4:5 - సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.
ఆ రోజుల్లేనే ప్రజలు వివిధ దేవుళ్లు దేవతలను పూజించేవారు. అటువంటి ప్రజల మధ్య గల ఆయన నిబంధన ప్రజలు వారి దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని మీకా ప్రవచిస్తున్నాడు.
స్మరించుకోవడం అంటే రోజంతా ఆయన నామాన్ని ఉచ్చరించడం కాదు, ఆయన అధికారం క్రింద ఉండి, ఆయనకు విధేయత చూపడం.
1-4 వచనాల్లో అంతిమ విమోచన జరగబోతుంది, విమోచన కర్త తన పని సంపూర్ణం చేయబోతున్నాడు కావున మనం మన దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన మాటలకు లోబడుతూ బ్రదుకుదాం, అని మీకా బోధిస్తున్నాడు.
ఇది ప్రస్తుతం ఉన్న మనకు సరిగ్గా వర్తిస్తుంది. మన చుట్టూ వివిధ మతాలు, వారు పూజించే వివిధ దేవుళ్లు దేవతలు ఉన్నారు. వారు వారి దేవతలను దేవుళ్లను నిష్ఠగానే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. తమ శరీరాలను నలగకొట్టుకుంటున్నారు, దూర ప్రయాణాలు చేస్తున్నారు, డబ్బు, బంగారం అర్పిస్తున్నారు, ఇతరులకు సాయం దానం చేస్తున్నారు.
ఆ దేవుళ్లను దేవతలను సంతోషపర్చడానికి అవసరమైన కార్యాలను చేస్తున్నారు.
అయితే ఆయన నిబంధన ప్రజలమైన మనం ఏం చేస్తున్నాం?
క్రియల ద్వారా కాకుండా కృప ద్వారా రక్షించబడిన మనం మన దేవుణ్ణి స్మరించుకుంటున్నామా?
ఆయనకు లోబడి ఆయన మాటలకు విధేయత చూపడానికి ప్రయత్నం చేస్తున్నామా?
ఆత్మీయ క్రమశిక్షణలను ఆనందంతో చేస్తూ కొనసాగుతున్నామా?
ఆయన మహిమ కొరకు సత్క్రియలు చేస్తూ దేవున్ని మహిమపరుస్తున్నామా?
ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా?
ఆయన సంఘాన్ని సేవిస్తున్నామా?
ఆయన అంతిమ విమోచన దినం కొరకు ఆశతో ఎదురుచూస్తున్నామా?
పరీక్షించుకుందాం, ప్రభువు రెండవ రాకడ దినం వరకు ఆయనను స్మరించుకుంటూ, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ కొనసాగుదాం.
- డా. శంకర్ బాబు.

Comments
Post a Comment