దేవుని వాక్యములో పాటలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. కీర్తనల గ్రంథము మొత్తం పాటలే.
దేవుని స్తుతించుటకు, ఆయనను కొనియాడుటకు, కృతజ్ఞత చెల్లించుటకు, ప్రార్థించుటకు రాసిన పాటలు బైబిల్లో మనం చూస్తాము.
కానీ, నేటి క్రైస్తవ సమాజంలో లేదా సభలలో పాడే పాటలు కేవలం ప్రజలను ఆకర్షించడానికి లేదా ప్రజలను సభలకు రప్పించి కూర్చోబెట్టడానికి అన్న చందంగా తయారైంది.
క్రైస్తవ కార్యక్రమానికి ముందుగా పాటలు పాడుతుంటారు మంచిదే కానీ, ఆ పాటలు అందరూ వచ్చే వరకు ప్రసంగానికి ముందు కాస్త సమయం గడపడానికి పాడటం మంచిది కాదేమో అని నా అభిప్రాయం.
ఆ పాటలు పాడేవారు స్టేజ్ మీద పాడుతుంటే, స్టేజ్ కింద కూర్చున్న వారు ఫోన్స్ చూసుకుంటూ, ఇతరులతో మాట్లాడుకుంటూ ఉంటారు.
అందుకు కాదు కదా క్రైస్తవులు పాడాల్సింది.
ఆదివారం కూడా, స్టేజి మీద సంగీత బృందం పాటలు పాడుతుంటారు. సంఘములో కొంత మంది పాడుతూ, కొంతమంది మౌనంగా ఉంటారు.
పాటలు పాడేవారు సంఘాన్ని పాడటానికి ప్రోత్సహించాలి.
వారి స్వరం ఎక్కువగా వినబడకుండా, మైక్ సౌండ్ తగ్గించాలి.
సంఘముతో కలిసి పాడాలి.
కొన్ని సార్లు సంగీత వాయిద్యాల హోరును కూడా తగ్గించి, సంఘమంతా వారి స్వరాలెత్తి దేవునికి పాటలు పాడాలి.
కొలస్సీ 3:16 - సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
ఇవి సంఘానికి రాయబడిన మాటలు.
ఈ వచనాలు పాటించాలంటే, సంఘంగా కూడినప్పుడే సాధ్యమవుతుంది.
దీనినే సంఘంగా పాడటం (Congregational Singing) అంటారు. సంఘముగా పాడటం దేవునితో మరియు ఒకరికి ఒకరితో అనే విషయం ఈ వచనం మనకు బోధిస్తుంది.
దేవుడు మనకు స్వరాలిచ్చింది అరవడానికి కాదు, ఆయన్ను పాటలతో ఆరాధించడానికి. కాబట్టి, మన స్వరాలు మధురంగా లేకపోయినా, సంఘముతో కలిసి, మన హృదయాలను పరీక్షించే దేవున్ని పాటలతో అరాధించుదాం, కీర్తించుదాం.
ఒకవేళ సంఘాన్ని పాటలతో ప్రోత్సహించే బాధ్యత మనకు ఇవ్వబడితే, మన వరాల్ని చూయించాలనే ఉద్దేశంతో కాక, సంఘాన్ని పాడటానికి ప్రోత్సహించే, పురికొల్పే పరిచర్య చేయడానికి ముందుకు వద్దాం.
దేవుడు అటువంటి కృప మనకు దయచేయిను గాక.
- డా. శంకర్ బాబు
May the women of the church today be like Biblical and be like Christ likeness
ReplyDeleteThis article is Biblically sound and healthy
ReplyDelete