మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో నొప్పి తగ్గింది. మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.
కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా!
అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!
అందుకే కాబోలు, పౌలు శ్రమల గురించి మాట్లాడుతూ " శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని తెలుసుకొని శ్రమలయందు అతిశయపడుదము" (రోమా 5:3,4) అంటాడు.
ఈ శ్రమలు కొన్ని రోజులు మాత్రమే అని దేవుడు రాయించిన వచనం నాకు గుర్తుకువచ్చింది.1 పేతురు 5:10 - తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు.
దేవుడు నమ్మదగినవాడు, శ్రమల్లో సైతం తోడుండే ప్రేమగలవాడు. క్రీస్తే మూలరాయిగా ఉండగా నీ శ్రమలను వృధాచేసుకోకు. నీ శ్రమలు దేవుణ్ణి మరింత దగ్గరిగా అనుభవించడానికి సహాయపడే సాధనాలు అని మరువకు.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment