Skip to main content

మార్పు - The Change



 ఈ సంవత్సరం ప్రారంభంలో మా సంఘానికి ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముని అమ్మగారు క్రైస్తవురాలు. ఈ తమ్మునికి క్రైస్తవ్యం గురించి మంచి అభిప్రాయం కూడా లేదు. అమ్మ చెబుతుంటే వినేవాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఇదంతా నిజమేనా? దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఈ తమ్మునితో కొన్ని రోజులు ఉండడానికి ఆ తల్లి హైదరాబాద్ వచ్చారు. మా సంఘంలో గల ఒక కుటుంబం వీరిని సంఘ సహవాసానికి ఆహ్వానించారు. తల్లి గారి ఒత్తిడితో రావడానికి ఈ తమ్ముడు ఒప్పుకున్నాడు. మొదటి రెండు వారాలు కష్టంగా కూర్చున్నాడు. నేను ఒక ఆదివారం నాడు “తమ్ముడు, క్రైస్తవ్యం గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని మాటలు కలిపాను. దేవుడు నిజమా? అసలు మీరు చెప్పేది నిజమేనా అని చాలా పారదర్శకంగా అడిగాడు. మీరు చెబుతుంది అసలు అర్థం కావట్లేదని కూడా ఒప్పుకున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు తిరిగి అడిగి, కొన్ని విషయాలు చెప్పి “సత్యం తెలుసుకోవాలని ఆశ ఉంటే సరిపోదు, ఆ సత్యం గురించి పరిశోధించాలి కూడా” అని సంఘ సహవాసానికి రమ్మని ప్రోత్సహించాను. అప్పటికే సంఘంలో ఉన్న బ్రదర్స్ తనతో సువార్త పంచుకున్నారు. కొందరు వారిని ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించారు. 

ఆ తమ్ముడు పెద్దగా ఇష్టం లేకపోయినా సహవాసానికి రావడం ప్రారంభించాడు. ప్రార్థన కూడికకు, పురుషుల కూడికకు వచ్చాడు. తనతో చాలా సార్లు బ్రదర్స్ మాట్లాడడం చూసి నేను “బ్రదర్స్, తమ్మునికి మాటిమాటికీ మళ్ళీ మళ్ళీ సువార్త చెప్పి ఒత్తిడి చేయకండి,ఎలాగూ సహవాసానికి వస్తున్నాడు కాబట్టి తన కోసం ప్రార్ధన చేయండి, ప్రేమ చూపించండి” అని వాట్సాప్ గ్రూపులో చెప్పాను. 

ఈ క్రమంలో క్రీస్తు సువార్త అనే పుస్తకం ఇచ్చి చదవమని చెప్పాము. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం ప్రారంభించాడు. మెల్లిగా పాపం అంటే ఏమిటో, రక్షకుని అవసరత ఏమిటో తనకు అర్థమవుతూ వచ్చింది. బైబిల్ చదవడం ప్రారంభించాడు. సత్యం గురించి పరిశోధించడం ప్రారంభించాడు. ఆన్లైన్లో వివిధ వ్యాసాలు చదివాడు. సహోదరులతో కలిసినపుడు ప్రశ్నలు వేశాడు. అదే సమయంలో సంఘంగా మేము తన రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. 

ఒకరోజు తన తల్లి గారు నా దగ్గరికొచ్చి “అన్నా, మా వాడు ఇప్పుడు అప్పటిలా లేడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు అనిపిస్తుంది, బాప్తీస్మం గురించి ఆలోచించండి” అని చెప్పింది. 

నేను “అక్కా, తను రక్షించబడితే దేవునికి స్తోత్రం. కానీ ఇంకాస్త ఆగుదాం, అప్పుడే నిర్ణయించలేము, మీరు ప్రార్థన చేయండి” అని చెప్పాను. ఈ క్రమంలో తన జీవితాన్ని కూడా గమనించాము. సంఘ కార్యక్రమాల్లో పాల్గొవడం, సంఘ భవనంలో ఎవరూ చెప్పకపోయినా పనులు చేయడం, పని చెప్పినపుడు విధేయత కలిగి చేయడం ఇవన్నీ కూడా పరిశీలించాము. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ తమ్మునితో సంఘ పెద్దలుగా మేము మాట్లాడాము. ఆ పిదప సంఘంలో గల ఇతర సోదరులను కూడా తనతో మాట్లాడమని చెప్పాము. 

ప్రభువు కృపను బట్టి అందరూ కూడా ఈ తమ్ముడు రక్షించబడ్డాడు అనే ప్రాథమిక సమాచారం ఇచ్చారు. చివరిగా, ఆ తమ్ముడు కూడా రక్షించబడ్డాను అనే నిశ్చయతను వ్యక్తపరిచాడు. 

ఇంకొన్ని రోజులు ఆగి తనకి బాప్తీస్మం యొక్క అవసరతను చెప్పి, ఆ తరగతులకు హాజరవమని ప్రోత్సహించాము. ఆ తరగతులు హాజరయ్యాడు. గత ఆదివారం సంఘము ఎదుట బాప్తీస్మంలో సాక్ష్యమిచ్చాడు. 

దేవునికే మహిమ చెందును గాక. ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే తన పాపాన్ని ఒప్పించాడు, ఆయనే రక్షించాడు.   

మా కళ్ల ఎదుటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని చూసి ఎంతో సంతోషించాము. 

ఈ క్రమమలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు : 

1. సంఘం కొత్తగా వచ్చేవారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. వారిని ప్రేమతో ఆహ్వానించాలి, వారిని పలకరించి, మాట్లాడాలి.

2. మిగతా రోజుల్లో కూడా వారిని కలిసి సమయం గడపాలి, ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. 

3. ఈ క్రమంలో సువార్త చెప్పాలి. 

4. కొత్త వ్యక్తి ఆ ఒకటే ఆదివారం వస్తారని చెబితే, ఆ వ్యక్తికి సువార్త పట్ల అవగాహన లేదని అనిపిస్తే, తప్పకుండా సువార్త చెప్పి ప్రోత్సహించాలి. 

5. క్రమంగా ఆ వ్యక్తి సహవాసానికి వస్తుంటే, క్రమంగా తనతో మాట్లాడుతూ,ప్రేమ చూపిస్తూ ఉండాలి.

6. ఆ వ్యక్తి కోసం క్రమంగా ప్రార్థించాలి.  

7. సంఘమంటే కుటుంబం, ఆ కుటుంబంలో తాను ఒక సభ్యుడని, మిగతా వారు తన కుటుంబ సభ్యులని భరోసా ఇవ్వాలి.

8.  తన కష్ట సమయాల్లో అవసరమైన సూచనలను, సహాయాన్ని అందించాలి.

9.  సంఘముగా ఆ వ్యక్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయాలి.

10. రక్షణ దయచేసేది దేవుడే అని ఆయనకు మాత్రమే మహిమ చెందించాలి. 

 సువార్త చెప్పడం అనే పరిచర్య సంఘ కాపరులే కాదు, సంఘ సభ్యులు కూడా చేయాలని మర్చిపోవద్దు. 

ఈ తమ్ముణ్ణి సంఘానికి ఆహ్వానించింది సభ్యులు, తనతో మాట్లాడింది కాపరులు మరియు సభ్యులు, తనని ఇంటికి ఆతిథ్యానికి పిలిచింది కాపరులు,సభ్యులు. దేవుడు సంఘము ద్వారా కూడా తాను ఎన్నుకున్న ప్రజలను రక్షిస్తాడు అనే సత్యం మరోసారి రుజువయ్యింది. 

ఈ విషయం మీతో పంచుకోవడంలో ఉద్దేశ్యం, మేమేదో గొప్ప పని చేశామని జబ్బలు చరుచుకోడానికి కాదు. దేవుడే ఈ కార్యం చేశాడు అని గర్వంగా చెబుతున్నాను. 

సంఘముగా ఈ బాధ్యత మీరు కూడా కలిగియున్నారని మిమ్మల్ని ప్రోత్సాహించాలని పంచుకుంటున్నాను. 

దేవుడు ఇటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండడానికి సహాయం దయచేయును గాక. 


- డా.శంకర్ బాబు 

 

 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...