హైదరాబాద్ నుండి దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో గల ఒక పట్టణానికి నేను యవ్వనస్తుల మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను. మధ్యాహ్నం సెషన్లో పోర్నోగ్రఫీ మీద మాట్లాడి యవ్వనస్తులను ఈ వ్యసనం నుండి బైటికి రావడానికి దేవుని వాక్యం నుండి ప్రోత్సహించాను. ఆ తర్వాత సాయంత్రం క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ, క్రీస్తు సంఘముకు అంటుకట్టబడిబడి, సంఘమును ప్రేమించుట అనే సంగతుల మీద బోధించాను.
మీటింగ్ అయిపోయాక భోజనం చేయడానికి వెళ్తుంటే పై ఫోటోలో ఉన్న చిన్న పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు. సార్, నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. సాధారణంగా ఆ వయసులో ఉన్న పిల్లలు నా కోసం ప్రార్థన చేయండి అని అడగరు. ఒకవేళ అడిగినా, ఎవరైనా కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమంటారు. కానీ, ఈ 13సంవత్సరాల పిల్లాడు అడిగిన ప్రార్ధనా విన్నపం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అదేమిటంటే, సార్ నేను దేవున్ని తెలుసుకోడానికి, దేవునిలో ఎదగడానికి ప్రార్థన చేయండి అని అడగడం.
నేను ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకొని, కౌగిలించుకొని, అభినందించి ప్రార్థన చేశాను. నాకు ఒక్కసారిగా సొలోమోను జ్ఞానం కొరకు దేవుణ్ణి అడిగిన వాక్య భాగం గుర్తుకొచ్చింది (1రాజులు 3:9).
ఈ పిల్లాడు రేపు పెద్దయ్యాక ప్రభువును విశ్వసించి, దేవుని కొరకు నిలబడతాడో లేదో నాకు తెలియదు కానీ, ప్రస్తుతం తన హృదయాన్ని తన వాక్యం చేత దేవుడు స్పృశించాడని నాకు అర్థం అయ్యింది.
దీని నుండి, ఎక్కడికి వెళ్లినా నమ్మకంగా దేవుని వాక్యం నేను బోధించాలి అని ప్రోత్సహించబడ్డాను. వాక్యం వినేవారు చిన్నవారైనా,యవ్వనస్థులైనా, పెద్దవారైనా ఎవరైనా సరే వాక్యం చెబుతున్న సత్యాలను వాక్యానుసారంగా చెప్పడం మన బాధ్యత.
దేవుడు తన ప్రజలను తానే తన సువార్త ద్వారా, తన వాక్యము ద్వారా రక్షించుకుంటాడు,ప్రోత్సహిస్తాడు.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment