గత ఆదివారం ఫాదర్స్ డే కావడంతో మా సంఘములో గల సిస్టర్స్ కలిసి సంఘములో గల ఫాదర్స్ అందరినీ గేమ్స్ ఆడించి, కేక్ కట్ చేయించి ప్రార్థన చేసి అందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు.
చివర్లో ఒక చిన్న నాటిక చేశారు.
ఒక కూతురు వాళ్ల తల్లిని ఇంట్లో భోజనం కోసం, జ్వరమొస్తే టాబ్లెట్ కోసం,పుస్తకాల కోసం అడిగితే ఆ తల్లి ఎలా అన్నీ తెచ్చిస్తుందో చూయించారు.
అదేంటి ఫాదర్స్ డే అని చెప్పి మదర్స్ డే నాటిక వేస్తున్నారు అనుకున్నాను కానీ, వెంటనే, తెరవెనుక అని చెప్పి ఆ తల్లి తన భర్తతో ఇంటి వస్తువులు,కూరగాయలు,పుస్తకాలు, టాబ్లెట్స్ మొదలైనవి అడిగినప్పుడు ఆ తండ్రి ఎలా తెచ్చిస్తాడో చూయించారు.
అంటే, కుటుంబంలో అన్నీ దగ్గరుండి చేసేది అమ్మ అయినా, అమ్మకు అన్నీ తెచ్చి ఇచ్చేది నాన్న అనే సంగతిని చక్కగా నటించి ఫాదర్స్ అందరినీ ప్రోత్సహించారు.
నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఇంట్లో తండ్రుల బాధ్యత ఎంత ప్రాముఖ్యం అనేది గుర్తుకొచ్చింది.
కుటుంబానికి తండ్రి పెద్ద.
కుటుంబాన్ని పోషించే బాధ్యత ప్రాథమికంగా తండ్రిదే. అది భారంగా భావించకూడదు, దేవుడిచ్చిన బాధ్యతగా చేయాలి.
భార్య బయట పని చేయడం తప్పేమీ కాదు కానీ, కుటుంబాన్ని పోషించకుండా ఉండే తండ్రిని వాక్య పరంగా సమర్థించలేము.
తల్లి కూడా తన పిల్లలకు తండ్రిని గౌరవించమని చెప్పాలి.
కష్టపడి పనిచేస్తున్న తండ్రిని అప్పుడప్పుడు అభినందించాలి.
కొంత మంది పిల్లలు యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులని గౌరవించరు.
ఇతరులకు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వరు.
చిన్ననాటి నుండి పెంచి పోషించిన వారిని చిన్న చూపు చూస్తారు.
ఎఫెసీ6:2 -నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.
దేవుడి తర్వాత నీ తల్లి తండ్రి మాత్రమే నిన్ను ప్రేమిస్తారు ఆ తర్వాతే ఎవరైనా అని టీనేజీ పిల్లలకు చెప్పాలనిపిస్తుంది.
నీకు జన్మనిచ్చిందీ,చిన్న తనం నుండి నీకు అన్నీ సమకూర్చిందీ, నిన్ను చదివించిందీ,నువ్వు వ్యాధుల బారిన పడితే ఆసుపత్రులకు పరుగెత్తి నీకు సేవ చేసిందీ, నీ తల్లిదండ్రులు మాత్రమే అని గుర్తు చేయాలనిపిస్తుంది.
తల్లిదండ్రులారా, మీ పిల్లలను దేవునిలో నడిపించడం పోషించడం,కాపాడడం అనే బాధ్యతలను మీ కుటుంబాలలో పాటిస్తూ
దేవుని మహిమ కోసం సంతోషంగా ఈ బాధ్యతలను నెరవేర్చుటకు దేవుడు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment