Skip to main content

బైబిల్ ఎందుకు ధ్యానించాలి ?

బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు ముందు
బైబిల్ గ్రంథములో ఏముందో
ముందు తెలుసుకుందాం.
దేవునిచే దేవుని ప్రజలకు ఇవ్వబడిన
దేవుని వాక్యముగా బైబిల్ గ్రంథమును
మనం నిర్వచించవచ్చు. 

దేవుని గుణలక్షణాలు,సృష్టి క్రమం,
మానవ నిర్మాణం,
పాపము దాని ప్రభావం, మానవ పతనం,
దేవుని ఉగ్రత,
మానవ పాప విమోచన ప్రణాళిక,
దేవుని కుమారుని జనన మరణ పునరుత్తానం,
విశ్వాస జీవితం, నూతన సృష్టి మొదలైన
విషయాల గూర్చి కూలంకషంగా చర్చించిన
చారిత్రాత్మక సత్య గ్రంథం బైబిల్. 

యేసుక్రీస్తు యందు విశ్వాసముంచిన ప్రజలకు
దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదముగా
బైబిల్ గ్రంథమును పేర్కొనవచ్చును. 

విశ్వాసి యొక్క జీవితానికి ప్రామాణికం
బైబిల్ వాక్యం. అందుకే విశ్వాసులు
తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి,
ధ్యానించాల్సిన అవసరం ఉన్నది.


కీర్తనాకారుడు రచించిన 119వ కీర్తనలో 
దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములను
గూర్చిన వివరణ ఇవ్వబడింది.
కొత్త నిబంధన గ్రంథం అప్పటికి
రాయబడలేకపోయినా, కీర్తన ద్వారా
దేవుని గ్రంథమైన బైబిల్ ఎందుకు ధ్యానించాలో
మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


1.119:2-3 - ఆయన శాసనములు గైకొనుచు
పూర్ణ హృదయముతో ఆయనను
వెదకువారు ధన్యులు,
వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు
ఏ పాపమును చేయరు.
•119:11 - నీ యెదుట నేను పాపము
చేయకుండునట్లు నా హృదయములో
నీ వాక్యము ఉంచుకొని యున్నాను.


# పాపమనగా ఏమిటి,పాపము నుండి తప్పించే
మార్గము ,పాపము వలన కలిగే ఫలితాలు
మొదలైన విషయాలు దేవుని వాక్యమునుండి
మనం తెలుసుకొనగలం కావున,
ఈ వాక్యమును ధ్యానించవలసిన
అవసరమున్నది.

2. 119:18 నేను నీ ధర్మశాస్త్రమందు
ఆశ్చర్యమైన సంగతులు
చూచునట్లు నా కన్నులు తెరువుము.

# ఆయన ఆశ్చర్యకరుడు,ఆలోచనకర్తయైన
దేవుడు. ఆ దేవుని గూర్చిన అద్భుతమైన
విషయాలు,ఆశ్చర్య కార్యాలు
వాక్యములోనే గమనించగలం.
మనం దేవుని గూర్చిన లోతైన విషయాలు
తెలుసుకోడానికి ఆయన శాస్త్రాన్నిచదవాలి.
దేవుని గూర్చి తెలుసుకోవడమే
మన ప్రాథమిక విధి కదా.


3.119:38 - నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును
పుట్టించుచున్నది.

# దేవుని వాక్యము, మనుష్యులకు దేవుని భయమును
గుర్తుచేస్తుంది.
దేవుని భయము లేకపోతే జరిగే అనర్థాలు
అన్ని ఇన్ని కావని మనకు తెలిసిందే.
దేవుని భయమువలన దేవుణ్ణి భయభక్తులతో
సేవించే అవకాశమున్నది కావున వాక్యం
చదవాల్సిన అవసరం ఉన్నది.


4. 119:50 - నీ వాక్యమే నన్ను బ్రతికించియున్నది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

# మన బాధలలో, వేదనలలో, ఇరుకుల్లో
ఇబ్బందుల్లో దేవుని వాక్యము
నెమ్మదినిస్తుంది. మన శ్రమలలో
ఆయన సహాయం, వాగ్దానములను ధ్యానించి
నపుడు అవి మనలను ప్రోత్సాహపరుస్తాయి
కావున దేవుని వాక్యం చదవాల్సిన
అవసరత యున్నది.


5. 119:66 - నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక
యుంచియున్నాను, మంచి వివేచన
మంచి జ్ఞానము నాకు నేర్పుము.

# దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానమును వివేచన
నిస్తాయి. కావున వాటిని ధ్యానించ
బద్ధులమైయున్నాము.
లోకజ్ఞానము విస్తరిస్తున్న నేటి దినాల్లో
దేవుని వాక్యము దైవానుసారమైన ఙ్ఞానములో
నడిపించే సాధనమైయున్నది


6.119:72, 127 - వేల కొలది వెండి బంగారు
నాణెములకంటె నీవిచ్చిన
ధర్మశాస్త్రము నాకు మేలు.

# వాక్యము విలువ తెలియకపోవడం వలన
ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము.
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
దేవుని వాక్యము భూసంబంధ సంపద కన్నా
విలువైనది. కావున, ఆ వాక్యాన్ని
సంపాదించుకోవాల్సినవారమై
యున్నాము.


7.119:103, 111 - నీ వాక్యములు నా జిహ్వకు
ఎంతో మధురములు అవి నా నోటికి
తేనెకంటే తీపిగా నున్నవి.
నీ శాసనములు నాకు హృదయానందకరములు.

# దేవుని వాక్యము అంతరంగ హృదయముకు
ఎంతో సంతోషమును అందిస్తుంది కావున
మనం వాక్యమును హృదయములో
భద్రపరుచుకోవాల్సినవారమై యున్నాము.


8.119:105 - నీ వాక్యము నా పాదములకు
దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.

# దేవుని వాక్యము మన అనుదిన జీవితాలకు
అవసరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో
సహాయం చేసే గొప్ప సాధనమైయున్నది
కావున మనం ఆ వాక్యమును చదివి ధ్యానించి
విధేయత చూపవలసిన వారమై ఉన్నాం.


9.119:142,160 - నీ నీతి శాశ్వతమైనది
నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
నీ వాక్య సారాంశము సత్యము.

# ఎన్నో మతాల పుస్తకాలున్నను, ఎన్నో
తత్వశాస్త్ర గ్రంథాలున్నను
వాటన్నిటికంటే గొప్పదైన దేవుని వాక్యము సత్యమైనది
శాశ్వతమైనది కాబట్టి మనం దాన్ని ధ్యానించవలసిన
అవసరత ఉన్నది.


10.119:164, 171 - నీ న్యాయవిధులను బట్టి
దినమునకు ఏడుమారులు నేను నిన్ను
స్తుతించుచున్నాను.
నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు,
నా పెదవులు నీ స్తోత్రమునుచ్చరించును.

# అతి ప్రాముఖ్యంగా దేవుడు ఏమైయున్నాడో, 
ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన ఆజ్ఞలను
బట్టి ఆయనను స్తుతించడానికి దేవుని వాక్యం
మనం ధ్యానించ బద్ధులమై ఉన్నాం.


చివరిగా అపొస్తలుడైన పౌలు చెప్పిన
ఈ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం.

2 రెండవ తిమోతికి 3:16,17
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు
పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము
ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పు దిద్దుటకును, నీతియందు
శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.


మన క్రైస్తవ జీవితాలకు ప్రామాణికంగా చెప్ప
బడుతున్న బైబిల్ గ్రంథాన్ని చదవక,
ధ్యానించక నిర్లక్ష్యం చేస్తున్న సోదర
సోదరీమణులారా,
ఇకనైనా కేవలం ఆదివారం మాత్రమే
సంఘానికి వెళ్లేప్పుడు మాత్రమే కాక,
ప్రతిరోజూ బైబిల్ చదవడం అలవాటు
చేసుకోండి.

దేవుని ప్రణాళిక మరియు ఆయన చిత్తమునెఱిగి
ఆయన మహిమకై క్రైస్తవజీవితం
కొనసాగించండి.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...