మా రెండవ పాపకు ఒకవైపు చెవిపోగు చర్మంలో ఇరుక్కుపోయింది.
ఆ చెవిపోగు ఉన్న భాగం కాస్త వాపు వచ్చి, తనకు అప్పుడప్పుడు నొప్పి కలిగేది.
అది త్వరగా తీయించే పని మేము కాస్త నిర్లక్ష్యం చేశామని ఒప్పుకోవాల్సిందే.
అయితే, రెండు రోజుల క్రితం మా ఫ్రెండ్ ENT డాక్టర్ దగ్గరికి పాపని తీసుకెళ్లాము. చెవి దగ్గర కాస్త మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సర్జరీ స్టార్ట్ చేశారు.
చర్మం కింద వాపు, కొంచెం చీము కూడా ఉండడంతో ఆ పోగు తీయడం కష్టం అయింది. చివరికి తీయగలిగాము.
ఆ సమయంలో తనకి కాస్త నొప్పి కలిగినా, ఆ తర్వాత తనకి మంచిది కాబట్టి ఈ ప్రక్రియ తప్పలేదు.
లేదంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆ చెవి మీద పెద్ద సర్జరీ ఆయ్యేదేమో.
ఎందుకు ఈ విషయం ఇంతగా వివరిస్తున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే అది ఆత్మీయ జీవితానికి ఇన్ఫెక్షన్ లాగా హానికరం అవుతుంది.
ఉదాహరణకు, చిన్న చిన్న అబద్ధాలే కదా అని అబద్ధాలు చెబుతూ పోతే, నిన్ను ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుంది.
అబద్ధం చిన్నదైనా పెద్దదైనా పాపం కదా.
1 నిమిషం మాత్రమే ఉండే యూట్యూబ్ రీల్స్ అని చూస్తూ పోతే, ఎంతో సమయం వ్యర్థమైపోతుంది.
వ్యభిచారం చేయట్లేదు కానీ కేవలం నగ్న చిత్రాలు, వీడియోలు చూస్తున్నాను.
అదికూడా జస్ట్ 2 నిమిషాలే అనుకుంటే, ఆ తర్వాత పోర్నోగ్రఫీకి అలవాటై, జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది.
పాపం మెల్లిగానే మొదలైతుంది, ఆ తర్వాత నిన్ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని నిన్ను నాశనం చేస్తుంది.
నీ ఆత్మీయ జీవితానికి హాని కలిగించే చిన్న విషయం ఏదైనా, చిన్నగా ఉన్నపుడే తీసేసీ పడెయ్. లేదంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.
1 కొరింథీ 5:6 - పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటినీ పులియజేయునని మీకు తెలియదా ?
1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి.
దేవుడు మనకు అనుగ్రహించిన కృప,శక్తి, జ్ఞానం అనుసరించి జాగ్రత్తగా దేవుని కోసం జీవించుదుము గాక. ఆమేన్.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment