1 సమూయేలు పుస్తకంలో దావీదు గొల్యాతును చంపే సన్నివేశం బైబిల్ మొత్తంలో ఒక అద్భుతమైన దేవుని కార్యంగా మనకు కనిపిస్తుంది. ఒక బాలుడు యుద్ధంలో వాడే యుద్ధోపకరణాలు వాడకుండా ఒక యుద్ధశూరుణ్ణి చంపడం కేవలం దేవుని శక్తి వలననే సాధ్యం అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథను ఎన్నో సార్లు మనం వినుంటాం, చదివుంటాం. అయితే, ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది.
1సమూ 18:7లో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి.
ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి పట్టణంలోకి ప్రవేశించాడో ప్రజలు ఇలా చెప్పడం సౌలుకు అసూయను కలిగించింది.
దావీదు అంతకుముందు నుండే సౌలు దగ్గరికి వచ్చి సితారా వాయిస్తూ దురాత్మ నుండి సౌలుకు ఉపశమనం కలిగించేవాడు (1సమూ 16:23). అంటే సౌలు, దావీదు ద్వారా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాడు.
సౌలు, గొల్యాతుతో యుద్ధం చేయడానికి భయపడ్డాడు (1సమూ 17:11).
సౌలు, ఎవరైనా గొల్యాతును ఓడిస్తే తన ఐశ్వర్యం ఇచ్చి, ఆ వ్యక్తికి తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు (1సమూ 17:25). అంటే, సౌలుకి ఫిలిస్తీయుల మీద విజయం చాలా అవసరం. తన అధికారం పేరు నిలబడాలంటే గొల్యాతు మీద విజయం చాలా అవసరం.
దావీదు గొల్యాతుతో యుద్ధానికి సౌలు అనుమతితోనే వెళ్లాడు (1సమూ 17:37). దేవుడు నీకు తోడుండు గాక అని చెప్పి మరీ పంపించాడు.
కానీ, ఎప్పుడైతే ప్రజలు తనకన్నా దావీదును మెచ్చుకున్నారో సౌలు నొచ్చుకోవడం ప్రారంభించాడు. తన పేరు మాత్రమే గొప్ప చేయబడాలని కోరుకున్నాడు.
మనతో ఉన్నవారు మనకన్నా మంచి పనులు చేసినప్పుడు సంతోషించకుండా అసూయ పడడం పాపం.
ఆ అసూయ సౌలుకు దావీదు మీద విషపు చూపు కలిగేలా చేసింది (1సమూ 18:9).
ఆ విషపు చూపు సౌలు దావీదును చంపేలా ప్రేరేపించింది (1సమూ 18:11).
ఫిలిష్తీయుల చేత చంపించాలని ప్రణాళిక వేశాడు (1సమూ 18:25).
సౌలు విషయంలో అసూయ, హత్య చేసేలా ప్రేరేపించింది. అసూయ ఇతరుల పట్ల కోపం ద్వేషం పెంచుకునేలా చేస్తుంది, సంబంధాలు నాశనం చేస్తుంది.

Comments
Post a Comment