ఈ మధ్యే కొంత మంది సహోదరులకు పాల్ వాషర్ గారు రాసిన " క్రీస్తు సంఘము క్రీస్తు మార్గము " అనే వర్క్ బుక్ నుండి బోధిస్తున్నపుడు ఆ పుస్తకములో సంఘ సహవాసం గురించి ప్రస్తావించబడిన ఒక వాక్యం దగ్గర మేము కాస్త సమయం గడిపి చాల చర్చ చేయడం జరిగింది.
ఆ చర్చ తాలూకు విషయాలు మరియి కొన్ని నా వ్యక్తిగత పరిశీలనలు ఈ ఆర్టికల్ లో రాయడానికి ప్రభువు సహాయం చేసాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10: 24,25 లో "కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,
25 ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము" అని గ్రంథ కర్త రాస్తాడు.
ఈ పత్రిక ఎవరికైతే రాయబడిందో వారు క్రైస్తవ జీవితంలో ఎన్నో పాత నిబంధన సూత్రాలు పాటించే ఒత్తిడి మరియు ఇతర శ్రమల గుండా వెళ్తున్నారని ముందు అధ్యాయాలు చదివితే మనకు అర్థం అవుతుంది. ఈ వచనంలో సంఘముగా కూడుకోవడం కొందరు మానుకుంటున్నారు అని కూడా ప్రస్తావించబడింది. అయితే వీరిని ప్రోత్సహిస్తూ గ్రంథ కర్త ఈ వచనాలు రాశాడు.
కొన్ని పరిశీలనలు :
1.ఆదినము సమీపిస్తుంది అంటే క్రీస్తు రెండవ రాకడ దినం దగ్గరవుతుంది కాబట్టి
2. సంఘముగా కలవడం మానొద్దు
3. మరి ఎక్కువగా చేయుచు అంటే ఎక్కువ సార్లు కలవండి
4. ఎందుకు కలవాలి ? ఒకనినొకడు హెచ్చరించుకోడానికి కలవాలి, ప్రేమ చూపడానికి కలవాలి, మంచి పనులు చేయడానికి ఒకని నొకడు పురికొల్పడానికి చేయాలి.
5.
మొదటిగా, అంత్య దినాలలో సంఘము చేయాల్సిన పని ఏమిటంటే సంఘముగా ఎక్కువగా కలవడం. కలిసినప్పుడు కేవలం పైపైన మాటలు మాట్లాడకుండా ప్రోత్సహించుకోడానికి, ఒకనినొకడు పురికొల్పుకోడానికి ప్రయత్నం చేయాలి.
శ్రమలలో ఉన్నవారిని మీరు ఎక్కువ సార్లు కలవండి అని గ్రంథకర్త చెబుతున్నాడు. అది చాలా కష్టం. అయినా ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే సంఘముగా కలవడమే ఆ శ్రమల నుండి తప్పించుకోడానికి ఒక మార్గం కాబట్టి. అలా కలిసినప్పుడు ఇతరులు నిన్ను ప్రోత్సహిస్తారు, ప్రార్థన చేస్తారు, నీ భుజం తట్టి నిలబడతారు.
ఇక్కడ ఒక మాట : శ్రమలలో ఉన్నవారినే ఎక్కువ సార్లు కలవండి అని వాక్యం చెబుతుంటే, ఏ శ్రమలు లేని మనం సంఘముతో కలవకుండా, సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించుకోవాలి.
క్రైస్తవులకు శ్రమలు కలుగుతున్న దేశాలలో సైతం విశ్వాసులు ఎవరికీ కనబడకుండా రహస్య ప్రదేశాలలో కలుస్తుంటారు. దొరికితే చనిపోయే పరిస్థితి ఉందని తెలిసినా సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయరు.
కానీ మనలో చాల మంది, చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి సంఘ సహవాసానికి రాకపోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఉదాహరణకు : ఇంటికి బంధువులు వచ్చారు కాబ్బటి రాలేము అంటారు. ఇంటికి వచ్చిన బంధువులు క్రైస్తవులైతే, పదండి సంఘ సహవాసానికి వెళదాం, బైబిల్ నిర్లక్ష్యం చేయొద్దని చెబుతుంది కదా, మా సంఘముతో కూడా మీకు పరిచయం చేపిస్తాను అని చెప్పి వారిని కూడా తీసుకురావాలి.
ఒకవేళ బంధువులు క్రైస్తవులు కానివారైతే, మేము సంఘ సహవాసం వెళ్ళాలి, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పాలి. మీరు వెళ్లి రండి పర్వాలేదు అని వాళ్ళు అంటే, మనం సహవాసానికి వెళ్ళాలి. అప్పుడు వీరు కూడా మనకు సహవాసం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది.
చాలా ప్రాముఖ్యమైన పనులు ఉన్నపుడు పర్వాలేదు కానీ, మిగతా సందర్భాలలో, ఎక్కడైతే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవచ్చో అక్కడ చేసుకొని సంఘముతో కలవడానికి మనం ప్రయాసపడాలి.
రెండవదిగా, సంఘముగా కలిసినప్పుడు కేవలం పైపైన మాటలు మాట్లాడకుండా ప్రోత్సహించుకోడానికి, ఒకనినొకడు పురికొల్పుకోడానికి ప్రయత్నం చేయాలి.
చాల మంది సంఘానికి పిల్లలు స్కూల్లో హాజరు వేసుకోడానికి వెళ్తున్నట్లుగా వెళ్తారు. సంఘంలో జరిగే కార్యక్రమానికి హాజరై, హమ్మయ్య నేను కూడా సంఘ సభ్యుడనే అనే భ్రమలో బతుకుతుంటారు. ఇక్కడ వాక్యంలో చెప్పబడిన విషయాలు పాటించకపోయినా నేను మంచి క్రైస్తవుడినే అనే అపోహలో ఉంటారు.
ఇతరులను ప్రోత్సహించడానికి సంఘానికి రావాలి, కేవలం ప్రైస్ ద లార్డ్ చెప్పడానికి కాదు. ఇతరులను పురికొల్పడానికి రావాలి, నాకేమైనా దొరికితే చాలు అని రాకూడదు. రాజకీయాల గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి కాదు, సంఘముగా కలిసినప్పుడు ప్రాథమికంగా చేయాల్సిన పనులు ఏమిటి అనే సంగతులను గూర్చి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం.
ఎన్ని రోజులయ్యింది ఒక విశ్వాసిని ప్రోత్సహించి, ఎన్ని రోజులయ్యింది ఒక విశ్వాసిని ప్రేమించి, మంచి పనులు చేయడానికి పురికొల్పి ?
అంత్యదినాలలో ఉన్న మనము సంఘములుగా ఎక్కువ సార్లు కలవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకొని,పురికొల్పుకోడానికి ప్రభువు సహాయం చేయును గాక.
Dr. Shankar Babu K
Comments
Post a Comment