దేవుడు అబ్రామును పిలిచినప్పుడు "నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" (ఆది 12:1) అని ఆజ్ఞాపించాడు.
దేవుడు ఇక్కడ అబ్రాముతో మనవి చేయట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. సార్వభౌముడైన సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రాముకు ఆజ్ఞను జారీచేస్తున్నాడు.
అబ్రాము, నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, ఇక్కడి నుండి బయలుదేరు అన్నట్లుగా ఆ ఆజ్ఞ మనకి కనిపిస్తుంది.
అబ్రాము బహుశా అక్కడే పుట్టుంటాడు, అక్కడే పెరిగి ఉంటాడు, అక్కడే చంద్రుణ్ణి ఆరాధించే భక్తిని నేర్చుకుని ఉంటాడు. అన్యదేవతలను పూజిస్తున్న కుటుంబంలో నుండి “అబ్రాము, నువ్వు వారికి వేరుగా ఉండాలి, ఈ ప్రాంతానికి వేరుగా వేరే ప్రాంతానికి వెళ్లాలి” అని దేవుడు చెప్పాడు.
అదే దేవుడు అటువంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమాజం నుండి ఇప్పటికీ ప్రజలను పిలుస్తున్నాడు. అబ్రామును పిలిచినట్లుగా అతనితో సూటిగా మాట్లాడి పిలవడం లేదు కానీ, ఈ దినములలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ కోసం మనల్ని పిలుస్తున్నాడు (హెబ్రీ 1:1,2).
యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఆ పిలుపును మార్కు 1:14,15లో ఇలా ప్రకటించాడు : యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
అంతేకాదు,ఆ పిలుపులో గల షరతును కూడా స్పష్టంగా బోధించారు : మార్కు 8:34 - అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచినన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబడింపవలెను.
ఈ మాటలు చదువుతున్న నీవు ఇంకా రక్షించబడకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ అంతరంగంలో గల భారాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వస్తే ఆయన నిన్ను త్రోసివేయక క్షమించి అంగీకరిస్తాడు. నీ సమస్య, నీ పేరు,పదవి, నీ డబ్బు, నీ హోదా, నీ గౌరవం, వీటన్నిటినీ మించింది. ఆ సమస్య నీ అంతరంగంలో గల పాపం. ఇవేవీ కూడా నీ పాప సమస్యను పరిష్కరించలేవు. పరిష్కారం ప్రభువు మాత్రమే ఇస్తాడు. ఆ పరిష్కారం కోసం వీటన్నటినీ అవసరమైతే విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదం.
ఈ మాటలు చదువుతున్న నీవు రక్షించబడితే, ప్రతిరోజూ నీ సిలువ ఎత్తుకుని ప్రభువును వెంబడించు. నీ కులాన్ని వదిలేసేయ్, నీ పేరును, పదవులను, ప్రతిష్టలను వదిలేసేయ్, నా అనే తత్వం వదిలేసి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకు (మత్త 6:33). దురాశను వదిలేసెయ్, లోకానుసారమైన శారీరక కోరికలను వదిలేసెయ్, గర్వాన్ని వదిలేసెయ్, కోపాన్ని ద్వేషాన్ని వదిలేసెయ్, పగలు ప్రతీకారాలు వదిలేసెయ్, అల్లరి జీవితం, చిల్లర జీవితం వదిలేసెయ్.
దేవుడు పిలిచినప్పుడు వెళ్లే విషయంలో, దేవుడు విడిచిపెట్టమని చెప్పినప్పడు విడిచిపెట్టే విషయంలో చక్కని మాదిరి, అబ్రాము జీవితం.
అలాంటి జీవితాన్ని మన దేశంలో పుట్టిన ఒక మహిళ కూడా జీవించింది. 1858లో మంగుళూరు దగ్గర గల గంగాముల్ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ పాప, పెరిగి పెద్దదై సంస్కృతంలో పట్టు సాధించింది. 20 ఏళ్లకే సంస్కృత భాషలో ఆ అమ్మాయి ప్రావీణ్యతను గుర్తించిన విశ్వవిద్యాలయం ఆమెను పండిత, సరస్వతి అనే బిరుదులతో సత్కరించింది.
తల్లిదండ్రులను, భర్తను కోల్పోయి ఇంగ్లాండ్ దేశానికి వెళ్లినపుడు అక్కడ ప్రభువును విశ్వసించి బాప్తిస్మం తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చింది.
ఆమెను అప్పటికే చాలా గౌరవించిన వారు, ఆమె క్రైస్తవరాలిగా తిరిగి వచ్చినందుకు తీవ్రంగా వ్యతిరేకించారు, సమాజం నుండి ఆ మహిళకు గల సపోర్ట్ పోయింది. ఇక్కడి మతాన్ని సంస్కృతిని మోసం చేసిందని ఆమెను నిందించారు. ఆమె మాత్రం తనకున్న డబ్బు, ఆస్తి, తన సమయం అన్నీ వెచ్చించి ముక్తి మిషన్ అనే సంస్థను స్థాపించి క్రీస్తు ప్రేమతో మహిళలను చేరదీసి చదువుచెప్పిసువార్త పంచి ప్రభువు మహిమార్థమై ఎంతో పరిచర్య చేసింది. ఆమె పేరు పండిత రమాబాయి.
దేవుడు పిలిచినప్పుడు ఆయనను వెంబడించడానికి అడ్డుగా ఉన్నవాటిని మనం వదిలేస్తే అదే దేవుడు మన విధేయతను ఆశీర్వదించి విడిచినవాటికంటే ఎక్కువ దయచేస్తాడు.
ప్రభువు మనల్ని పిలుస్తుండగా విడిచిపెట్టాల్సినవేమిటో, ప్రభువు కోసం మనం వెచ్చించాల్సినవేమిటో పరీక్షించుకుందాం!
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment