గత వారం విపరీతమైన తలనొప్పి, జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. రక్త పరీక్షలలో డెంగ్యూ జ్వరం అని తేలింది. తల బద్దలైపోతున్నట్లు నొప్పి, ఒళ్ళంతా కాలడం వలన నిద్ర కూడా సరిగా పట్టలేదు. మూడు రోజులు ఆస్పత్రిలో ఇంజెక్షన్స్ మరియు iv ఫ్లూయిడ్స్ ఇచ్చారు. నాలుగవ రోజు డిశ్చార్జ్ చేశారు.
నాకు బాగాలేదని చెప్పగానే పని పక్కన బెట్టి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది ఒక ఫ్యామిలీ.
నేను వెళ్ళేలోగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని, ఇన్సూరెన్స్ తాలూకు పేపర్ వర్క్ అంతా సిద్ధం చేశాడు ఒక తమ్ముడు.
కొంతమంది బ్రదర్స్ నాతో ఆస్పత్రిలో ఉండి నాకు సహాయం చేశారు.
నా గురించి ప్రార్థించిన వారు, నన్ను కలిసి వెళ్ళినవారు మరికొందరు.
వంతుల వారిగా రాత్రులు నాతో ఉండి సపర్యలు చేసింది మరికొంతమంది బ్రదర్స్.
మరోవైపు మా పిల్లలకు టైఫాయిడ్ జ్వరం ఉండడంతో వారిని రక్తపరీక్షలకు తీసుకెళ్లింది మరో బ్రదర్.
ఇంట్లో ఉండి నా భార్యకు సహాయం చేశారు కొందరు సిస్టర్స్.
తిరిగి నన్ను ఇంటి దగ్గర దింపేసే వరకు నన్ను సొంత కుటుంబ సభ్యునిగా సేవ చేసిన వీరందరూ, మా కుటుంబాన్ని వారి కుటుంబముగా భావించి సహాయం చేసిన వీరందరూ మా సంఘ సభ్యులు.
వీరిలో మా పాత సంఘానికి చెందిన తమ్ముళ్లు కూడా ఉన్నారు.
సంఘమంటే ఆదివారం జరిగే కార్యక్రమం కాదు, సంఘమంటే దేవుని కుటుంబం (గలతీ 3:26; ఎఫెసీ 2:19,1తిమో 3:15).
కుటుంబంలో గల సభ్యులు పరస్పర ప్రార్థన మాత్రమే కాదు, పరస్పర సహాయ సహకారాలు కూడా అందించుకోవాలి.
సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమైయున్నాము (1యోహాను 3:16) అనే ఆజ్ఞను పాటించడానికి పిలవబడిన సంఘము, సంఘములో సభ్యుల అత్యవసర పరిస్థితుల్లో నిలబడి సమయం,శక్తి వెచ్చించాలి.
సంఘములో మంచి బోధ ఉంటే సరిపోదు, సంఘము ఎన్నో కార్యక్రమాలు చేస్తే చాలదు, సంఘము ఒకరిపట్ల ఒకరు ప్రార్థన చేస్తే సరిపోదు, సంఘము క్లిష్ట సమయాల్లో ఒకరికొరకు ఒకరు నిలబడాలి.
అప్పుడే కదా ఆ సంఘము క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నట్లు. అందుకేనేమో పౌలు సంఘములో ప్రేమ గురించి ఒక అధ్యాయం రాశాడు (1 కొరింథీ 13).
ఈ సంగతులను బోధించిన నేను, ఆస్పత్రిలో ఉన్నపుడు సంఘము ద్వారా ఆ ప్రేమను అనుభవించాను.
నేటి దినాల్లో కేవలం కార్యక్రమం మీద దృష్టి పెట్టి సభ్యులతో సంబంధాలు లేకుండా పరిచర్యలు కొనసాగిస్తున్నారు.
ఆదివారం ఆరాధన కార్యక్రమానికి ప్రజలు వస్తే చాలని నాయకులు అనుకుంటున్నారు, అదే ఆరాధన కార్యక్రమానికి వెళ్తే చాలని విశ్వాసులు అనుకుంటున్నారు. కానీ,నూతన నిబంధన ఎక్కడా కూడా ఇటువంటి సంఘ కార్యక్రమాలు కలిగి ఉండాలని చెప్పలేదు.
నూతన నిబంధన బోధ ప్రకారం, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందే విధంగా సంఘ కాపరి సంఘాన్ని ప్రోత్సహించాలి.
సంఘస్తులు కూడా కేవలం ఆదివారం పైపై పలకరింపులు చేయకుండా ఇతరుల కష్ట నష్టాలలో, సంతోష దుఃఖ సమయాల్లో ఆసరాగా ఉండాలి (రోమా 12:9-16).
అప్పుడే ఆ సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని మహిమ కొరకు పరిచర్య చేయగలుగుతుంది. అటువంటి సంఘాలుగా ఉండడానికి దేవుడు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment