Skip to main content

నిలిచిపోయిన ట్రాఫిక్ - సార్వభౌముడైన దేవుడు

ఉదయం టిఫిన్ తినకుండానే డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీ ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరాను. త్వరగా ఇంట్లో లంచ్ చేసి ఒక ఫ్యామిలీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. 
ఇంకో 30 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు కానీ, అకస్మాత్తుగా ఒక దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకబ్బా అని ఆలోచిస్తే, ఆ రూట్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చారని బైట కనిపిస్తున్న ఫ్లెక్సీలు చూస్తే అప్పుడు తట్టింది. ఒక 10 నిమిషాల్లో అంతా క్లియర్ అయిపోతుంది అనుకున్నాను కానీ దాదాపు రెండు గంటలు అక్కడే ట్రాఫిక్ లో ఉండిపోయాను.

జాతీయ రహదారి కావడంతో కొన్ని వందల వాహనాలు, కొన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఏసీ వేసుకొని సీఎం గారు ఎక్కడున్నారు, ఆయన ప్రసంగం ఎప్పుడు ముగిస్తారు అని మధ్య మధ్యలో లైవ్ కవరేజ్ చూస్తూ ఉన్నాను. 
ఒక పక్క కోపం, మరో పక్క ఆకలి, ఆలస్యం అవుతుందని చికాకు. సీఎం గారి సభ నేనున్న ప్రదేశానికి దాదాపు 8-10 కిలోమీటర్లు. ఇక్కడి నుండే వాహనాలను ఆపేయడం ఏంటి? సామాన్య ప్రజల పరిస్తితి ఏమిటి ? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ ట్రాఫిక్ లో ఉంటే ఎలా? అని ఎన్నో ప్రశ్నలు. 

చాలా ఆలస్యం అవుతుందని సాయంత్రం వెళ్లాల్సిన ప్రోగ్రాం వాయిదా వేశాను. 
ఒక రెండు గంటల తర్వాత ఇంటికి వెళ్ళాను. లంచ్ చేస్తూ నా భార్యతో పైన వేసిన ప్రశ్నలు అడిగాను. 
నా చిరాకును చూసి "ఇలా జరుగుతుందని దేవుడికి తెలుసు కదా! వాళ్ళను ఎందుకు నిందిస్తున్నారు? మీరు ఆ స్థితిలో ఉంటారని దేవునికి తెలియదా? దేవునికి ఓపికనివ్వమని ప్రార్థన చేస్తున్నారా? " అని అడిగింది.
 
కరెక్టే కదా, అదంతా దేవునికి తెలుసు. 
ఆ స్థితిలో దేవుడు నాకు నేర్పించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఒపికనే.
నిజంగానే, గత వారాల్లో నేను దేవా నాకు ఓపిక (patience) ఇవ్వు అని ప్రార్థించాను.
ఆ ఓపిక నాకు దయచేయడానికి దేవుడు నా ఓపిక పరీక్షకు గురయ్యే పరిస్థితి నాకిచ్చాడు.

మూడు విషయాలు మళ్లీ గుర్తుకొచ్చాయి.

1. దేవుడు సార్వభౌముడు అని అనుకూల పరిస్థితుల్లో కేవలం బుర్రలో నమ్మితే సరిపోదు, ప్రతికూల పరిస్థితుల్లో సైతం నమ్మాలి.

2. మన సమస్య మన చుట్టూ గల ప్రతికూల పరిస్థితులు కాదు, మనమే అనే విషయం తెలుసుకోకపోతే ప్రతి రోజూ ఇతరుల్ని నిందించే అవకాశం ఉంటుంది.

3. ఏ లక్షణం గురించి ప్రార్తిస్థామో దేవుడు మనల్ని అదే లక్షణం పాటించడానికి ప్రతికూల పరిస్థితులల్లోకి మనల్ని తీసుకెళ్తాడు. 

దేవుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞాని, అన్నిటి మీద అధికారం గల సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. 
కీర్తనల గ్రంథము 115:3 - మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు.

ఆయన పిల్లలుగా అన్ని పరిస్థితుల్లో ఆయన్ను స్తుతిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మహిమ కోసం జీవించుదుము గాక. 
ఆమేన్. 

డా.శంకర్ బాబు 



Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...