Skip to main content

చిన్న సర్జరీ - పెద్ద పాఠం

మా రెండవ పాపకు ఒకవైపు చెవిపోగు చర్మంలో ఇరుక్కుపోయింది. 
ఆ చెవిపోగు ఉన్న భాగం కాస్త వాపు వచ్చి, తనకు అప్పుడప్పుడు నొప్పి కలిగేది. 
అది త్వరగా తీయించే పని మేము కాస్త నిర్లక్ష్యం చేశామని ఒప్పుకోవాల్సిందే.
అయితే, రెండు రోజుల క్రితం మా ఫ్రెండ్ ENT డాక్టర్ దగ్గరికి పాపని తీసుకెళ్లాము. చెవి దగ్గర కాస్త మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సర్జరీ స్టార్ట్ చేశారు. 
చర్మం కింద వాపు, కొంచెం చీము కూడా ఉండడంతో ఆ పోగు తీయడం కష్టం అయింది. చివరికి తీయగలిగాము. 
ఆ సమయంలో తనకి కాస్త నొప్పి కలిగినా, ఆ తర్వాత తనకి మంచిది కాబట్టి ఈ ప్రక్రియ తప్పలేదు.
లేదంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆ చెవి మీద పెద్ద సర్జరీ ఆయ్యేదేమో.

ఎందుకు ఈ విషయం ఇంతగా వివరిస్తున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే అది ఆత్మీయ జీవితానికి ఇన్ఫెక్షన్ లాగా హానికరం అవుతుంది. 

ఉదాహరణకు, చిన్న చిన్న అబద్ధాలే కదా అని అబద్ధాలు చెబుతూ పోతే, నిన్ను ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుంది.
అబద్ధం చిన్నదైనా పెద్దదైనా పాపం కదా.
1 నిమిషం మాత్రమే ఉండే యూట్యూబ్ రీల్స్ అని చూస్తూ పోతే, ఎంతో సమయం వ్యర్థమైపోతుంది. 
వ్యభిచారం చేయట్లేదు కానీ కేవలం నగ్న చిత్రాలు, వీడియోలు చూస్తున్నాను.
అదికూడా జస్ట్ 2 నిమిషాలే అనుకుంటే, ఆ తర్వాత పోర్నోగ్రఫీకి అలవాటై, జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది.

పాపం మెల్లిగానే మొదలైతుంది, ఆ తర్వాత నిన్ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని నిన్ను నాశనం చేస్తుంది.
నీ ఆత్మీయ జీవితానికి హాని కలిగించే చిన్న విషయం ఏదైనా, చిన్నగా ఉన్నపుడే తీసేసీ పడెయ్. లేదంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.

1 కొరింథీ 5:6 - పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటినీ పులియజేయునని మీకు తెలియదా ? 

1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి.

దేవుడు మనకు అనుగ్రహించిన కృప,శక్తి, జ్ఞానం అనుసరించి జాగ్రత్తగా దేవుని కోసం జీవించుదుము గాక. ఆమేన్.

- డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...