దేవుడి గుణ లక్షణాలను బట్టి ఆయనను స్తుతించడం, ఆరాధించడం తెలియని విశ్వాసుల ప్రార్థనలు నేటి సంఘాల్లో విరివిగా వినిపిస్తున్నాయి.
చాలా ప్రార్థనలు ప్రక్క వారి నుండి అరువు తెచ్చుకున్నవే. అందుకే సంఘములో వినబడే ప్రార్థనలలో వాడే పదజాలం దాదాపు ఒకేరకంగా ఉంటుంది.
ప్రార్థన మొదలు పెట్టినప్పుడు చెప్పే రెండు వాక్యాలు తప్పితే మిగతా ప్రార్ధనలో ఎక్కువగా పాపం ఒప్పుకోవడం, క్షమించమని దేవుణ్ణి అడగడం, ఆ తర్వాత వ్యక్తిగత, ఇతర అవసరాల గూర్చి ప్రార్థించడం సాధారణంగా వినిపిస్తుంది. ఇవన్నీ ప్రార్థనలో భాగమే. వీటిని ప్రభువు వద్ద పెట్టి ప్రార్థించడం ప్రాముఖ్యమే.
కానీ కేవలం దేవుడు ఏమైయున్నాడో, ఆయన గొప్ప గుణ లక్షణాలు ఏమిటో, ఆయన మహత్కార్యాలు ఎంత ఉన్నతమైనవో వాటిని బట్టి దేవున్ని స్తుతించడం, ఆరాధించడం చాలా తక్కువ ప్రార్థనల్లో నేను విన్నాను.
సంఘముగా కూడుకున్నపుడు ఈ విధంగా స్తుతించమని కొన్ని సార్లు చెప్పినా, మళ్లీ మళ్లీ ఒప్పుకోలు ప్రార్థన మరియు అవసరతల ప్రార్ధనలలోకి అంతే త్వరగా వెళ్లిపోతుంటారు.
వ్యక్తిగత ప్రార్థనలో ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడం అలవాటు లేదు కాబట్టే సంఘముగా కలిసినప్పుడు కూడా అది సాధ్యం కాదు.
కీర్తనల గ్రంథములోని పాటలు చదివినప్పుడు కీర్తనాకారులు దేవుణ్ణి స్తుతించడం మరియు వారి విన్నపాలు దేవునికి తెలియజేయడం చేశారని అర్ధం అవుతుంది.
ఉదాహరణకు కీర్తన 33లో దేవునికి స్తుతి చేయుట మంచిది అని మొదలుపెట్టి, ఆ దేవుడు ఏమైఉన్నాడో అన్న సంగతులు రచయిత రాశాడు.
నెహెమ్య గ్రంథంలో 9 వ అధ్యాయంలో గల ప్రార్థన ప్రారంభంలో దేవుని గుణ లక్షణాలను గురించి మొదటగా ఆరాధించడం చదువుతాము.
ఇతరులకై విజ్ఞాపనలు, మన అవసరతల కొరకు మాత్రమే కాకుండా దేవుని సన్నిధికి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమ ఘనతను బట్టి ఆరాధించడానికి కూడా మనం రావడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment