మనం క్రీస్తుకే ప్రార్థన చేస్తే, మళ్ళీ క్రీస్తు నామంలో అనకుండా నీకే సమర్పిస్తున్నాను దేవా అనొచ్చు. కానీ, తండ్రికి ప్రార్థిస్తే యేసుక్రీస్తు నామంలో అని చెప్పడం మంచిది.
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే ముందుగా ఈ క్రింది వచనాలను మనం చదువుదాం.
కొలస్సీ 3:17 - మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
ఇక్కడ దేవుని వాక్యం మనం ఏమి చేసినా యేసుక్రీస్తు ద్వారా చేయమని చెబుతుంది.
ఇంకొక వచనం చూద్దాం.
యోహాను 14:13,14 - మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
యోహాను 16:23 -మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఇక్కడ యేసు ప్రభువే నా నామములో తండ్రిని అడగండి అని చెబుతున్నారు.
ఇప్పుడు ఎందుకు యేసు నామములో ప్రార్థన చేయాలి ? అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం.
ఎందుకంటే, యేసుక్రీస్తు ప్రభువే మన పాపములు క్షమించడానికి నరావతారిగా వచ్చి, మరణించి దేవునితో మనం కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాడు.
ఆయన ప్రాయశ్చిత్తం వలనే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి అంగీకరిస్తాడు. క్రీస్తుకు వేరుగా మనకు రక్షణ లేదు.
కాబట్టి క్రీస్తు నామంలో మన ప్రార్థన దేవునికి సమర్పిస్తాం.
అంతే కాకుండా, మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభువు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
మనం ఆయన ద్వారా తండ్రికి విజ్ఞాపన చేస్తాం, ఆయన మనకొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు.
అందుకే ఆయన చిత్తములో అడగాలి అని వాక్యం బోధిస్తుంది.
1 యోహాను 5:13,14 -ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.
ఇక్కడ ఆయన చిత్తానుసారముగా అంటే ఆయన ఉద్దేశించిన రీతిగా,ఆయన ద్వారా అని అర్థం చేసుకోవాలి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు ప్రభువును మన జీవితాలపై అధికారిగా ఒప్పుకోవడం. క్రీస్తు చేసిన త్యాగమును అన్వయించుకొని క్రీస్తు ద్వారా లభించిన కృపతో తండ్రి సన్నిధికి ధైర్యముగా వెళ్లడం.
" యేసు నామంలో " అనే పదబంధాన్ని వక్రీకరించి వాడుకునే వారు చాలా మంది ఉన్నారు కానీ, దేవుని చిత్తంలో ఉన్న వాటిని దేవుని సన్నిధిలో పెట్టడానికి దేవుడే ఇచ్చిన తన కుమారుని నామంలో ప్రార్థించడం విశ్వాసులకు దేవుడిచ్చిన ధన్యత.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment