యూదా దేశం మీదికి దేవుడే బబులోను రాజును లేపి నాశనం చేయడానికి పంపించాడు.
ఎందుకు ? ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమే.
యిర్మీయా 25:6-8 - యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
అయితేమీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్నెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను.
ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు (యిర్మీయా 32:30).
పాఠం : దేవుడు తనకు వ్యతిరేకంగా పాపం చేసిన తన ప్రజలను శిక్షించడానికి అన్యుడైన నెబుకద్నెజరును లేపాడు. అంతే కాదు నెబుకద్నెజరును "నా సేవకుడు" అంటున్నాడు.
మనం ఆయనకు విరోధంగా చేస్తున్న పాపాన్ని బట్టి, దేవుడు మనకు శిక్ష వేస్తాడు.
ఆ శిక్షను కొన్నిసార్లు ఇతరుల నుండి అంటే అన్యులనుండి కూడా మనకు దేవుడు దయచేసే అవకాశం ఉంటుంది. .
ఇది విన్న సిద్కియా రాజు హెబ్రీ దాసులను వదిలేయాలని యెరూషలేము ప్రజలతో నిబంధన చేసి, దాసులను దాసురాండ్రను విడుదల చేశారు.
అంటే, మొదటగా ఈ దాస దాసీలను ధర్మశాస్త్రం ప్రకారం 7 సంవత్సరాల తర్వాత విడిపించకుండా ఇంకా సేవ చేయించుకున్నారని మనకు తెలుస్తుంది.
దేవుని శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ దాస దాసీలకు వెంటనే విడుదల ఇచ్చి ఉంటారు.
కానీ, ఆ తర్వాత వారు మనస్సు మార్చుకున్నారు. తిరిగి తాము విడుదల చేసిన దాస దాసీలను మళ్ళీ తెచ్చుకొని వారిని దాస్యంలో ఉంచారు (34:11).
పాఠం : దేవునికి భయపడి పాపం చేసి, ఆ తర్వాత పాపానికి దేవుని క్షమాపణ పొందుకొని, మళ్ళీ అదే పాపం మాటిమాటికి చేయడం ఘోరమైన పాపం.
కృప విస్తరించాలని పాపము యందు నిలిచి యుండకూడదు (రోమా 6:1).
అప్పుడు దేవుడున్నాడు " ఎవరైనా దాసులు మీకు అమ్మబడితే ఆరు సంవత్సరాల తర్వాత ఏడవ సంవత్సరంలో వారిని విడిచిపెట్టాలి. మీ పూర్వీకులు నా మాట వినలేదు. ఇటీవల మీరు పశ్చాత్తాపపడి నా దృష్టికి ఏది మంచిదో అది చేశారు - ఒక్కొక్కరూ సాటివారిని విడుదల చేస్తామని ప్రకటన చేశారు.
మీరు నిబంధన కూడా చేశారు. ఇప్పుడైతే మీరు మనసు మార్చుకొని నీ పేరు దూషణకు గురిచేశారు. దాసులను మళ్ళీ తెప్పించుకొని దాస్యంలో ఉంచారు. గనుక ఖడ్గానికీ కరువుకు ఘోరమైన అంటురోగానికీ గురియై మీరు చావడానికి అప్పగిస్తాను, మిమ్మల్నీ లోక రాజ్యాలన్నిటికీ అసహ్య కారణంగా చేస్తాను" (34:12-17).
పాఠం : పై విధంగా దేవుడు మన పాపాలను బట్టి శిక్ష వేస్తె మనలో ఎవరూ కూడా ఈ భూమి మీద బ్రతకలేం. మన ప్రవర్తన దేవుడు చూడడు అనుకోవద్దు.
క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన కృపను, క్షమాపణను నిర్లక్ష్యం చేసి మళ్ళీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. ఆయన వాక్యం పాటిస్తూ, ఆయనతో సంబంధం కలిగి ఉంటూ, ఆయన మీద ఆధారపడుతూ కొనసాగాలి.
దేవా, ఎన్నో సార్లు నీ కొరకు భక్తితో, పవిత్రంగా బ్రతుకుతాను అని చెప్పి ఆ తర్వాత పాపాన్ని ప్రేమించినవాడను, నీ మాటను జవదాటిన వాడను. నన్ను క్షమించు దేవా, నీ కుమారుని ద్వారా ఇచ్చిన కృపను తేలిగ్గా తీసుకోకుండా నాకు సహాయం చేయు ప్రభువా.
నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. నీ మీద నా దృష్టి కేంద్రీకరించి కొనసాగే కృపనివ్వమని నీ కుమారుని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రీ, ఆమేన్.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment