ప్రతి సోమవారం మా కుటుంబ ప్రార్థనలో ఆదివారం చెప్పబడిన ప్రసంగం గురించి చర్చ చేస్తాము.
ముఖ్యంగా మా పిల్లలకు ఆ విషయం చెప్పాము. అందువల్ల వారు చాలా శ్రద్ధగా ఆదివారం ప్రసంగం వింటున్నారు, పాయింట్స్ కూడా రాసుకుంటున్నారు.
ఈ వారం మా పెద్ద కూతురు దాదాపు మొత్తం ప్రసంగాన్ని తిరిగి అప్పజెప్పింది. నేను తన నోట్ బుక్ తీసుకొని చూసి ఆశ్చర్యపోయాను. చాలా చక్కగా ప్రసంగంలోని పాయింట్స్ రాసుకుంది.
మేము తనని అభినందించి తను అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాము.
తల్లిదండ్రులకు ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ మాటలు పంచుకుంటున్నాను.
పిల్లలకి ఆదివారం ప్రసంగం శ్రద్ధగా వినాలని, నోట్స్ రాయమని చెప్పండి.
మిగతా ఆరు రోజులు స్కూల్లో చేసే పని కూడా అదే కదా. స్కూల్ చదువులు ముఖ్యమే కానీ, దేవుని వాక్యం ఇంకా ముఖ్యమని కూడా వారికి తెలియజేయాలి, నేర్పించాలి.
ఆ తర్వాత వారికి ఏమి అర్థం అయ్యిందో అడగండి. అర్థం కాకపొతే వివరించి చెప్పండి.
ఒకవేళ మీ పిల్లలు సండే స్కూల్ వెళ్లే చిన్న వయసులో ఉన్నా సరే, వారేం నేర్చుకున్నారో చెప్పమని అడగండి.
తల్లిదండ్రులుగా మన ప్రాథమిక బాధ్యతని మరిచి మొత్తం భారం సండే స్కూల్ టీచర్స్ మీద వేయకండి.
ద్వితియో 6: 6-7 - నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
ఈ మాటలు ప్రాథమికంగా తల్లిదండ్రులకు దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించినవి.
ఇలా చేయాలంటే ముందు తల్లిదండ్రులు దేవుని వాక్యం చదవాలి. వాక్యంలో ఎదగాలి, వాక్యం పిల్లలకు నేర్పాలి.
అటువంటి తల్లిదండ్రులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ఆమేన్.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment