ఈ రోజు నా బైబిల్ రీడింగ్ ప్లాన్ ప్రకారం ఆదికాండం 27 వ అధ్యాయం చదువుతున్నాను. ఈ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన నుండి నాకు కలిగిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను.
పాపం ఎంత తీవ్రమైనదో, అది ఎటువంటి ఫలితాలను తీసుకువస్తుందో మనం గ్రహించడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.
ఆది 27:18,19 - యాకోబు తన తండ్రి వద్దకు వచ్చి - నా తండ్రి అని పిలువగా, అతడు - ఏమి నా కుమారుడా నీవెవరివి అని అడిగెను. అందుకు యాకోబు - నేను ఏశావు అను నీ పెద్ద కుమారుడను
ఇది మొదటి తప్పు. తన తల్లి చేయమన్నట్లుగా చేయడం వలన ఇప్పుడు తప్పులు చేయడం ప్రారంభించాడు.
కొన్నిసార్లు, దేవుడు చేయమన్నది చేయకుండా, లోకం చేయమన్నది చేసినప్పుడు మనం కూడా ఇలాగే తప్పులు లేదా పాపం చేసే అవకాశం ఉన్నది.
27:20 - అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా, అతడునీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.
రెండవ తప్పు. చేసిన తప్పు కప్పి పుచ్చుకోవాలంటే మరొక తప్పు చేయడం ఇక్కడ మనం చూడగలం.
పాపం చేయడం, ఆ పాపం కప్పి పుచ్చుకోవడం మరో పాపం. ఒప్పుకోని ప్రభువు క్షమాపణ అడగడం క్షేమం.
ఇక్కడ మరో తప్పు కూడా కనిపిస్తుంది. దేవుడే నా ఎదుటకి దాన్ని తెచ్చాడు. అంటే తన తప్పులో దేవుణ్ణి కూడా కలుపుతున్నాడు.
చాలా సార్లు, మనకు తోచింది చేసి, దేవుడే చేయమన్నాడు అన్నట్లుగా చేసే ప్రవర్తన ఇలాంటిదే.
27:21 -ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను.
మరో తప్పు. ఇస్సాకు, ఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రశ్నలు,సందేహాలు అడిగాడు? ఎందుకంటే, తనకి కూడా నమ్మబుద్ధి కావట్లేదు కాబట్టి.
కానీ, తప్పు చేయడానికి కొన్నిసార్లు ఎంతవరకు వెళ్లొచ్చో, ఎంత చాకచక్యంగా పనిచేయొచ్చో యాకోబు బాగా నేర్చుకున్నాడు.
పాపం చేయడానికి కొన్నిసార్లు మనం చూపే శ్రద్ధ, నైపుణ్యత దేవుని మాటలను పాటించడానికి చూపము.
ఆ తర్వాత ఏమైంది?
27:41 - తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.
అన్నదమ్ముల మధ్య ప్రేమ పోయి, పగ శత్రుత్వం పాతుకుపోయింది.
పాపానికి ఉన్న శక్తి ఇదే. మరణాన్ని తీసుకువస్తుంది.
ప్రజలతో గల సంబంధాలను నాశనం చేస్తుంది.
27:43,44 - నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు, నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
కుటుంబం ముక్కలయ్యింది, మరణ భయం పంచన చేరింది.
సామె 28:13 - అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
సామె 14:25 - నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
ఎఫెసీ 4:15 - ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
⁃ డా.శంకర్ బాబు

Comments
Post a Comment