ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.
ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.
సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు విడ్డూరం. దానికోసం వారిని సంఘ భవనానికి రమ్మని చెప్పడం ఎందుకు? ఇంట్లోనే కూర్చొని కూడా చూడొచ్చు.
అపోస్థలుడైన పౌలు, 1కొరిం 11లో మీరు కూడి వచ్చుట అనే మాటలు మళ్లీ మళ్లీ వాడతాడు. అంటే, భౌతికంగా సంఘం ఒక దగ్గర కలవాలి. అలా కలిసినప్పుడు ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఆయన బల్లను ఆచరించాలి, దేవుని వాక్యం ప్రజలకు సంఘ నాయకుల ద్వారా బోధించబడాలి, సంఘం పరస్పర ప్రేమలో ఎదగాలి. ఇది ఆదిమ సంఘం పాటించింది, చరిత్రలో చాలా సంఘాలు పాటిస్తున్నాయి కూడా.
దీనికి భిన్నంగా, పెద్ద స్క్రీన్ పెట్టి ప్రసంగాలు పోస్ట్ చేయడం సంఘ ఆరాధనను కేవలం రెండు మూడు గంటల కార్యక్రమానికి కుదించేశాయి. ప్రోగ్రామ్ కి హాజరైతే చాలు అనే తత్వాన్ని ప్రజల్లో నింపేశాయి. ఇది మంచి పరిణామం కాదు.
నాయకులు, సంఘానికి దగ్గరగా ఉండాలి, సంఘంలో నాయకులను సిద్ధపర్చాలి, సంఘ క్షేమం కోసం బోధ చేయాలి, బోధకులను సిద్ధపర్చాలి, అవసరమైతే ఇతర బోధకులను కూడా పిలవాలి, సంఘానికి విభిన్న బోధకుల ద్వారా దేవుని వాక్యం అందించాలి, అంతిమంగా సంఘము క్రీస్తు సారూప్యంలో ఎదగాలనే కోరిక కలిగుండాలి.
దేవుడు మనకు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment