Skip to main content

మనిషి సమస్యకి పరిష్కారం ?

దేవుడు ?


ఈ లోకములో ఉన్నదంతయు తనంతకు
తానుగా ఉనికిలోకి రాలేదు. 
ప్రతి వస్తువు వెనకాల దాని ఆవిష్కరణ కర్త
ఉన్నట్లుగానే, విశ్వంలో గల వివిధ వ్యవస్థలను
పరిశీలిస్తే ఈ సృష్టిని  సృజియించిన
సృష్టికర్త ఉన్నాడని నమ్మకతప్పదు.


పదార్థాల కూర్పు, కణాల విస్ఫోటనం వలన
లోకం ఆవిర్భవించిందనే నాస్తికుల వాదన
ప్రశ్నించదగినదే.
ఎందుకనగా విశ్వంలో గల పదార్థాలు ఒకదానితో
ఒకటి కలిసి,ఒక సమయములో విస్ఫోటనం
చెందడం వలన గ్రహాలు,నక్షత్రాలు,
భూమిపై జీవం ఆవిర్భవించిందనీ,
ఇదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమని చెబుతుంటారు.కానీ
ప్రశ్నేమిటంటే, “మొదటిగా పదార్ధం ఎక్కడిది “?
ఎక్కడ నుండి వచ్చింది? ఈ పదార్ధం తనకు తానుగా
ఆవిర్భవించిందా?
కాస్త లోతుగా ఆలోచిస్తే “ఒక పదార్థ సమూహ
విస్ఫోటనం, క్రమమైన అంతరిక్షాన్ని,
భూమిని ఎలా కలుగజేయగలదు ? 
ఒకాయన ఈ విధంగా అన్నాడు,
“ప్రింటింగ్ షాపులో విస్ఫోటనం సంభవిస్తే
బూడిద  వస్తుంది కానీ, ఎన్సైక్లోపీడియా
గ్రంథం రాదు కదా “. 


చారిత్రక గ్రంథమైన బైబిల్ “దేవుడే అన్నిటికి
మూలమనియు ఆయనే సర్వమును
కలుగజేశాడనియు” సెలవిస్తుంది.
శూన్యములో నుండి దేవుడు మాట చేత
అన్ని ప్రాణులను,గ్రహాలను, నక్షత్రాలను,
పశుపక్ష్యాదులను,పర్వత శ్రేణులను సృష్టించాడని
బోధిస్తుంది. ఈ లోకములో కలిగి ఉన్నదేదియు
ఆయన లేకుండా  కలుగలేదని
తెలుసుకోవాల్సిన అవసరమున్నది. 

దేవుడు స్వభావ రీత్యా సమస్త శక్తిగల వాడై,
అధిక జ్ఞానము కలవాడై ఉంటాడు కావున
పదార్థముతో పని లేకుండా, శూన్యమునుండి
సమస్తమును కలుగజేయుటకు అర్హుడని
ఒప్పుకోవాల్సిందే. 


దేవుడు స్వభావరీత్యా పవిత్రుడు మరియు
న్యాయాధిపతియై యిండాలి. ఇతరులకు వేరుగా,
ప్రత్యేకమైనవాడిగా ఉండి పాపమును
అసహ్యించుకోవాలి. 
బైబిల్ గ్రంథంలో “  పాపము చేయువారందరు
నీకసహ్యులు” అని వ్రాయబడింది. 


మానవుడు? 


కోతి నుండి మనిషి రూపాంతరము చెందాడని
చెప్పే శాస్త్రము అసత్యమైనదే.
ఒక జంతువైన కోతికి, మనిషికి జన్యుపరంగా
కొన్ని సమానతలు, పోలికలు ఉన్నాయనే
మాట వాస్తవమే అయినా, ఆ కొద్దిపాటి
తేడాలే మనిషిని అన్ని జంతువులకుపైన,
సమస్త జీవరాశులకన్నా అందనంత ఎత్తులో
నిలబెట్టాయి.. 


మనిషి జంతువులకు వేరుగా మట్టినుండి
చేయబడి, దేవునిచే నాసికా రంధ్రాల్లో
జీవ వాయువును పొందుకొని 
జీవించు ఆత్మగా సృష్టించబడినాడని
వాక్యం బోధిస్తుంది. 


ఎన్నో భావోద్రేకాలతో, జ్ఞాన సంపత్తితో,
సంబంధ బాంధవ్యాలను కలిగినవాడిగా మనిషి
దేవునిచే చేయబడినాడు.
అందుకే జ్ఞానములొ, దినదినము అభివృద్ధి చెందుతూ
ఎన్నెన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు
కొనసాగుతున్నాడు. 


ఈ జ్ఞానము ఇతర జంతువులకు ఉందని
చెప్పగలరా ?. జంతువులలో నైతిక విలువలు
లేవు కానీ మనుష్యులలో నైతిక విలువలున్నాయి
కాబట్టే తప్పొప్పుల గూర్చిన అవగాహన ఉన్నది. 


మానవుడు ఈ లోకంలోకి హఠాత్తుగానో,
తనంత తానుగానో రాలేదు కానీ,
దేవుని చేత సృష్టించబడి వచ్చాడని
వాక్యం చెబుతుంది. 


మానవుని సమస్య ?


మానవుడు ఒక ఉద్దేశ్యము లేకుండా దేవునిచే
చేయబడలేదు. ఒక ప్రత్యేకమైన,
ప్రాముఖ్యమైన పనికై మనిషి సృష్టించబడ్డాడు. 
“నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని
తెప్పించుము నేనే వారిని  కలుగజేసితిని,
వారిని పుట్టించినవాడను నేనే“ అని పలికిన
దేవుని మాటల ద్వారా మానవుని ప్రాముఖ్యమైన
పని, దేవుని మహిమ కొరకై బ్రతకడం అని
అర్థమౌతుంది.

అయితే, మొదటి మానవుడు దేవుడిచ్చిన
నిర్ణయ స్వేచ్ఛను ధిక్కరించి,
ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపి,
పాపములో పడి దేవుని మహిమకై జీవించుటను
వ్యతిరేకించి  శాపగ్రస్తుడైనాడు.
దేవునితో గల ఆత్మీయ సంబంధమును కోల్పోయి,
నిత్య నరకానికి పయనం మొదలెట్టినాడు. 
ఆ మొదటి మానవుని సంతానమైన ప్రజలందరూ,
అదే పాప స్వభావమును కలిగి పాపులుగా
ఈ లోకములో జన్మించి జీవించి శారీరక
మరియు ఆత్మీయ మరణం గుండా
వెళుతున్నారు. 


పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు.
ఏ బేధము లేక ప్రతి మనిషి పాపముచే
దేవుడనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నాడు.


ద్వేషం పాపమే, వ్యభిచారపు చూపు పాపమే,
అబద్ధమాడటం పాపమే,గర్వము పాపమే. 
ఒక మాట గమనిద్దాం. మనిషి పాపము చేయడం వలన
పాపి కాదు గాని, మొదటిగా మనిషి పాపి కాబట్టే
పాపము చేస్తున్నాడు. 


ఉగ్రవాదులు, నరహంతకులు,దొంగలు,మోసగాళ్లు
అంతే  గాక ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు,
సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు,తల్లిదండ్రులు,
పిల్లలు, భార్య భర్తలు, మతపరమైన వ్యక్తులు
చివరికి దేవుడు లేడని వాదించే నాస్తికులు కూడా
దేవుని దృష్టిలో పాపులే అనే సత్యం
అంగీకరించాలి. 


మనిషి సమస్య ప్రాథమికంగా పాపము, పాపమే. 


మనిషి సమస్యకి పరిష్కారం ? 


పాపoవలన నిత్య నరకానికి ప్రాప్తుడైన మనిషి
తనను తానూ రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో
ఉన్నవాడు. ఏ విధంగా కూడా నరకాన్ని
తప్పించుకోలేని అసహాయడై యున్నాడు.
ఇతరుల ద్వారా కాపాడబడలేని వాడు, 
ఎందుకంటే,ఇతరులు కూడా పాపులే కదా. 

అయితే, తన మహిమ  కొరకు సృష్టించుకున్న
మనిషి పాపములో నశించుటకు ఇష్టపడని
ప్రేమ గల దేవుడు, మానవునిగా ఈ భూమిపై
జన్మించి మానవ పాప సమస్యకి పరిష్కారం
చూపించాడు. 

ఒక నదిలో ఈత రాక మునిగిపోతున్న వ్యక్తికి, 
ఒడ్డున కూర్చున్న వ్యక్తి ఈదటం ఎలానో నేర్పితే
నీటిలో మునుగుతున్న వ్యక్తి  పైకి రాలేడు.
ఒడ్డున కూర్చున్న వ్యక్తి నీటిలో దూకి ఈత రాక,
తనను తాను రక్షించుకోలేక మునిగిపోతున్న
వానిని కాపాడకపోతే అతను చనిపోవడం ఖాయం. 
అదేవిధంగా  తనని తాను రక్షించుకోలేని
నిస్సహాయతలో ఉన్న పాపులని రక్షించుటకు
దేవుడు ఈ లోకమునకు రావాల్సిన అవసరం
ఎంతైనా ఉన్నది. 

అంతే కాకుండా, వెల చెల్లించకుండా పాపమునకు
విడుదల లేదు కనుక పాపులైన ప్రజల నిమిత్తం
యేసు క్రీస్తు ప్రభువు మరణానికి తనను తాను
అప్పచెప్పుకున్నాడు. 
రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు
అనే మాటను నెరవేర్చేలా, సమస్త మానవాళి
పాప ప్రాయశ్చిత్తం కొరకు, యేసు క్రీస్తు ప్రభువు
తన ప్రాణము అర్పించాడు. 
మానవ పాపములను వాటి ఫలితమైన దేవుని
ఉగ్రతను సిలువలో భరించి, మానవ శిక్షను
ఆయన అనుభవించాడు. 
తనను నమ్మినవారిని , పాపమునుండి,
శాపము నుండి విడుదలనిచ్చుటకై అతి ఘోరంగా
సిలువలో మరణించాడు. 
అంతే కాక మూడవ దినమున మరణము
జయించి తిరిగి లేచాడు. 


ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చి, తమ పాపాలు
ఒప్పుకొని, ప్రాయశ్చిత్త మనసుతో ఆయనయందు
విశ్వాసముంచుతారో వారిని నిత్యనరకము
నుండి తప్పించి, ఆత్మీయ మరణము నుండి
రక్షించి, నిత్య జీవము అనుగ్రహిస్తానని,
తన వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
సెలవిచ్చాడు. 


మానవ సమస్యకి పరిష్కారం పద్దతులో,
పథకాలో, శాంతి చర్చలో కాదు.
మానవ సమస్యకి పరిష్కారం
“ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే “. 


మరేందుకు ఆలోచిస్తున్నావు ?  నీ పాపుములను
ఆయన యొద్ద ఒప్పుకొని, నీ కొరకు ఆయన
మరణించి తిరిగి లేచాడని 
విశ్వసించి, ఆయనిచ్చే నిత్య రక్షణ ఎందుకు
నీవు పొందుకోకూడదు . 
దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం చదువుతూ,
ఒక స్థానిక సంఘానికి అంటుకట్టబడి
నీ ఆత్మీయ జీవితం కొనసాగించు. 

ఆఖరిగా ఒక మాట : ఈ లోకములో నిన్ను
దేవుని కన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు,
ఒకసారి సిలువ మీద నీకై మరణించిన
యేసు క్రీస్తు వైపు చూడు.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...