అనేకమంది మత్తయి 25:1-13లో క్రీస్తు చెప్పిన బుద్దిగల కన్యకల ఉపమానములో పేర్కొనబడిన నూనెను పరిశుద్ధాత్మకు చిహ్నంగా వ్యాఖ్యానిస్తారు. నా ప్రశ్న ఏమిటంటే: కొంతమంది పరిశుద్ధాత్మను తక్కువగా కలిగియుండగా, మరికొందరు ఎలా ఎక్కువగా కలిగియుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందు విశ్వాసముంచిన వారి దేహాల్లో నివసిస్తాడు, ఆయన దేవుని కృప ద్వారా లభించిన వరముగా ఉన్నాడు. అలాంటప్పుడు, ఈ ఉపమానములో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను ఇతరుల నుండి "కొనుక్కోవడం" ఎలా సాధ్యమవుతుంది? దేవుణ్ణి కొనుక్కోవడం సాధ్యమా?
ఈ విధంగా అన్వయించడాన్ని Allegorism అంటారు. అంటే, దేవుడు ఉద్దేశించని, రచయిత ఉద్దేశించని విషయాన్ని పక్కనబెట్టి మనం అనుకున్నది వాక్యంలో జొప్పించి, ఆత్మీయ అర్థాన్ని ప్రకటించడం. ఇది చాలా ప్రమాదం.
బుద్ధిలేని కన్యకలు అవిశ్వాసులను సూచిస్తున్నారు. ఎందుకంటే వారు రాగానే వారికి తలుపు మూసివేయబడింది. పెండ్లికుమారుడు వారితో "నేను మిమ్మలని ఎరుగను" అని చెప్పాడు. మత్తయి 7లో కూడా ప్రభువా ప్రభువా నీ నామంలో మేము దయ్యాలను వెళ్లగొట్టాము, అద్భుతాలు చేశాము అని చెబితే, నేను మిమ్మలని ఎరుగను అని క్రీస్తు చెబుతాడు. ఇక్కడ ఎరుగను అంటే ఆయనకు వీరెవరో అసలు మొత్తానికే తెలియదు అని అర్థం కాదు. ఎందుకంటే, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వజ్ఞాని కాబట్టి. ఇక్కడ నేను మిమ్మల్ని ఎరుగను అంటే "మీరు నాకు చెందినవారు కారు" అని అర్థం. మరోవిధంగా చెప్పాలంటే, వారు రక్షించబడని వారు. ఈ ఉపమానము పెండ్లికుమారుడు అకస్మాత్తుగా వచ్చుటను వివరిస్తుంది మరియు అతని రాకడ కొరకు సిద్ధపరచబడుట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
- డా. శంకర్ బాబు

🙏
ReplyDelete