రెండు రోజుల క్రితం డ్యూటీ నుండి ఇంటికి వస్తుంటే ఒక్కసారిగా అలసట, అంతరంగంలో నిరుత్సాహం, ఏదో బరువు నన్ను ఆవరించినట్టుగా అనిపించింది.
మెల్లిగా ప్రార్థన చేస్తూ ఎవరికైనా కాల్ చేసి మాట్లాడితే, ప్రార్థనా సహాయం కోరితే బాగుంటుంది అని అనిపించింది. నా స్నేహితునికి కాల్ చేశాను. నా పరిస్థితి చెబితే, తను కూడా అదే పరిస్థితిలో ఉన్నానని చెప్పడంతో ఇద్దరం ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసాం.
ప్రార్థనలో " దేవా, మా చింతలను తొలగించి నీ మీద ఆధారపడి కొనసాగే కృపనిమ్మని అడిగాం".
తిరిగి ప్రభువిచ్చిన ప్రోత్సాహంతో రోజువారి కార్యక్రమాలు కొనసాగాయి.
అప్పుడే ఈ మాటలు రాశాను.
నిరుత్సాహం ఆవరించినపుడు
నిరాశ దాడిచేస్తున్నపుడు
నిమ్మళం లేని మనసు
నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు
నిజ దేవుడైన నిత్యుడైన
యేసే నా ఆశ్రయం
మోయలేని భారం మోస్తున్నపుడు
మానలేని గాయాలు బాధిస్తున్నపుడు
మనుజావతారునిగా
మహిని విడిచి వచ్చిన
మహా దేవుడైన యేసే నా ఆశ్రయం
నా దాగు చోటు ఆయనే
నా మంచి కాపరి ఆయనే
నెమ్మదిచ్చేది ఆయనే
తన సన్నిధిలో
శాంతినిచ్చేది ఆయనే
పరిచర్యలో ఉన్నంత మాత్రాన నిరుత్సాహం,నిరాశ, సవాళ్లు ఉండవని కాదు. వాటి ఆధీనంలోకి పూర్తిగా వెళ్లిపోకుండా,ప్రభువు వైపు చూడాలి.
పరిచర్యలో మనకు దగ్గరిగా ఉండే మంచి స్నేహితులను మనం కలిగియుండాలి. హృదయంలో గల విషయాలు పంచుకునే వారిని సంపాదించుకోవాలి. పరస్పర క్షేమాభివృద్ధి కోసం ఈ స్నేహం చాలా మంచిది.
అంతిమంగా క్రీస్తు వైపు చూస్తూ ఆయన నుండి శక్తి పొందుకొని తిరిగి మన ముందు గల పరుగుపందెంలో పరుగెత్తడానికి సిద్ధమవ్వాలి.
అటువంటి సహాయం దేవుడు మనకు దయచేయును గాక.
- Dr Shankar Babu

Great...
ReplyDelete