క్రైస్తవులు వివాహం చేసుకునే సమయంలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. బైబిల్లో ఈ విధంగా ప్రమాణాలు చేయాలని లేకపోయినప్పటికీ, వివాహం చాలా ప్రాముఖ్యమైనదని, ఇలా నిబంధన చేయడం ద్వారా దానిలోకి అడుగేయాలని సూచనగా ఈ ప్రమాణాలను క్రైస్తవులు చేస్తారు.
అయితే, క్రైస్తవులు రక్షించబడిన తర్వాత దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడటం, వివాహము కన్నా ప్రాముఖ్యమైనది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో (అపోస్త 20:28) సభ్యులుగా ఉండడం ప్రతి క్రైస్తవుని బాధ్యతగా ఉంది. ఒక ప్రత్యేక సంఘానికి అంటుకట్టబడకుండా, సంఘానికి వేరుగా ఉండడం వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదు. అందుకే, సంఘములో చేర్చబడడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.
సరదాగా రెండు మూడు గంటల కార్యక్రమానికి వచ్చినట్టుగా సంఘానికి వచ్చే క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. సంఘము పట్ల తీవ్రమైన ఆసక్తి, సంఘానికి నిబద్ధత కలిగి లేకపోతే క్రీస్తు సారూప్యంలో ఎదగడం కష్టమే. సంఘముతో నిబంధన చేసి, సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుడు ఇచ్చిన వరాలను సంఘక్షేమాభివృద్ధికి ఉపయోగిస్తూ క్రీస్తు కొరకు జీవించే, క్రీస్తును ప్రకటించే క్రైస్తవులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం.
సంఘానికి అంటుకట్టబడడం పైపైన విషయంగా చూసే క్రైస్తవుల దృక్పథాన్ని మార్చాల్సిన అవసరం సంఘ కాపరులకు, స్థానిక సంఘాలకు ఉంది. అందువల్ల, నూతన సభ్యులతో సంఘ నిబంధన చేయించడం మంచిదని మేము విశ్వసిస్తాం. ఆ నిబంధన పత్రం మీద వారితో సంతకం చేయించి, ఆ పత్రాన్ని ప్రతిరోజూ చూసేలాగా ఇంట్లో ఎక్కడైనా ఉంచి, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేసేలా ప్రార్థించమని ప్రోత్సాహిస్తాం.
సంఘముతో నిబంధన చేసినంత మాత్రాన, విశ్వాసులు సంఘము పట్ల ఆసక్తి, సంఘాన్ని ప్రేమించే విషయంలో ఆశ, ఎప్పటికీ కలిగి ఉంటారు అని అర్థం కాదు. కానీ వారు ఆసక్తిలో తగ్గిపోయినప్పుడు వారికి నిబంధనను గుర్తు చేసి తిరిగి ప్రోత్సహించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. మీరు నిబంధన చేశారు, ప్రభువు మీకు సహాయం చేస్తాడు, సంఘములో ఏమీ చేయకుండా ఊరికే వచ్చిపోయే క్రైస్తవులుగా ఉండకండి ప్రోత్సహించడానికి కూడా సహాయకరంగా ఉంటుంది.
సంఘాన్ని క్రీస్తు ప్రేమతో ప్రేమించి సంఘముగా క్రీస్తులో కలిసి ఎదిగే క్రైస్తవులుగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయును గాక. ఆమెన్.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment