Skip to main content

కిరిస్తానీయులం

లచ్చిమీ, లేవే, అయ్యో, నా పాణాన్ని పొట్టనవెట్టుకుండ్రు అని తన గుండెల మీద లచ్చమ్మ శవాన్ని వెట్టుకొని ఏడుస్తుండు రాములు. ఎవరో ఆమెను మెడ మీద కత్తితో పొడిచి చంపేశారు. ఊరవతల రైస్ మిల్లు దగ్గర శవం దొరికింది.

లచ్చమ్మ, రాములు భార్యా భర్తలు. ఒకరంటే ఒకరికి మస్త్ ప్రేమ. రాములు పెద్ద కులంకి చెందినోడు. లచ్చమ్మ అదే ఊర్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన చిన్న కులపామె. మొదటిసారి లచ్చమ్మను సూడంగనే రాములు మనసు పారేసుకుని లచ్చమ్మని పెండ్లి చేస్కుంటనని వాళ్ల అయ్య దగ్గరికి పోయి "అయ్యా, లచ్చమ్మని నాకియ్యు, లగ్గం చేసుకుంటా" అని నేల వైపు చూస్తూ అడిగిండు.
రాములు మంచోడని కష్టం చేసే పిల్లగాడని ఊరంతా తెలుసు. 
"అట్ల కాదయ్యా, మేము కిరిస్తానీయులం, మీరు పెద్ద కులం వాళ్ళు, ఇది జరిగేపని కాదుగానీ పోయిరా" అని లచ్చమ్మ తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. 

రాములు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. లచ్చమ్మ వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పాస్టర్ సారు రాములును కూసోబెట్టి బైబిల్ నుండి కొన్ని మాటలు సూయించి,  మన సమస్య మన హృదయంలో ఉన్న పాపం, అది తీసేసి మనల్ని కాపాడ్డానికి ఏసు ప్రభువు ఆ శిలువ మీద సనిపోయిండు అని చెప్పి, ముందు ఆ సామిని నమ్ముకో, పెళ్లి సంగతి తర్వాత అని సూటిగా చెప్పిండు.
రాములు ఆ రోజు నుండి ఆలోచనలో పడిండు. పాస్టర్ జెప్పిన మాటలు బాగా తాకినయి. 

నెల రోజుల తరవాత ఆయన దగ్గరికి పోయి " సార్, నేను యేసు సామిని నమ్ముకుంటా" అన్నాడు. లచ్చమ్మను పెండ్లి జేసుకోడానికి ఏసు పెభువును నమ్ముకుంటా అని చెబుతున్నావా? నిజం చెప్పు రాములు.
లేదయ్యా, గా దినం నువ్ జెప్పిన మాటలు నిజమే అనిపించినయి. నా లోపలున్న కంపు మొత్తం నా కండ్ల ముందు కనిపించింది. ఆ పాపం పోకపోతే నేనెట్ల దేవుని దగ్గరికి పోతా? అందుకే నా పాపం కోసం సచ్చిపోయిన యేసుసామిని నమ్ముకుంటా సార్".
ఆ మాటలు విన్న పాస్టర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. హృదయంలోనే దేవునికి వందనాలు చెబుతూ అయితే చర్చికి రా అని సంతోషంగా అన్నాడు పాస్టర్. రాములు చర్చికి వెళ్లడం మొదలుజేసిండు.  
కులపోళ్లు రాములు నీకేం పోయేకాలం రా, తక్కువ జాతి వాళ్లతో తిరిగుతున్నావ్?" అని దబాయిస్తే అందరం పాపజాతోల్లం అని వెళ్ళిపోయాడు.
ఒకరోజు, రాములు లచ్చమ్మను పెండ్లి చేసుకుంటాడని తెలిసి "నువ్వు గిట్ట లచ్చమ్మను పెండ్లి చేసుకుంటే చస్తవ్ బిడ్డా" అని వాళ్ళ కులపోళ్లు దబాయిస్తే, నేను గామెనే చేస్కుంట, ఏం చేస్తరో చేస్కపొండి అని రాములు ధీటుగా సమాధానం ఇచ్చిండు.
రాములు లచ్చమ్మల పెండ్లి, అదే చర్చ్ బిల్డింగ్లో మూడు నెలల తర్వాత అయ్యింది.

పెండ్లై సరిగ్గా ఆరు నెలలయ్యింది. లచ్చమ్మ చాలా మంచిది. పది మందికి మంచి చేసేది.  ఎవ్వల్నీ పల్లెత్తు మాట అనేది కాదు. ఒక రోజు రాములు ఇంటి పక్కనే ఉన్న నర్సింలు వాళ్ల ఇంట్ల బంగారం దొంగతనం అయితే, లచ్చమ్మ మీద అనుమానం ఉందని ఇంటికొచ్చి సామాన్లన్ని కింద పడేసి, ఇల్లంతా చిందర వందర చేసిండ్రు. లచ్చమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయింది. 
రాములు వచ్చి " ఎంత ధైర్యం ఆళ్లకి, నేను లేనప్పుడొచ్చి ఇట్ల చేస్తరా, గిప్పుడే పోయి, తాడో పేడో తెల్చుకుంటా" అని వెళ్తుంటే, తన చెయ్యి పట్టుకొని ఆపి, "ఊకోవయ్య, వాళ్లు ఏదో తప్పు జేసిండ్రని, మనం కూడా చేస్తే, మనకు ఆళ్లకు తేడా ఎముంటది, శత్రువుల్ని క్షమించమని యేసు సామి చెప్పిండు. పోయిన వారం పాస్టర్ సార్ చెప్పిన మాటలు గుర్తు లేవా? నీకోసం గుత్తి వంకాయ ఒండిన, దా తిను" అని బుజ్జగించింది. 
ఇది జరిగిన నెల రోజులకు లచ్చమ్మ శవమై కనిపించింది. లచ్చమ్మతో గడిపిన ప్రతి క్షణం గుర్తుకొచ్చి రాములు గుండెలవిసేలా రోదిస్తుండు.

లచ్చమ్మ వాళ్ల అమ్మా నాన్న కూడా " వొద్దు బిడ్డా, ఆ రాములును చేసుకుంటే ఆ కులపోళ్లు ఊర్కోరు, సంపుతారు" అని చెబితే  నాయనా, నాకు దేవుడున్నాడు,
నన్ను పెండ్లి చేస్కొనే రాములు నాకు ముఖ్యం గానీ, వాళ్ళ కులపోల్లతో నాకెంది అంటివి గదనే, ఓ లచ్చిమి లేవే అంటూ ఏడుస్తనే ఉన్నారు.

లచ్చమ్మకి కొంచెం వైద్యం తెలుసు. పాము కరిస్తే ఏం చేయాలి అనే ముచ్చట, ఆ ఊర్ల మెడికల్ క్యాంపు పడ్డపుడు డాక్టర్ చెబితే విన్నది. అట్ల అదే ఊర్లో ఓ ఇద్దరి ప్రాణం కూడా  కాపాడింది. 
ఎవడ్రా సంపింది, ఎవడైనా చెప్పండ్రా అని రాములు ఏడుస్తూ  అడుగుతూనే ఉండు. 
ఒక్కడు కూడా నోరు తెరుస్తలేదు. మీరసలు మనుషులేనా, ఇంకా కుల పిశాచాలకు భయపడతారెంట్ర అంటూ తిడుతూనే ఏడుస్తున్నాడు.
ఇంతలో రాములు ఇంటికి ఎదురుగా ఉండే జయమ్మ కూతురు పదేళ్ల స్వప్న, నేను చెబుతా అని ముందుకొచ్చింది.
నేను మీ ఇంట్ల అత్తతో ఆడుకుంటున్న. నారాయణ తాత (కులపెద్ద) మీ ఇంటికి వచ్చి ఎవరికో పాము కరిసింది, కొంచెం వచ్చి సూడమ్మా అని అనిండు. పోదాం పా అయ్యా అని మీసాల తాతతో అత్త పోయింది అంకుల్ అని ఏడుస్తూ చెప్పింది. 
రాములు కోపంతో ఊగిపోయాడుశవాన్ని కింద బెట్టి గొడ్డలి తీస్కొని కులపెద్ధ ఇంటి వైపు వెళ్తుంటే " రేయ్ రాములు, ఆవేశపడకురా, ముందు జరగాల్సిన కార్యం చూడు" అంటూ ఆపే ప్రయత్నం చేశారు ఊరి జనాలు.
తూ మీవి కూడా బతుకులేనా, నేను యేసు సామిని నమ్ముకున్ననని
కిరిస్తాని పిల్లను చేసుకున్ననని, నన్నేం చేయలేక, నా పెళ్ళాన్ని పట్ట పగలు నరికి సంపితే, వాళ్లకు భయపడి ఎదురు మాట్లాడే శాతగాదు గానీ, నేను పోతుంటే, నన్ను ఆపుతారా ? 
ఇదే భయం వాళ్ళకు బలం రా. నేను పోతున్నా, వాన్ని సంపి జైలుకు పోతా" అంటూ ముందుకెళ్ళాడు.
ఇంతలో ఎవరో చెయ్యి పట్టుకున్నట్లు అన్పించి, వెనకకు తిరిగాడు.అక్కడ ఎవరూ లేరు. 
అలానే ఆలోచిస్తూ నారాయణ ఇంటి వైపు వెళ్ళాడు.
ఇంటి ముందు నారాయణ భార్య, రాములు చేతిలో గొడ్డలి చూసి,
"రాములు, నీకు దండం పెడతా, నా పెనిమిటిని ఏం జేయకు" అని రెండు చేతులెత్తి దండం పెడుతూ ప్రాధేయపడుతుంది. కోపంతో రగిలిపోతూ వచ్చిన రాములు, 
" నా పెండ్లాంని సంపినోన్ని సంపాలి అని నాకుంది. కానీ, నిన్న రాత్రే నేను నా భార్య 
" అందరం సస్తం, ఒకరు ముందు, ఒకరు తర్వాత. కానీ, సావును సంపి లేసిండు ఒక సాములోరు, గా సామిని సిలువేసి సంపిండ్రు" అని మాట్లాడుకున్నాం.  ఆ సామీ, వీళ్లేం జేస్తున్నరో వీళ్ళకి తెల్వదు, వీళ్ళను మాఫ్ చెయ్యి అని ప్రార్థన చేసిండట. 
మన పాపాల కోసం సచ్చిన సామే మనల్ని క్షమిస్తే, మనల్ని తిట్టే, కొట్టే, ద్వేషించే, సంపే వారిపై కక్ష తీర్చుకునుడు ఎట్ల కరెక్ట్ అనుకున్నాం."
నీ భర్తను సంపితే, నేను పగ తీర్చుకున్నట్లు. నీ భర్తను పోలీసులకు పట్టిస్తే, న్యాయం జరిగించినట్లు. కానీ, నా పెండ్లాన్ని సంపిన నీ భర్తను, క్షమిస్తున్న, మీరు మంచిగ ఉండండి, అని గొడ్డలి విసిరేసి, కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ వెనుదిరిగాడు.
ఇదంతా, తలుపు వెనకాల దాక్కుని ఉన్న కులపెద్ద నారాయణ విన్నాడు. మొదట భయపడ్డాడు, ఆ తర్వాత ఆశ్చర్యపడ్డాడు, చివరికి ఏడ్వడం మొదలుపెట్టాడు. 

సమాధి కార్యక్రమం ముగించి ఇంటికెళ్ళిపోయాడు రాములు.
ఒక పది రోజుల తర్వాత లచ్చమ్మ కృతజ్ఞత కూడిక జరుగుతుంది. ఒక్కొక్కరూ వచ్చి లచ్చమ్మ మంచితనం గురించి రెండు మూడు మాటలు మాట్లాడుతున్నారు.
ఇంతలో ఒకాయన మొఖానికి ముసుగుతో వచ్చి,ఈ లచ్చమ్మ వల్ల నేను యేసు సామిని నమ్ముకున్న. యేసు సామి మాటలు విని నా బ్రతుకు మార్చుకున్న అని ఏడ్చుకుంటూ ముసుగు తీశాడు. అక్కడున్న వారందరూ ఆ కులపెద్ద నారాయణను చూసి ఆశ్చర్యపడ్డారు.

- డా.శంకర్ బాబు 










Comments

  1. Heart touching story of love and foegiveness overcoming caste and creed.could see characters come alive while reading. Beautifully written.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...