రెండు రోజుల క్రితం క్యాబ్ లో ఇంటికి వెళ్తున్నాను.
డ్రైవర్ తో మాట్లాడడం మొదలుపెట్టాను. సాధారణంగా క్యాబ్ లో వెళ్ళినప్పుడు డ్రైవర్ నేపథ్యం, నెల మొత్తం కష్టపడితే ఎంత డబ్బు వస్తుంది, తన కుటుంబ నేపథ్యం ఏమిటి మొదలైన ప్రశ్నలు అడుగుతాను. మెల్లిగా దేవుని గురించి, సువార్తను గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ఈ డ్రైవర్ పేరు విజయ్ (పేరు మార్చాను).
తను క్రైస్తవుడనని మొదటి రెండు మూడు నిమిషాల సంభాషణలోనే ఆయన నాకు చెప్పాడు.
రక్షించబడ్డావా అని అడిగితే, అవును సార్ అన్నాడు. ఈ రోజు చనిపోతే ప్రభువు దగ్గరికి వెళ్తావా అని మరో ప్రశ్న వేశాను.
విజయ్ వెళ్తాను సార్ అన్నాడు.
అసలు ప్రభువు నిన్ను ఎందుకు పరలోకానికి తీసుకెళ్లాలి అని మరో ప్రశ్న అడిగాను.
ఆయన నా పాపాల కోసం వచ్చి చనిపోయాడు కాబట్టి నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అన్నాడు.
చివరిగా, బైబిల్ చదువుతావా అన్నాను. ఎక్కడ సార్, కార్ తీసుకొని పొద్దున వచ్చేస్తే, రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తాను, టైం లేదు అన్నాడు. తను ఉండేది హయత్ నగర్ అని, ఆదివారం చర్చ్ సహవాసం కోసం కూకట్ పల్లి కి వస్తా సార్ అని చెప్పాడు.
విజయ్ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అని, రక్షణ గురించి, బైబిల్ గురించి తనకి పెద్దగా తెలియదని నాకు అర్థమయ్యింది.
అప్పుడు, బైబిల్ చదవడం ఎంత ముఖ్యమో నేను విడమర్చి చెప్పాను.
అసలు, ఒక వ్యక్తి సంఘానికి వస్తుంటే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం ఎలా ఉంది? తను బైబిల్ చదువుతున్నాడా? వాక్యానుసారమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నాడా? అనే విషయాలు ఒక కాపరి చూసుకోవాలి.
అది సంఘ కాపరి యొక్క బాధ్యత.
ఆదివారం ప్రసంగం చేయడం మాత్రమే కాపరి పని కాదు, సంఘ సభ్యుల జీవితాల్ని కాచే పని కూడా ఆయనదే .
విజయ్, నీ ఇంటి దగ్గర గల వాక్యం సరిగే బోధించే పాస్టర్ గారు ఉండే సంఘం ఉందేమో చూసుకో, వాక్యం చదవడం నిర్లక్ష్యం చేయకు, నీ ప్రాధాన్యతలను చక్కపరుచుకో అని సూటిగా నిర్మొహమాటంగా చెప్పాను. ఇలా నాకు సూటిగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్ అన్నాడు.
మా ఇల్లు కూడా రావడంతో గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నేను దిగిపొయాను.
మనసులో మెదిలిన కొన్ని విషయాలు.
1. సువార్త ప్రకటించడం కొరకు ప్రతి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది దేవుని విన్నపం కాదు మనకు దేవుని ఆజ్ఞ.
2. మన సంఘంలో గల వారిని కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగి ప్రోత్సహించాలి.
3. సంఘ కాపరి సంఘ సభ్యుల ఆత్మీయ జీవితాల్ని పట్టించుకోవాలి.
4. ఆదివారం ప్రసంగం చేయడం మాత్రమే పనిగా పెట్టుకొని, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకుండా కాపరి చూసుకోవాలి.
5. మెగా చర్చ్ బిల్డింగులు కట్టుకోవడంలో తప్పు లేదు కానీ, విశ్వాసులు రాలేనంత దూరంగా ఉండి పరిచర్య చేయడం మంచిది కాదని గ్రహించాలి.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment