ఉదయం టిఫిన్ తినకుండానే డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీ ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరాను. త్వరగా ఇంట్లో లంచ్ చేసి ఒక ఫ్యామిలీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి.
ఇంకో 30 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు కానీ, అకస్మాత్తుగా ఒక దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకబ్బా అని ఆలోచిస్తే, ఆ రూట్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చారని బైట కనిపిస్తున్న ఫ్లెక్సీలు చూస్తే అప్పుడు తట్టింది. ఒక 10 నిమిషాల్లో అంతా క్లియర్ అయిపోతుంది అనుకున్నాను కానీ దాదాపు రెండు గంటలు అక్కడే ట్రాఫిక్ లో ఉండిపోయాను.
జాతీయ రహదారి కావడంతో కొన్ని వందల వాహనాలు, కొన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఏసీ వేసుకొని సీఎం గారు ఎక్కడున్నారు, ఆయన ప్రసంగం ఎప్పుడు ముగిస్తారు అని మధ్య మధ్యలో లైవ్ కవరేజ్ చూస్తూ ఉన్నాను.
ఒక పక్క కోపం, మరో పక్క ఆకలి, ఆలస్యం అవుతుందని చికాకు. సీఎం గారి సభ నేనున్న ప్రదేశానికి దాదాపు 8-10 కిలోమీటర్లు. ఇక్కడి నుండే వాహనాలను ఆపేయడం ఏంటి? సామాన్య ప్రజల పరిస్తితి ఏమిటి ? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ ట్రాఫిక్ లో ఉంటే ఎలా? అని ఎన్నో ప్రశ్నలు.
చాలా ఆలస్యం అవుతుందని సాయంత్రం వెళ్లాల్సిన ప్రోగ్రాం వాయిదా వేశాను.
ఒక రెండు గంటల తర్వాత ఇంటికి వెళ్ళాను. లంచ్ చేస్తూ నా భార్యతో పైన వేసిన ప్రశ్నలు అడిగాను.
నా చిరాకును చూసి "ఇలా జరుగుతుందని దేవుడికి తెలుసు కదా! వాళ్ళను ఎందుకు నిందిస్తున్నారు? మీరు ఆ స్థితిలో ఉంటారని దేవునికి తెలియదా? దేవునికి ఓపికనివ్వమని ప్రార్థన చేస్తున్నారా? " అని అడిగింది.
కరెక్టే కదా, అదంతా దేవునికి తెలుసు.
ఆ స్థితిలో దేవుడు నాకు నేర్పించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఒపికనే.
నిజంగానే, గత వారాల్లో నేను దేవా నాకు ఓపిక (patience) ఇవ్వు అని ప్రార్థించాను.
ఆ ఓపిక నాకు దయచేయడానికి దేవుడు నా ఓపిక పరీక్షకు గురయ్యే పరిస్థితి నాకిచ్చాడు.
మూడు విషయాలు మళ్లీ గుర్తుకొచ్చాయి.
1. దేవుడు సార్వభౌముడు అని అనుకూల పరిస్థితుల్లో కేవలం బుర్రలో నమ్మితే సరిపోదు, ప్రతికూల పరిస్థితుల్లో సైతం నమ్మాలి.
2. మన సమస్య మన చుట్టూ గల ప్రతికూల పరిస్థితులు కాదు, మనమే అనే విషయం తెలుసుకోకపోతే ప్రతి రోజూ ఇతరుల్ని నిందించే అవకాశం ఉంటుంది.
3. ఏ లక్షణం గురించి ప్రార్తిస్థామో దేవుడు మనల్ని అదే లక్షణం పాటించడానికి ప్రతికూల పరిస్థితులల్లోకి మనల్ని తీసుకెళ్తాడు.
దేవుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞాని, అన్నిటి మీద అధికారం గల సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు.
కీర్తనల గ్రంథము 115:3 - మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు.
ఆయన పిల్లలుగా అన్ని పరిస్థితుల్లో ఆయన్ను స్తుతిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మహిమ కోసం జీవించుదుము గాక.
ఆమేన్.
డా.శంకర్ బాబు
Comments
Post a Comment