుకు, తన ఇంటివారందరికీ సున్నతి చేయించాడు. కీర్తన 119:60లో దావీదు ఇలా అంటున్నాడు: “నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.” దేవుని చిత్తం మనకు స్పష్టంగా తెలిసినప్పుడు, “తర్వాత చూద్దాం” అని వాయిదా వేయకూడదు.

3. విధేయత మన ప్రభువైన క్రీస్తు పట్ల ప్రేమకు నిదర్శనం. యోహాను 14:15లో యేసు, “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు” అని చెప్పాడు. మనం క్రీస్తును ప్రేమిస్తున్నామని చెప్పడం మాత్రమే కాదు, ఆయన వాక్యానికి లోబడటం ద్వారా ఆ ప్రేమను చూపించాలి.

4. మన పాపాన్ని చూపించినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడాలి. దేవుని వాక్యం ద్వారా లేదా సంఘ సభ్యుల ద్వారా మన తప్పులు బయలుపరచబడినప్పుడు, వాటిని సమర్థించుకోవడం, ఇతరులపై నింద వేయడం కాకుండా, వినయంతో అంగీకరించి పశ్చాత్తాపపడాలి.

5. సంబంధాలలో సమాధానపడటానికి మనమే ముందడుగు వేయాలి. ఇతరులతో విభేదాలు వచ్చినప్పుడు, ఎదుటివారే మొదట రావాలని ఎదురుచూడకుండా, సాధ్యమైనంత త్వరగా మనమే ముందడుగు వేయాలి. యేసు మత్తయి 5:23–24లో బోధించినట్లు, ఇతరులతో సమాధానపడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

6. క్షమాపణ చెప్పవలసినప్పుడు గర్వంతో ఆలస్యం చేయకూడదు. మన మాటల వల్ల లేదా ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడితే, మన గర్వాన్ని పక్కనపెట్టి, తప్పును అంగీకరించి, క్షమాపణ అడగాలి. నిజమైన విధేయత మన అహంకారాన్ని సమర్థించుకోదు;దానిని దేవుని ముందు అణచుకుంటుంది.

7. సంఘ సభ్యుల అవసరాలను చూసినప్పుడు వెంటనే స్పందించాలి. “ఇంకెవరైనా సహాయం చేస్తారులే” అని అనుకోకుండా, మన వల్ల సాధ్యమైతే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. దేవుని పట్ల మన విధేయత, సంఘ సభ్యుల పట్ల మన ప్రేమలో కూడా కనిపించాలి.

8. క్రీస్తు చేసిన కార్యాన్ని గుర్తించి, ఆయనకు విధేయులుగా జీవించాలి. పాత నిబంధనలో అబ్రహాము శారీరక సున్నతి ద్వారా దేవుని నిబంధనకు విధేయత చూపించాడు. అయితే నూతన నిబంధన విశ్వాసులమైన మనకు శారీరక సున్నతి అవసరం లేదు. క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు; పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలను మార్చి, మనం పాపానికి చనిపోయి దేవునికి జీవించేలా చేస్తున్నాడు (కొలస్సీ 2:11–13). కాబట్టి మన విధేయత రక్షణ పొందడానికి చేసే ప్రయత్నం కాదు; క్రీస్తులో ఇప్పటికే పొందిన రక్షణకు కృతజ్ఞతతో చూపించే ప్రతిస్పందన.

విధేయత అనేది దేవుని ప్రేమను సంపాదించుకునే మార్గం కాదు; క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రేమకు మనం చూపించే విశ్వాసపూర్వక ప్రతిస్పందన.

- డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...

ప్రసంగంలో "హల్లెలూయ,స్తోత్రం" పదాల ప్రస్తావన

  ఈ మధ్య ఒక క్రైస్తవ మీటింగ్ కి వెళ్లాను. అక్కడ ప్రసంగం చేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతంలో చాలా పెద్ద బోధకుడు. ఆ ప్రసంగంలో చాలా సార్లు  “హల్లెలూయా” ,   “స్తోత్రం”   అనడం నేను గమనించాను. కొన్నిసార్లు వాక్యం చూడడానికి, చెప్పదలచుకున్నది గుర్తుచేసుకోడానికి ఈ పదాలను ఆయన ఉపయోగించడం గమనించాను.    “హల్లెలూయా” ,  “స్తోత్రం”  అనే మాటలు మంచి మాటలే. ఇవి దేవునికి మహిమను ఆపాదించే మాటలే. బైబిలు గ్రంథంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి.  ఉదాహరణకు, కీర్తనల గ్రంథములో ఈ మాటలు మనం చదువుతాం. కానీ కీర్తనాకారులు ఆ మాటను మళ్లీ మళ్లీ చెప్పరు. 104,105,106, 111, 146-150 మొదలైన కీర్తనలను గమనిస్తే ప్రారంభంలో మరియు చివర్లో మాత్రమే ‘హల్లెలూయా’ అనే పదం వారు ప్రస్తావించడం మనం చూడగలం. అలాగే ప్రకటన 19:1లో కూడా బహుజనుల శబ్దం వంటి స్వరం ప్రభువును స్తుతించుడి (హల్లెలుయ) అని చెప్పడం మనం చదువుతాం.  అయితే, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రసంగం యొక్క ప్రధాన ఉద్దేశం దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించడం. అందుకే ప్రసంగీకులు, 2 తిమోతికి 4:2 లో "వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమం...