ఆదివారం సంఘములో ప్రసంగం చేయడం చాలా ప్రాముఖ్యమైన పరిచర్య.
సంఘ కాపరి వాక్యము నుండి చెప్పే మాటలు ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన మాటలు.
కొంతమంది ఆలస్యంగా వచ్చినా ప్రసంగం సమయానికి మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. కొందరు,సంఘానికి వచ్చి వాక్యం వినకపోతే ఏదో కోల్పోయినట్లు కూడా భావిస్తుంటారు. ఎందుకంటే, వాక్య పరిచర్య చాలా ముఖ్యం.
కానీ, ఆదివారం ఆ పరిచర్య జరగాలంటే ఇంకా ఎన్నో పరిచర్యలు జరగాలి.
చర్చ్ బిల్డింగ్ అంతా శుభ్రం చేసి, కుర్చీలు క్రమంగా వేసి సిద్ధం చేసేవారు ఉండాలి.
వాటర్ ఫిల్టర్ లో నీరు ఉంచేవారు ఉండాలి.
పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు క్రమ బద్దంగా పెట్టించే వారు ఉండాలి.
సంఘ భవనంలోకి రాగానే, ప్రేమతో పలకరించి, ఆహ్వానించి వారికి కుర్చీలు చూపించే వారు ఉండాలి.
సౌండ్ సిస్టం, మైకులు సరిగా ఉన్నాయా లేదా అని పరీక్షించే వారు ఉండాలి.
పాటలు పాడే వారు,సంగీత బృందం ఉండాలి.
కార్యక్రమం నడిపించే వారు ఉండాలి.
ప్రభువు బల్ల సిద్ధ పరిచే వారు ఉండాలి. సండే స్కూల్ పరిచర్య చేసేవారు ఉండాలి.
భోజనాలు ఉంటే అన్నీ సమకూర్చి, వడ్డించే వారు ఉండాలి.
ఆ తర్వాత మళ్లీ హాల్ అంతా శుభ్రం చేసి, చెత్త బయట వేసే వారు ఉండాలి.
వీరందరూ చేసేది కూడా పరిచర్యనే.
కాపరి తన బాధ్యతలో భాగంగా ప్రసంగం చేస్తాడు. విశ్వాసులు తమ బాధ్యతలలో భాగంగా ఈ పరిచర్యలు చేస్తారు.
1 కొరింథీ 12:5 ప్రభువు ఒక్కడే గానీ పరిచర్యలు నానా విధాలు.
ప్రసంగం చేయడం చాలా పెద్ద పరిచర్య, ఈ పనులు చాలా చిన్నవి అనుకోకూడదు.
ఈ పరిచర్యలు జరగకపోతే వాక్య పరిచర్యకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది.
కాపరి,విశ్వాసులు కలిసి సంఘంగా సంఘ పరిచర్య చేస్తారు అనే విషయం మర్చిపోకూడదు.
సంఘములో మనకిచ్చిన బాధ్యతలను ఆయన మహిమ కోసం, ఆయన నుండి మెప్పుకోసం నమ్మకంగా చేసినపుడు, దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదించి సంఘానికి ఆశీర్వాదంగా చేస్తాడు.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment