మార్కు 11:25,26 - మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
పైన ప్రస్తావించబడిన వచనం స్వయానా ప్రభువైన యేసుక్రీస్తు వారే తన శిష్యులతో చెప్పారు. మీకు ఎవరి మీదనైనా ఏదైనా విరోధ భావన ఉంటే, మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని క్షమించండి అని ఇక్కడ బోధిస్తున్నారు. విరోధమంటే, ఎవరిమీదనైనా కోపం, ద్వేషం, అసూయ మొదలైనవి అని అర్థం. సాధారణంగా, ఇతరుల మీద కోపం లేదా ద్వేషం ఎందుకుంటాయి? ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు లేదా మన అంచనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిపై కోపం కలుగుతుంది, అది ద్వేషంగా మారుతుంది. మనకన్నా ఎక్కువగా ఇతరులను దేవుడు దీవించినప్పుడు మనకు అసూయ కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొదటగా వారి కొరకు ప్రార్థన చేయమని, రెండవదిగా వారిని క్షమించమని ప్రభువు ఇక్కడ చెబుతున్నాడు. ఇది కష్టమైనదిగా అనిపించొచ్చు కానీ, అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే, ఒకవేళ క్షమించడం అసాధ్యమైతే ప్రభువు క్షమించమని చెప్పేవాడు కాదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, మనం ఇతరులను క్షమించినప్పుడు పరలోక తండ్రి కూడా మన పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ, ఇతరులను క్షమించడం అసాధ్యమని మనమంటున్నామంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన మనల్ని దేవుడు క్షమించడం కూడా అసాధ్యమని మనమంటున్నట్లే. ఒకవేళ దేవుడు మన పాపాలు క్షమించకపోతే మన పరిస్థితి ఏమిటి? కాస్త ఆగి ఆలోచిద్దాం.
మరో ప్రాముఖ్యమైన విషయం ఈ వచనంలో నేను గమనించాను. చాలాసార్లు, ఇతరులను వెంటనే క్షమించడం సాధ్యం కాదని చెప్పి కొంత సమయం తీసుకోమని చెబుతారు. నేను కూడా చాలాసార్లు ఇలానే కౌన్సిలింగ్ ఇచ్చాను. అయితే, ఇక్కడ అటువంటి అంశం మనకు కనిపించదు. సమయ ప్రస్తావన లేదు కాబట్టి, వెంటనే క్షమించాలి అని కూడా చాలా బలంగా చెప్పలేము కానీ, మన పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నపుడు, దేవుడు వెంటనే తన క్షమాపణ దయచేయాలని మనం కోరుకుంటాం. దేవుడు ఆ విధంగా క్షమిస్తాడు కూడా. మన పాపాలు ఒప్పుకున్నపుడు, కాస్త టైమ్ తీసుకొని క్షమిద్దాం అని దేవుడు అనుకోడని నేననుకుంటున్నాను.
దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఆయన క్షమిస్తాడు, మనం మనుషులం కాబట్టి టైం తీసుకుంటాం అని మనం అనొచ్చు. అది కూడా కరెక్టే. అయితే, ఆ సమయం ఎన్ని రోజులు అనేదే ఇక్కడ ప్రశ్న.
బైబిల్ మొత్తంగా చూస్తే కూడా క్షమాపణ విషయంలో సమయం గూర్చిన ప్రస్తావన కనపడదు. ఉదాహరణకు, ఎఫెసీ 4:31,32 - సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
కొలస్సీ 3:13 - ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
ఈ వచనాలను గమనిస్తే, గాయపర్చినవారిని సహిస్తూ వారిని క్షమించండి అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ వారు వచ్చి క్షమాపణ అడిగితే తప్పక క్షమించాలి. లూకా 17:3,4 వచనాల్లో “నీ సహో దరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపు తిరిగి మారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను” అని ప్రభువు చెబుతాడు. క్షమించడానికి సమయం తీసుకోవడం తప్పుకాదు కానీ, ఆ సమయాన్ని గాయపర్చినవారిపై మరింత ద్వేషాన్ని, కోపాన్ని కలిగుండడానికి కాకుండా క్షమించడానికి సిద్ధమయ్యేలా తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే, అంతిమంగా మనం క్షమించడానికే పిలవబడ్డాం కానీ, మనసులో ద్వేషాన్ని పెంచి పోషించడానికి పిలవబడలేదు. అందుకే, మనం మన భావోద్వేగాల మీద ఆధారపడకూడదు. మన హృదయాలను దేవుని వాక్యంతో సరిచూసుకుంటూ క్షమాపణ వైపు మన హృదయస్థితిని మార్చుకోడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. అది వీలైనంత త్వరగానే చేయాలి. ఎందుకంటే, ఇతరులను క్షమించి ప్రేమించి కొనసాగడం అపవాదికి ఇష్టముండదు. వాడు, ఎవరిని మ్రింగుదునా అని చూస్తూ ఇటువంటి అవకాశాలను వాడుకొని సమాధానపడకుండా అడ్డుపడుతుంటాడు.
ప్రభువును ఎరుగనివారు, తమను గాయపర్చినవారు వచ్చి క్షమాపణ చెబితే వారిని క్షమించొచ్చు లేదా క్షమించకపోవచ్చు. క్రీస్తు శిష్యులు మాత్రం తమను గాయపర్చినవారు వచ్చి క్షమాపణ చెబితే, తప్పక క్షమించాలి, వారు క్షమాపణ చెప్పకపోయినా వారి గురించి ప్రార్థన చేసి వారిని క్షమించే హృదయం కలిగి ఉండేలా సిద్ధపడాలి. అలాగని, అసలు ఏం జరగనట్లు ఉండాలని, గాయపడినందుకు బాధ అనుభవించడం తప్పు అని కూడా నేను చెప్పట్లేదు. అయితే, ఆ సమయంలో దేవుని వైపు తిరిగి “దేవా, ఆ వ్యక్తి వలన గాయపర్చబడ్డాను, బాధగా ఉంది, నన్ను స్వస్థపర్చండి. ఆ వ్యక్తిని క్షమించే హృదయం నాకివ్వండి” అని ప్రార్థన చేయడం మంచిదేమో!.
గ్రాహం స్టెయిన్స్ గారిని ఆయన పిల్లలను సజీవ దహనం చేసినప్పుడు, గ్రాహం స్టెయిన్స్ గారి భార్య, కొద్ది రోజులకే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా “తన భర్తను పిల్లలను చంపినవారిని క్షమిస్తున్నాను” అని చెప్పింది. చంపినవారు అవిశ్వాసులు కాబట్టి అలా చేసింది అని మనం అనొచ్చు. అవిశ్వాసులు పాపం చేసి గాయం చేసినప్పుడే వారిని మనం వెంటనే క్షమిస్తే, క్రీస్తు శరీరమైన సంఘంలో అవయవాలుగా, క్రీస్తు కుటుంబంలో సోదర సోదరీమణులుగా ఉన్న వారు గాయం చేస్తే వెంటనే క్షమించకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? మనం మరి ఎక్కువగా క్షమించుకోవాలి కదా!
నేను భార్యాభర్తల మధ్య, సంఘ సభ్యుల మధ్య సమస్యలు పరిష్కరించడానికి కౌన్సెలింగ్ తరచుగా చేస్తుంటాను. సంఘంలో ఒకరినొకరు గాయపర్చుకోవడం, ఒకరినొకరు క్షమించుకోకుండా మనుసులో కోపం ద్వేషం పెట్టుకుని కొనసాగడం మామూలు విషయంగా మారిపోయిన రోజుల్లో మనం ఉన్నామని చెప్పక తప్పట్లేదు. అవును, ప్రభువు మహా కృపలో రక్షించబడి కొనసాగుతున్నా ఇంకా మనం పాపముతో పోరాడుతున్న విశ్వాసులమే. అయితే, ఈ అవగాహన ఇతరులను గాయపర్చడానికి, వారిని క్షమించకుండా చాలా రోజులు కొనసాగడానికి లైసెన్స్ అవ్వకూడదు. దేవుని వాక్యమే మన జీవితాలపై అంతిమ అధికారం గలది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందించాలో దేవుని వాక్యం నుండే మనం నేర్చుకోవాలి, పాటించడానికి ప్రయత్నం చేయాలి.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment