యిర్మీయా 5:7-9
దేవుని ప్రజలు, తమ దేవున్ని విడిచిపెట్టి దేవుళ్ళు కాని వాళ్ళ పేర ఒట్టు పెట్టుకున్నారు, దేవుడు వాళ్లకు సమృద్ధిని ప్రసాదించినా, వాళ్లు వ్యభిచారం చేశారు.
వేశ్యా గృహాలలో గుమికూడారు, అపవిత్రమైన జీవితాన్ని జీవించారు.
ఇలాంటివాటి కారణంగా నేను వాళ్ళను దండించకూడదా? ఇలాంటి జనం మీద ప్రతీకారం చేయకూడదా? నేను వీరిని ఎందుకు క్షమించాలి అని యెహోవా అడుగుతున్నాడు.
దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి?
నిత్య నరకం నుండి రక్షించి, నిత్య జీవమిచ్చిన దేవుని ఆరాధించకుండా, ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండా బ్రతుకుతున్నందుకు క్షమించాలా?
దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, లోక సంబంధమైన విషయాలలో లోకానుసారంగా జీవిస్తున్నందుకు క్షమించాలా?
దేవుని ఆజ్ఞలను ప్రతి దినం మీరుతున్నందుకు క్షమించాలా?
అపవిత్రమైన కన్నులు, ఆలోచనలతో మొదలెట్టి అపవిత్రమైన కార్యాలతో అనుదినము ఆనందిస్తున్నందుకు క్షమించాలా?
అనుదిన జీవితాలకు అవసరమైనవన్నీ సమృద్ధిగా ప్రసాదించినా, సంతృప్తి లేని జీవితం గడుపుతూ, వస్తుసంబంధం ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నందుకు క్షమించాలా?
దేవుని సంఘమును ప్రేమించకుండా, దేవుని ప్రజలను నిర్లక్ష్యం చేసి స్వార్థపరుడిగా జీవిస్తున్నందుకు క్షమించాలా?
సంఘములో చురుగ్గా పనిచేస్తూ ఇంట్లో వాక్య విరుద్ధమైన జీవితం గడుపుతున్నందుకు క్షమించాలా?
సంఘముగా కూడినప్పుడు పరిశుద్ధునిగా ప్రవర్తిస్తూ, బయట లోకంలో కలిసిపోయి చక్కగా నటిస్తున్నందుకు క్షమించాలా?
క్రైస్తవుడిగా చలామణి అవుతూ, క్రీస్తును ఇతరులకు ప్రకటించనందుకు క్షమించాలా?
ఇటువంటి వాటి కారణంగా
దేవుడు మనల్ని దండించడానికి అర్హుడే!
కానీ ఆయన మహా ప్రేమను ఆయన కృపను తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలకు ప్రతి దినం అనుగ్రహించి,
క్షమిస్తున్న దేవుడికి కృతజ్ఞతలు.
ఆయన శిక్షించడం లేదు దండించడం లేదు కాబట్టి, ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి, ఆయన క్షమను తేలిగ్గా తీసుకోకుండా దేవునికి ఇష్టంగా జీవించడానికి దేవుడు మనల్ని పురికొల్పును గాక.
ఆమేన్.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment