లచ్చిమీ, లేవే, అయ్యో, నా పాణాన్ని పొట్టనవెట్టుకుండ్రు అని తన గుండెల మీద లచ్చమ్మ శవాన్ని వెట్టుకొని ఏడుస్తుండు రాములు. ఎవరో ఆమెను మెడ మీద కత్తితో పొడిచి చంపేశారు. ఊరవతల రైస్ మిల్లు దగ్గర శవం దొరికింది. లచ్చమ్మ, రాములు భార్యా భర్తలు. ఒకరంటే ఒకరికి మస్త్ ప్రేమ. రాములు పెద్ద కులంకి చెందినోడు. లచ్చమ్మ అదే ఊర్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన చిన్న కులపామె. మొదటిసారి లచ్చమ్మను సూడంగనే రాములు మనసు పారేసుకుని లచ్చమ్మని పెండ్లి చేస్కుంటనని వాళ్ల అయ్య దగ్గరికి పోయి "అయ్యా, లచ్చమ్మని నాకియ్యు, లగ్గం చేసుకుంటా" అని నేల వైపు చూస్తూ అడిగిండు. రాములు మంచోడని కష్టం చేసే పిల్లగాడని ఊరంతా తెలుసు. "అట్ల కాదయ్యా, మేము కిరిస్తానీయులం, మీరు పెద్ద కులం వాళ్ళు, ఇది జరిగేపని కాదుగానీ పోయిరా" అని లచ్చమ్మ తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. రాములు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. లచ్చమ్మ వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పాస్టర్ సారు రాములును కూసోబెట్టి బైబిల్ నుండి కొన్ని మాటలు సూయించి, మన సమస్య మన హృదయంలో ఉన్న పాపం, అది తీసేసి మనల్ని కాపాడ్డా...