Skip to main content

కుటుంబ సమస్యలు - వాక్యానుసారమైన పరిష్కారం


వివాహం అనే బంధంలో ఇద్దరూ భిన్న వ్యక్తులు భిన్న వ్యక్తిత్వాలతో ఒకటవుతారు.
వివాహం అయింది మొదలుకొని సమస్యలు,  కొన్నిసార్లు ఘర్షణల గుండా కూడా కొన్ని క్రైస్తవ కుటుంబాలు వెళుతూ ఉంటాయి.

సమస్యలు లేని కుటుంబం ఎక్కడా ఉండదేమో!

ఒక విధంగా వివాహం,ఇద్దరు వ్యక్తులలోని వ్యక్తిగత సమస్య అయిన పాపమును చూపించే 
ఒక సాధనమై యున్నది.

సంఘములో ఇతరుల ఎదుట మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు కాని, 
ఇంట్లో మన కుటుంబ సభ్యుల దగ్గర మన అంతరంగంలో గల పాప స్వభావాన్ని
చాలా మట్టుకు ప్రదర్శిస్తాము.

యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు పాపం యొక్క ప్రభావము నుండి 
పూర్తిగా విడుదల పొందలేము కావున, కుటుంబ వ్యవస్థలో కూడా
పాప స్వభావపు ఫలితాలైన సమస్యలు కలహాలు
ఘర్షణలు మొదలైన వాటి నుండి సంపూర్ణమైన విడుదల పొందలేము.




అయితే క్రైస్తవులు ఈ సమస్యల నుండి పరిష్కారం పొందుకోలేని వారు కారు.

దేవుని వాక్యం లో గల ఆజ్ఞల నుండి నియమాల నుండి కుటుంబ సమస్యలకు 
జవాబులు పొందుకొని, దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఎదగడానికి
దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు.

చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం యొద్దకు వచ్చి
సమస్యలను పరిష్కరించుకోవడం
నిర్లక్ష్యం చేసి,  లోకానుసారమైన నియమాలు,
సలహాల మీద ఆధారపడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడం చూస్తున్నాం.

లోకానికి ఉప్పు గా వెలుగుగా ఉండాల్సిన క్రైస్తవులు,
కుటుంబ వ్యవస్థకు మాదిరిగా ఉండాల్సిన క్రైస్తవ కుటుంబాలు దేవుని నామమునకు
చెడ్డ పేరు తెచ్చే వారిగా
ప్రవర్తించడం బహు బాధాకరమైన సంగతి.

క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు దానిని
పరిష్కరించుకోవడానికి దేవుని వాక్యాసారమైన కొన్ని నియమాలను
ఇప్పుడుచర్చించే ప్రయత్నం చేద్దాం.

1. సమస్య గురించి పరిష్కరించుకోవడానికి సరైన సమయం నిర్ణయించుకుని
ప్రార్థన పూర్వకంగా మాట్లాడుకోవడం.

2. నీ భాగస్వామి చెప్పే విషయం శ్రద్ధగా ఎటువంటి విచిత్ర ముఖకవళికలు చూపకుండా 
వినడం.
తను చెప్పిన విషయాలు, నువ్వు అర్థం చేసుకున్న విషయాలు
ఒకటేనా అని కూలంకషంగా చర్చించుకోవాలి.

3. చెప్పాలనుకున్న విషయాన్ని అరవకుండా నెమ్మదిగా చెప్పడం చాలా మంచిది.
కోపం సమస్యను తీవ్రతరం చేస్తుంది కావున స్వరం మృదువుగా ఉండుట మేలుకరం.
మృదువైన మాట కోపమును చల్లార్చును (సామెతలు 15:1)

4. ప్రస్తుత సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో జరిగిన పాత విషయాలను, 
ఆనాడు పరిష్కరించుకున్న వాటిని తిరిగి తీసుకుని రావద్దు.

5. ఒకవేళ తప్పు నీది అయితే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయక ఒప్పుకోవడం 
మంచిది. నీ తగ్గింపు, సమస్యను జటిలం చేయకుండా ఆపివేసే సాధనమైయున్నది.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందును. (సామెతలు 28:13)

6.వాదనలో గెలవాలనే తత్వం కాదుగాని, నీ భార్యను లేదా భర్తను సంపాదించుకోవాలనే 
తత్వంతో మెట్టు దిగడానికి సిద్ధమై ఉండాలి.

7. దేవుడు మన పాపములను క్షమించినట్లుగా మనము మన భాగస్వామి యొక్క
తప్పులను క్షమించడానికి ముందుకు రావాలి.
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు
ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున
మీరును క్షమించుడి (కొలొస్సయులకు 3:13).

8. సమస్య మీరు పరిష్కరించుకోలేకపోతే మీ స్థానిక సంఘ కాపరికి తెలియజేయండి
లేదా ఆత్మీయంగా పరిణితి చెందిన సంఘ సభ్యుల సలహాలు కౌన్సిలింగ్ తీసుకోవడానికి
వెనుకాడకూడదు.
ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థ మగును, 
ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
(సామెతలు15:22)

9. మీ కుటుంబ సమస్యలను గురించి ఇతరులతో చర్చించే ప్రయత్నం 
చాలా ప్రమాదకరమైనది.

10. సమస్య ఎంత తీవ్రమైన సరే "విడాకులు" అనే మాట రానీయవద్దు.
మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను 
పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు,
విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు
మీతో చెప్పుచున్నానని వారితోననెను. (మత్తయి 19:9)

11.సమస్యను గూర్చి చర్చించిన నిమిషం నుండే మార్పు సాధ్యం కాదు కావున,
వాక్యానుసారమైన ఓపిక కలిగియుండండి.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును (1కొరింథీ 13:4).

12. ప్రాముఖ్యముగా,  నీ భర్త గూర్చి,  నీ భార్య గూర్చి ప్రార్ధన చేయడం మరిచిపోకండి.
హృదయాలను మార్చగలవాడు ఆయనే.

పైన చెప్పబడిన విషయాలు కుటుంబంలో జరిగే ప్రతి సమస్యకు 
పరిష్కారం చూపిస్తాయని నేను చెప్పట్లేదు కానీ, కొంత వరకు ఇవి పాటించడం ద్వారా 
మన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒక మాట గుర్తు పెట్టుకుందాం.

క్రైస్తవ కుటుంబం సమస్యలు లేని సంపూర్ణమైన కుటుంబం కాదు.
యేసు క్రీస్తు ప్రభువు ద్వారా సమస్యలను పరిష్కరించుకొని, తగ్గింపు కలిగి
సమాధానముతో దేవుని మహిమార్థమై జీవించుటకు ప్రయత్నించే కుటుంబం.

అటువంటి కుటుంబాలుగా ప్రభువు సహాయంతో కట్టుకొని ఆయన నామమునకు
మహిమ తెచ్చుదుము గాక !

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...