Skip to main content

మీ పాస్టర్లను గౌరవించండి


సంఘములో విశ్వాసుల జీవితాలను కాయడానికి దేవుని చేత నియమింపబడ్డ వారే సంఘ కాపరులు (అపోస్త 20:28). సంఘ కాపరుల ప్రధానమైన పరిచర్యలు, దేవుని వాక్యం బోధించడం మరియు సంఘం కొరకు ప్రార్థించడం (అపోస్త 6:4). 

కేవలం ఈ రెండు మాత్రమే కాపరులు చేయాలని ఇక్కడ అర్థం కాదు కానీ, ఇవి అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతలు అని తెలుసుకోవాలి. ఎందుకంటే, దేవుని వాక్యం సరిగా బోధించబడితే, క్రైస్తవ జీవితాలకు చాలిన దేవుని వాక్యమే, విశ్వాసుల జీవితాలను చక్కపరుస్తుంది, సరిదిద్దుతుంది, ప్రోత్సాహపరుస్తుంది. 

వాక్యం బోధించడం చాలా తేలికైన పని కూడా కాదు. ఒక వాక్యానుసారమైన ప్రసంగం సిద్ధపర్చడానికి దాదాపు 10-15గంటల సిద్ధపాటు సమయం అవసరం పడుతుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, సంఘంలో జరుగుతున్న ఇతర పరిచర్యలను కూడా కాపరులు పట్టించుకుంటారు కాబట్టి, చాలా సమయం వీటికి కూడా ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా విశ్వాసులతో మాట్లాడటం, ప్రార్థించడం ఇలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎక్కువగా కష్టపడతారు. అటువంటి సంఘ కాపరులను విశ్వాసులు గౌరవించడం,వారికి విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం.

పౌలు అదే మాట 1 థెస్స 5:12,13 లో “మరియు సహోదరులారామీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము” అంటాడు. ఇక్కడ సంఘ కాపరులు మరియు నాయకులు కూడా అని అర్థం చేసుకోవచ్చు. 

అందుకే పేతురు కూడా 1 పేతురు 1:5 లో, చిన్నలారామీరు పెద్దలకు లోబడియుండుడి అని చెబుతాడు. 

 

ఏ విధంగా సంఘ కాపరులను గౌరవించొచ్చు? మరియు ప్రేమను వ్యక్తపరచొచ్చు? 

 

1.      ప్రతి ఆదివారం కష్టపడి నమ్మకంగా దేవుని వాక్యమును మనకు బోధిస్తున్న పాస్టర్లను అభినందించండి. వాక్యము ద్వారా మీరు ఏ విధంగా ప్రోత్సహించబడ్డారో, సరిచేయబడ్డారో, దేవుని గురించి నేర్చుకున్న సత్యాలేమిటో చెప్పండి. ఆయన ప్రయాసను అభినందించండి. 

మనం చెప్పే ఈ మాటలు ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి.

 

2.    సంఘ కాపరుల గురించి ప్రార్థన చేయడం ద్వారా ప్రోత్సాహపరచొచ్చు. అయితే, ఈ విషయం వారి దగ్గరికి వెళ్లి “ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఏమైనా ప్రార్ధనా విన్నపాలు ఉన్నాయా?” అని అడగడం కూడా మంచిది. విశ్వాసులు తన గురించి క్రమంగా ప్రార్థన చేస్తున్నారు అనే విషయం తనకి గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. 

 

3.    సంఘ కాపరులు పరిపూర్ణ వ్యక్తులు కాదని, వారు కూడా బలహీనులే అని అర్థం చేసుకొని వారి బాధ్యతల్లో, వారి పనుల్లో ఏవైనా తప్పులు దొర్లితే, ఏవైనా మర్చిపోతే క్షమించండి. 

అలాగని వారు పాపం చేస్తే కూడా మాట్లాడకుండా, వారిని ప్రేమతో సరిచేయకుండా ఉండమని అర్థం చేసుకోకూడదు. తప్పకుండా పాపం సరిచేయాల్సిందే. కానీ, పాస్టర్లు తీసుకునే కొన్ని నిర్ణయాలు సరిగా పనిచేయకపోతే వారిని క్షమించి, ప్రోత్సహించండి. 

 

4.    సంఘ కాపరులు మన జీవితాలను కాసే నాయకులు కాబట్టి, జీవితంలో తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాలు వారితో పంచుకోండి. ఒకవేళ మన నిర్ణయాలు తప్పిపోయి మనం  ఇబ్బందుల్లో పడితే, మళ్ళీ మన గురించి ప్రార్థించేది, ప్రోత్సహించేది సంఘ కాపరులే కాబట్టి ముందే వారి సలహాలు తీసుకోవడం మంచిది. 

సామెతలు 11:14 - నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

అలాగని, ప్రతి చిన్న సంగతిని, నిర్ణయాన్ని వారికి చెప్పాలని కూడా అర్థం చేసుకోకూడదు. అంతమాత్రాన క్రైస్తవ జీవితానికి మరియు సంఘానికి సంబంధించిన విషయాలు, నిర్ణయాలు చెప్పకుండా నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మన గురించి ఆలోచించే, ప్రోత్సాహపరిచే నాయకులకు మన నిర్ణయాలు చెప్పడం వారిని గౌరవించడమే అని మర్చిపోకూడదు.  

 

5.    ఇతర పాస్టర్లతో మీ సంఘ నాయకులను పోల్చుకోకుండా ఉండాలి. 

ఇతర సంఘ కాపరులు ఎంత మంచి బోధకులైనా, ఆ సంఘాల్లో సభ్యులు ఎందరో ఉన్నా, 

ఆ వేరే సంఘ నాయకులు మనల్ని వాక్యంలో పోషించట్లేరు, మన కొరకు వారు ప్రార్థించటం లేదు, మనకేదైనా సమస్య వస్తే ఇతర సంఘ కాపరులు మన దగ్గరికి రారు, ఆ సమస్య నుండి పరిష్కారం చూపడానికి మనతో మాట్లాడరు. అసలు మన జీవితాల మీద జవాబుదారులుగా ఇతర సంఘ కాపరులు లేరు. 

అలాగని ఇతర వాక్యానుసారమైన సంఘ నాయకుల ప్రసంగాలు వినకూడదని, వారి పుస్తకాలు చదవొద్దని అర్థం చేసుకోకూడదు. ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు ఎవరి దగ్గరి నుండైనా నేర్చుకోవచ్చు. 

 

ఇక్కడ ఒక విషయం కూడా మాట్లాడుకుందాం. 

సంఘ కాపరులు మరియు నాయకులు వారి బాధ్యతలను ప్రభువు కొరకే చేయాలి (1 కొరింథీ 10:31) కానీ, విశ్వాసుల నుండి గౌరవాన్ని,అభినందనలను పొందుకోవడానికి చేయకూడదు. వారు సంఘ పరిచర్యలో పడే శ్రమ దేవుని వైపు చూస్తూ మాత్రమే చేయాలి కానీ విశ్వాసుల అభినందనలు, కృతజ్ఞతలు, బహుమానాల వైపు చూస్తూ చేయకూడదు. దేవుణ్ణే సంతృప్తిగా కలిగియుండి, దేవుడు అప్పజెప్పిన బాధ్యతలు నమ్మకంగా దేవుని మహిమ కొరకు మాత్రమే చేయాలి.  

 

విశ్వాసులుగా, గొప్ప ప్రసంగాలను బోధించేవారిని లేదా అద్భుతమైన ఆన్లైన్ బ్లాగులను వ్రాసేవారిని లేదా విజయవంతమైన పరిచర్యలను నడిపిస్తున్నవారిని గుర్తించమని పౌలు చెప్పడం లేదు.  

" మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము” అంటున్నాడు. 

మన సంఘములో పరిచర్య చేస్తున్న నాయకులు, మనల్ని దేవునిలో నడిపించే పని చేస్తున్న కాపరులు మన గౌరవానికి  అర్హులు అంతే కాదు, తప్పు చేస్తే మనల్ని ప్రేమతో మందలించే,  సరిదిద్దే సంఘ నాయకులు కూడా మన గౌరవానికి అర్హులు. కాబట్టిమన సంఘ నాయకులను గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్ధన చేద్దాం. వారు సంతోషముతో ఈ పరిచర్య చేయడానికి సహాయ సహకారాలు అందిద్దాం.

హెబ్రీ 13:17 - మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారువారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాకఆనందముతో చేయునట్లు వారి మాట వినివారికి లోబడియుండుడి.

 

-      డా. శంకర్ బాబు 

 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...