సామెతలు 27:5-6 - లోలోపల ప్రేమించుటకంటే బహిరంగముగా గద్దించుట మేలు.
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
సంఘములో ఎవరైనా వచ్చి మన పాపాన్ని సరిచేస్తున్నారు లేదా గద్దిస్తున్నారు అంటే అతడు లేక ఆమె మన మేలును కోరుతున్నారని, వారు మన క్షేమం కోరే స్నేహితులని మనం గుర్తించాలి.
ఇలా సరిచేయడం వలన వారికి వచ్చే లాభం ఏమీ లేదు, ఆ దిద్దుబాటు వలన మనకే ఆత్మీయ లాభం.
మన పాపాన్ని సరిచేసేవారు, గద్దించేవారు లేకపోతే మోసకరమైన, భయంకరమైన వ్యాధి గల మన హృదయం మన పాపమును కప్పేసి ఆ పాపములో మనల్ని బందీలుగా చేసే అవకాశం ఉంది.
ఉదా : నేను చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం తప్పు కాదు అని నమ్ముతాను అనుకుందాం. సంఘములో ఒక చిన్న అబద్ధం చెబితే ఒక అన్న వచ్చి అది చిన్నదైనా,పెద్దదైనా పాపమే, ఇలా చిన్నవే పెద్దవై నిన్ను ఒక అబద్ధికుడుగా చేస్తాయి అని వాక్యం తెరిచి చూపించి సరిచేశారు అనుకుందాం.
దేవుని వాక్యం ప్రకారం అది పాపం అని అప్పటి వరకు నాకు అర్థం కాలేదు.
అన్న సరిచేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది.
లేదంటే ఏమయ్యేది ? నేను అవే అబద్ధాలు చెప్పేవాణ్ణి,ఒక రోజు అబద్ధికుడిగా దేవుని దృష్టిలో పాపము చేస్తూ, సంఘములో చెడ్డ పేరు పొందుకునేవాణ్ణి.
సంఘములో గల ఇతరులు మన పవిత్రత కొరకు దేవుడు ఇచ్చిన సాధనాలు.
అందుకే సంఘముకు మనం అంటుకట్టబడి ఉండాలి. కేవలం ఆదివారం రెండు గంటలు ఆరాధన కార్యక్రమంలో కూర్చొని వచ్చేస్తే, ప్రజలతో సంబంధాలు కలిగి ఉండకపోతే, మనల్ని సరిచేసేవారు, సహాయం చేసేవారు ఎవరుంటారు ?
నాకెవరూ అవసరం లేదు, నేను వ్యక్తిగతంగా దేవునిలో ఎదుగుతాను అని అనుకుంటే పొరపాటే.
సంఘముకు అంటుకట్టబడకుండా దేవుడు ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనల్ని ఎదిగింపజేయడు.
అందుకే, ఇతరులు మన పాపం సరిచేసినప్పుడు సమర్థించుకోకుండా, తగ్గించుకొని పాపం అంగీకరించాలి. అప్పుడే దేవుడు మనం ఆయనలో ఎదగడానికి సహయం చేస్తాడు.
యాకోబు 4:6- దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
ఇతరుల పాపమును ప్రేమతో, దీనత్వముతో సరిచేయాలి (ఎఫెసీ 4:15).
ఇతరుల పాపమును సరిచేసే ముందు మన హృదయాలు కూడా పరీక్షించుకోవాలి, వారిని గూర్చి ప్రతికూలంగా తీర్పు తీర్చే ఉద్దేశంతో సరిచేయకుండా చూసుకోవాలి (మత్తయి 7:1-5).
ఆ వ్యక్తి గూర్చి ప్రార్థన కూడా చేయాలి.
లోలోపల ప్రేమ నటిస్తూ ముద్దులు పెట్టే వారి కన్నా, మన ఆత్మీయ క్షేమం కొరకు మనకు గాయాలు చేసే స్నేహితులు ఉండడం క్షేమకరం.
అటువంటి స్నేహితులని సంపాదించుకుందాం.
దేవుని మహిమ కొరకు పాపమును జయిస్తూ దేవునిలో ఎదుగుదాం.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment