Skip to main content

నాయకుల ప్రధాన పరిచర్య - సంఘ సహకారం

ఆదిమ సంఘములో,అంతా బాగుంది అనుకున్న సమయంలో, ఒక అలజడి రేగింది. అపోస్త 6 వ అధ్యాయంలో ఆ సమస్య తాలూకు సంగతులు మనం చదవగలం.

గ్రీకు భాష మాట్లాడే యూదులు తమ విధవరాండ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని హెబ్రీయుల మీద సణిగారు. ఈ వార్త అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వారు చాలా ప్రాముఖ్యమైన, సంఘానికి క్షేమభివృద్ధిని కలుగజేసే రెండు మాటలు చెప్పడం మనం చదువుతాము.

మొదటిది, మీలో ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఈ పనికి ఏర్పరుచుకోండి.
రెండవది, అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక ఉంటాము అని చెప్పారు.సంఘము దేవుడు ఉద్దేశించిన విధంగా ఈ లోకంలో పరిచర్య చేయాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం.

అన్నిపనులు సంఘ నాయకులు చేయకుండా,ఇతరులకు అప్పజెప్పడం మరియు ప్రాముఖ్యమైన పనులు సంఘ నాయకులు చేయడం.

సంఘ నాయకులు చేసే ప్రాముఖ్యమైన పని ఏమిటి?
సంఘము కోసం ప్రార్థన చేయడం మరియు సంఘాన్ని దేవునిలో పెంచి పోషించడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని సరైన అర్థ వివరణతో బోధించడం.
మిగతా పనులు సంఘ నాయకులు చేయకూడదని అర్థం కాదు గాని ఈ రెండు ప్రాముఖ్యమైన పనులు చేయకుండా వీటిని నిర్లక్ష్యం చేయడం మాత్రం సంఘానికి క్షేమం కాదు.
అయితే సంఘ నాయకులు ఈ రెండు పనులు చేయాలంటే సంఘము యొక్క సహకారం కూడా చాలా అవసరం.
సంఘ నాయకులకు, ఈ రెండు ప్రాముఖ్యమైన పరిచర్యలు చేయడానికి సంఘము ఏ విధంగా సహకరించగలదో, కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం.

1. మొదటిగా, సంఘ నాయకులకు ప్రసంగం కొరకు సిద్ధపడడానికి ప్రార్థించడానికి కావాల్సినంత సమయాన్ని మనం ఇవ్వాలి. సరైన అర్థ వివరణ చేసి బోధించడానికి దాదాపుగా 10 నుండి 12 గంటల సమయం పడుతుందని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు. ఈ సమయం ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. రాబర్ట్ గాడ్ఫ్రే అనే భక్తుడు " సంఘ సభ్యులు ఆ సమయాన్ని చిరాకుతో ఇవ్వకూడదు, కానీ ఆ బోధకుడు ఆ సమయాన్ని తీసుకోవాలని పట్టుబట్టాలి" అంటాడు. 
2. ఈ విధమైన సమయాన్ని వారికి ఇవ్వాలంటే, సంఘములో ఉన్న ఇతర పనులను, పరిచర్యలను సంఘపరిచారకులు మరియు సంఘ సభ్యులుచూసుకోవాలి.
3. సంఘ నాయకులు చిన్నచిన్న కార్యక్రమాలకు హాజరు అవ్వకపోతే సభ్యులు తప్పుగా అర్థం చేసుకోకూడదు.
4. సంఘ నాయకులు గృహ దర్శనానికి రాలేదని ఏవేవో ఊహించుకోకూడదు.
5. నాయకుల కౌన్సిలింగ్ ద్వారా, ప్రోత్సాహకరమైన మాటల ద్వారా ఎంతో క్షేమాభివృద్ధి లభిస్తుంది. దానిలో సందేహామేమీ లేదు కానీ, చాలా ప్రాముఖ్యంగా పుల్ పీట్ నుండి బోధించబడే దేవుని వాక్యము ద్వారా సంఘము ఆత్మీయంగా ఎక్కువ క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి, ముఖ్యమైన వాక్య పరిచర్య కోసం సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయాలి.

సంఘ నాయకులు కూడా అనుసరించాల్సిన విషయాలు చూద్దాం.

1. సమయాన్ని వ్యర్థముగా వృధా చేయకుండా వాక్యమును సరైన అర్థ వివరణ చేసి బోధించడానికి కష్టపడాలి. లోతుగా అధ్యయనం చేయడానికిఎక్కువ సమయాన్ని వెచ్చించాలి.అవసరమైన పుస్తకాలను కూడా చదవాలి.    2తిమోతి 4:2 - వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము.  దేవుని వాక్యం బోధించుట లేదా ప్రసంగించుట సంఘ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ పరిచర్య కోసం ఎక్కువగా ప్రయాసపడాలి.

2. సంఘములోని ఇతర పనులను బాధ్యతలను సంఘపరిచారకులకు అప్పజెప్పాలి.

3. అన్నీ మనమే చేయాలనే తత్వాన్ని తొలగించుకోవాలి. సంఘ సభ్యులను సంఘ పరిచర్యలో అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి.
4. అన్ని కార్యక్రమాలకు నేను తప్పకుండా వెళ్లాలి, లేకపోతే వారు తప్పుగా అర్థం చేసుకుంటారు అనే తత్వం నుండి కూడా విడిపించబడాలి.
5. చివరిగా, దేవుని వాక్యం మాత్రమే ప్రజల జీవితాలను మారుస్తుందని నమ్మి, నమ్మకంగా దేవుని వాక్యమును సంఘానికి బోధించాలి.

దేవుడు ఉద్దేశించిన విధముగా మన సంఘాలను కట్టుకోడానికి దేవుడు సహాయం చేయును గాక.

- డా. శంకర్ బాబు 





Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...