ఈ మధ్య ఒక క్రైస్తవ మీటింగ్ కి వెళ్లాను. అక్కడ ప్రసంగం చేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతంలో చాలా పెద్ద బోధకుడు. ఆ ప్రసంగంలో చాలా సార్లు “హల్లెలూయా”, “స్తోత్రం” అనడం నేను గమనించాను. కొన్నిసార్లు వాక్యం చూడడానికి, చెప్పదలచుకున్నది గుర్తుచేసుకోడానికి ఈ పదాలను ఆయన ఉపయోగించడం గమనించాను.
“హల్లెలూయా”, “స్తోత్రం” అనే మాటలు మంచి మాటలే. ఇవి దేవునికి మహిమను ఆపాదించే మాటలే. బైబిలు గ్రంథంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి.
ఉదాహరణకు, కీర్తనల గ్రంథములో ఈ మాటలు మనం చదువుతాం. కానీ కీర్తనాకారులు ఆ మాటను మళ్లీ మళ్లీ చెప్పరు. 104,105,106, 111, 146-150 మొదలైన కీర్తనలను గమనిస్తే ప్రారంభంలో మరియు చివర్లో మాత్రమే ‘హల్లెలూయా’ అనే పదం వారు ప్రస్తావించడం మనం చూడగలం. అలాగే ప్రకటన 19:1లో కూడా బహుజనుల శబ్దం వంటి స్వరం ప్రభువును స్తుతించుడి (హల్లెలుయ) అని చెప్పడం మనం చదువుతాం.
అయితే, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.
ప్రసంగం యొక్క ప్రధాన ఉద్దేశం దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించడం.
అందుకే ప్రసంగీకులు, 2 తిమోతికి 4:2 లో "వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము" అని బోధించబడ్డారు.
దేవుని వాక్యాన్ని చారిత్రక సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేపిస్తూ సరిగా అర్థవివరణ చేసి బోధించడం ప్రసంగీకుని బాధ్యత. ఈ గొప్ప బాధ్యతను చాలా జాగ్రత్తగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
ప్రసంగం చేస్తూ “హల్లెలూయా… హల్లెలూయా… స్తోత్రం…” అని చాలా సార్లు చెప్పడం వల్ల దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించే విషయంలో ఈ సమస్యలు కలుగుతాయి
మొదటిది, వాక్య బోధనకు ఆటంకం కలుగుతుంది.
ప్రజలు వాక్యాన్ని ఆలోచించకుండా కేవలం ఈ మాటలు మాత్రమే మాటి మాటికీ వింటారు. వాక్యం చెప్పే ప్రధాన పాయింట్ నుండి ప్రసంగీకుడు మరియు ప్రజలు పక్కకి తొలగిపోయే అవకాశం ఉంటుంది.
రెండవది, ఆ మాటల అసలు అర్థం మర్చిపోయే అవకాశం ఉంది.
బైబిలులో హల్లెలుయా అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని దేవుణ్ణి కొనియాడడం.
మూడవది, ఆ మాటలు ఒక అలవాటుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
ప్రసంగీకులు చాలా సార్లు ఆలోచించకుండా ఈ మాటలు పలుకుతుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రసంగీకుణ్ణి పరిచయం చేస్తూ "అంతర్జాతీయంగా దేవుని కొరకు బహు బలంగా వాడబడుతున్న బ్రదర్...మన మధ్యలో ఉండడం బహు ఆశీర్వాదం, అందరూ హల్లెలుయా చెప్పండి" అన్నాడు. ఆ వ్యక్తి స్టేజి మీదకు వస్తుంటే "హల్లెలుయా, హల్లెలుయా" అనే పదాలు ఆ ప్రసంగీకుడు మైక్ తీసుకునేదాకా ఆపకుండా అంటూనే ఉన్నాడు.
మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా వ్యర్థంగా మాటలు మళ్లీ మళ్లీ చెప్పకూడదు అని హెచ్చరించారు (మత్తయి సువార్త 6:7). ఈ మాటలు ప్రార్థన సందర్భంలో చెప్పినా ఆత్మీయ పదాలు వ్యర్థంగా ఉచ్చరించకూడదనే నియమం మనకు కనిపిస్తుంది
అందుకే మనం ఇలా గుర్తుంచుకోవాలి:
హల్లెలూయా స్తోత్రం అని చెప్పడం తప్పు కాదు
కానీ ప్రసంగంలో ప్రధానమైనది దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించడం, సువార్తలోని లోతైన సత్యాలను ప్రజలు అన్వయించుకునేలా ప్రోత్సహించడం.
ప్రసంగంలో సాధారణంగా ఈ పదాలు రావడం మంచిదే కానీ మాటి మాటికీ లేదా చాలా సార్లు ప్రసంగం మధ్యలో గ్యాప్ ని భర్తీ చేసుకోడానికి వాడడం మంచిది కాదు.
మన ముందు తరం వారు కూడా ఇలా చేశారు కాబట్టి చాలా మందికి ఇలా చెప్పడం ఆత్మీయత అనే అవగాహన కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే, దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో కొన్ని అలవాట్లు మార్చుకోడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రభువు సహాయం కోరుదాం. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మన ప్రసంగాలు దేవుణ్ణి మహిమ పరిచేవిగా, సంఘానికి క్షేమం కలిగించేవిగా ఉండును గాక. ఆమెన్.
మన హృదయం దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు నిజమైన స్తుతి స్తోత్రం మన నోటినుండి సహజంగా వస్తుంది.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment