క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన క్రమశిక్షణ ప్రార్థన. ప్రార్థన సాధారణంగా మూడు రకాలుగా చేస్తాము. దేవుని గుణ లక్షణాలను ఎత్తి పడుతూ కీర్తించే స్తుతి ప్రార్థన, ఆయన చేసిన కార్యాలకు కృతఙ్ఞతలు చెల్లించే కృతజ్ఞత ప్రార్ధన, మన కొరకు ఇతరుల అవసరతల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన. మొదటి రెండు ప్రార్థనలు చాలా ఎక్కువగా చేసే ప్రార్థనలు. అయితే, దేవుడు ఏమైయున్నాడో ఆయన గుణ లక్షణాలు ప్రస్తావిస్తూ, ఆయన కార్యాలను కొనియాడుతూ స్తుతించే ప్రార్థనలు మనం అలవాటు చేసుకోవాలి. ఆయన్ను ఆరాధించాలంటే ఆయన గుణలక్షణాలను మనం ఎత్తిపడుతూ ఆరాధించాలి.
ఉదాహరణకు, 135 వ కీర్తన నుండి నేను రాసుకున్న స్తుతి ప్రార్థన ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడా కూడా దేవా నాకు ఇది దయచేయి అనే విజ్ఞాపన చేయకుండా కేవలం ఆయన లక్షణాలు కార్యాలను బట్టి స్తుతించే ప్రయత్నం చేశాను.
కీర్తన 135
దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను నీ గొప్ప నామమును ఆరాధిస్తున్నాను. నీ నామము అన్ని నామముల కన్నా గొప్పది.
దేవా నీవు దయాలుడవు, నీ నామమును కీర్తిస్తున్నాను.
నీకొరకు యాకోబును, ఇశ్రాయేలును ఏర్పరుచుకున్న ప్రేమగల దేవుడవు, నిన్ను స్తుతిస్తున్నాను.
దేవా నీవు గొప్పవాడవు, దేవుళ్లు దేవతలు అని పిలవబడుతున్న వారి కంటే మహా గొప్పవాడవు. నీ గొప్పతనం నీవు చేసిన ఆకాశం, భూమి సముద్రంలో నేను చూస్తున్నాను. సృష్టిని చేసి సృష్టిలో నీకిష్టమైనది జరిగించే సార్వభౌముడవైన దేవుడు నీవే, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా.
నీవు మహాశక్తి గల వాడవు, బలిష్టులైన రాజులను సైతం నశింపజేసిన దేవుడవు. నీకు సాటియైన వారు ఎవరూ లేరు ప్రభువా.
నీ నామం నిత్యమూ నిలిచియుండే నామము, ఎందుకుంటే నీవు నిత్యుడవైన దేవుడవు. తరతరములు నీ నామము కొనియాడబడును గాక.
నీవు మనుష్యుల చేత చేయబడినవాడవు కావు, మనుష్యులను చేసిన సృష్టికర్తవు. నీవు చూసే దేవుడవు, మాట్లాడే దేవుడవు, నా మాటలు వినే దేవుడవు. నా దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీయందు నమ్మిక యంచిన నేను నిన్ను ఆరాధిస్తున్నాను. క్రీస్తుద్వారా నన్ను విమోచించిన నా దేవా నీకే మహిమ ఘనతలను ఆపాదిస్తూ ఈ స్తుతి క్రీస్తుద్వారా మీకే సమర్పిస్తున్నాను దేవా! ఆమెన్.
దేవుణ్ణి వాక్యానుసారంగా స్తుతించే ఆరాధించే ఆరాధికులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.
డా. శంకర్ బాబు

Comments
Post a Comment