Skip to main content

ఇక్కడ కల్పనా కథలు అమ్మబడును

పాపని స్కూల్ లో జాయిన్ చేద్దామని తనని తీసుకొని బైకులో బయల్దేరాడు శంకర్. 
అడ్మిషన్ ఫార్మ్ లో ఏమేమి రాయాలో తలుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు రాగానే ఆ రోడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమాత్రం గుంతలు లేకుండా చక్కగా ఉంది. 
చాలా క్రమశిక్షణగా కార్లు, బైకులు వెళ్తున్నాయి, అసలు హార్న్ సౌండ్స్ వినపడటమే లేదు. 
ఇది మా పట్టణమేనా? రాత్రికి రాత్రి ఏమైంది ఈ నగరానికి అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు.
రోడ్డు మీద అసలు చెత్త కనిపించడం లేదు. ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఆపగానే పరుగెత్తుకొని వచ్చే పిల్లలు కూడా అక్కడ లేరు. కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరైనా వచ్చి ఇలా మార్చేసారేమో అనుకున్నాడు శంకర్.
అంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా, సైడ్ నుండి వచ్చి బైక్ ని గుద్దేసాడు ఓ యంగ్ మ్యాన్. 
శంకర్ మరియు పాప ఇద్దరూ కింద పడ్డారు. పాపకి తనకి ఏం అవ్వలేదని ఊపిరి పీల్చుకున్నాడు. బట్టలమీద పడ్డ దుమ్ము దులిపేసుకుంటుంటే,
సారీ అంకుల్, నాదే తప్పు, సారీ అంటూ దండం పెడుతున్న యవ్వనస్తుణ్ణి చూస్తూ విస్తుపోయాడు. తప్పు మనదైనా, ఇటువంటి పరిస్థితిలో పక్కవాడినే  టార్గెట్ చేసి పైసలు వసూలు చేయడం కామన్ కదా! కానీ ఇక్కడ రివర్స్ గా జరుగుతుంది. పర్లేదు బాబు, దెబ్బలు తగిలాయా, హాస్పిటల్ కి పోదాం రా, ట్రీట్మెంట్ చేసి పంపిస్తా అన్నాడు శంకర్. 
లేదు అంకుల్, చిన్న దెబ్బలే ఇవి, సారీ అని బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ యంగ్ హీరో. యంగ్ జనరేషన్ ఇలా తగ్గి మాట్లాడ్డం అరుదు అని బయల్దేరాడు శంకర్.
పెట్రోల్ కొట్టిద్దామని బంకుకి వెళ్తే పెట్రోల్, డీజిల్ మీద ప్రభుత్వం 50 రూపాయలు తగ్గించింది అని తెలుసుకొని తెగ ఆనందపడ్డాడు.
రోడ్డు పక్కన ఏదో కార్యక్రమం జరుగుతుండడం గమనించి, " ఎంటి ఈ హడావుడి" అని అడిగాడు. ముఖ్యమంత్రి గారు ఈ మురికివాడ అంతా కలయతిరుగుతున్నారు అని జవాబిచ్చాడు కిళ్లీ కొట్టు కృష్ణ. ప్లెక్సీలు లేవు, పోలీస్ బలగాలు లేవు, 
పెద్ద కాన్వాయ్ లేదు, ప్రజల గుంపు లేదు. ఒక పది మంది కాలి నడకన వెళ్తున్నారు, వారిలో ఒకరు ముఖ్యమంత్రి గారు. మన రాజకీయ నాయకులు ఇలా చేయరే, అంతా వింతగా ఉంది అనుకుంటూ సాగిపోయాడు.
స్కూల్ కి వెళ్ళగానే, ప్రిన్సిపల్ గారిని కలిసి, నేరుగా అడ్మిషన్స్ చేసే ఆఫీస్ కి వెళ్ళాడు. 
అడ్మిషన్ ఫార్మ్ నింపుతుంటే మతం,కులం అనేవి కనిపించలేదు. ఇవి ఎప్పుడు తీసేశారు అని సంతోషిస్తూ డబ్బు కట్టి తిరిగి ఇంటికి బయల్దేరారు. 
కాస్త పెద్ద ఇల్లు అద్దెకి చూడమని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చి, To-let బోర్డు తగిలించిన ఓ ఇంటికి వెళ్లి అడిగాడు. వారితో మాట్లాడితే వాళ్ళు బ్రాహ్మణులని అర్థమయ్యింది. 
దాచితే బాగుండదని మేము క్రైస్తవులం అని చెప్పాడు శంకర్. పర్వాలేదు సార్, అందరం మనుష్యులమే కదా ! ఫస్ట్ ఫ్లోర్లో  ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా ఉన్నారు అని అన్నాడు ఆ ఇంటి ఓనర్. నోరెళ్ళబెట్టి అలా చూస్తూ నిలబడిపోయాడు శంకర్.
ఏమైంది సార్ అని ఓనరు గారు పిలుస్తున్నారు.
ఏమండీ లేవండి, టైం తొమ్మిదైంది, ఇంకా నిద్రలో ఉన్నారేంటి అని పిలుస్తున్న భార్య గొంతు వినగానే, టక్కున లేచి కూర్చున్నాడు శంకర్.
కళ్ళు తుడుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటున్న భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది శంకర్ భార్య మేరీ.

- డా.శంకర్ బాబు


Comments

  1. ఇదంతా నిజమే అయితే, అప్పుడు మన దేశం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఆశగా ఉంది అన్న. చాలా చక్కగా రాసినందుకు వందనాలు అన్న.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...