ఆదిమ సంఘములో,అంతా బాగుంది అనుకున్న సమయంలో, ఒక అలజడి రేగింది. అపోస్త 6 వ అధ్యాయంలో ఆ సమస్య తాలూకు సంగతులు మనం చదవగలం.
గ్రీకు భాష మాట్లాడే యూదులు తమ విధవరాండ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని హెబ్రీయుల మీద సణిగారు. ఈ వార్త అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వారు చాలా ప్రాముఖ్యమైన, సంఘానికి క్షేమభివృద్ధిని కలుగజేసే రెండు మాటలు చెప్పడం మనం చదువుతాము.
మొదటిది, మీలో ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఈ పనికి ఏర్పరుచుకోండి.
రెండవది, అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక ఉంటాము అని చెప్పారు.సంఘము దేవుడు ఉద్దేశించిన విధంగా ఈ లోకంలో పరిచర్య చేయాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం.
అన్నిపనులు సంఘ నాయకులు చేయకుండా,ఇతరులకు అప్పజెప్పడం మరియు ప్రాముఖ్యమైన పనులు సంఘ నాయకులు చేయడం.
సంఘ నాయకులు చేసే ప్రాముఖ్యమైన పని ఏమిటి?
సంఘము కోసం ప్రార్థన చేయడం మరియు సంఘాన్ని దేవునిలో పెంచి పోషించడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని సరైన అర్థ వివరణతో బోధించడం.
మిగతా పనులు సంఘ నాయకులు చేయకూడదని అర్థం కాదు గాని ఈ రెండు ప్రాముఖ్యమైన పనులు చేయకుండా వీటిని నిర్లక్ష్యం చేయడం మాత్రం సంఘానికి క్షేమం కాదు.
అయితే సంఘ నాయకులు ఈ రెండు పనులు చేయాలంటే సంఘము యొక్క సహకారం కూడా చాలా అవసరం.
సంఘ నాయకులకు, ఈ రెండు ప్రాముఖ్యమైన పరిచర్యలు చేయడానికి సంఘము ఏ విధంగా సహకరించగలదో, కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం.
1. మొదటిగా, సంఘ నాయకులకు ప్రసంగం కొరకు సిద్ధపడడానికి ప్రార్థించడానికి కావాల్సినంత సమయాన్ని మనం ఇవ్వాలి. సరైన అర్థ వివరణ చేసి బోధించడానికి దాదాపుగా 10 నుండి 12 గంటల సమయం పడుతుందని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు. ఈ సమయం ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. రాబర్ట్ గాడ్ఫ్రే అనే భక్తుడు " సంఘ సభ్యులు ఆ సమయాన్ని చిరాకుతో ఇవ్వకూడదు, కానీ ఆ బోధకుడు ఆ సమయాన్ని తీసుకోవాలని పట్టుబట్టాలి" అంటాడు.
2. ఈ విధమైన సమయాన్ని వారికి ఇవ్వాలంటే, సంఘములో ఉన్న ఇతర పనులను, పరిచర్యలను సంఘపరిచారకులు మరియు సంఘ సభ్యులుచూసుకోవాలి.
3. సంఘ నాయకులు చిన్నచిన్న కార్యక్రమాలకు హాజరు అవ్వకపోతే సభ్యులు తప్పుగా అర్థం చేసుకోకూడదు.
4. సంఘ నాయకులు గృహ దర్శనానికి రాలేదని ఏవేవో ఊహించుకోకూడదు.
5. నాయకుల కౌన్సిలింగ్ ద్వారా, ప్రోత్సాహకరమైన మాటల ద్వారా ఎంతో క్షేమాభివృద్ధి లభిస్తుంది. దానిలో సందేహామేమీ లేదు కానీ, చాలా ప్రాముఖ్యంగా పుల్ పీట్ నుండి బోధించబడే దేవుని వాక్యము ద్వారా సంఘము ఆత్మీయంగా ఎక్కువ క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి, ముఖ్యమైన వాక్య పరిచర్య కోసం సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయాలి.
సంఘ నాయకులు కూడా అనుసరించాల్సిన విషయాలు చూద్దాం.
1. సమయాన్ని వ్యర్థముగా వృధా చేయకుండా వాక్యమును సరైన అర్థ వివరణ చేసి బోధించడానికి కష్టపడాలి. లోతుగా అధ్యయనం చేయడానికిఎక్కువ సమయాన్ని వెచ్చించాలి.అవసరమైన పుస్తకాలను కూడా చదవాలి. 2తిమోతి 4:2 - వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దేవుని వాక్యం బోధించుట లేదా ప్రసంగించుట సంఘ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ పరిచర్య కోసం ఎక్కువగా ప్రయాసపడాలి.
2. సంఘములోని ఇతర పనులను బాధ్యతలను సంఘపరిచారకులకు అప్పజెప్పాలి.
3. అన్నీ మనమే చేయాలనే తత్వాన్ని తొలగించుకోవాలి. సంఘ సభ్యులను సంఘ పరిచర్యలో అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి.
4. అన్ని కార్యక్రమాలకు నేను తప్పకుండా వెళ్లాలి, లేకపోతే వారు తప్పుగా అర్థం చేసుకుంటారు అనే తత్వం నుండి కూడా విడిపించబడాలి.
5. చివరిగా, దేవుని వాక్యం మాత్రమే ప్రజల జీవితాలను మారుస్తుందని నమ్మి, నమ్మకంగా దేవుని వాక్యమును సంఘానికి బోధించాలి.
దేవుడు ఉద్దేశించిన విధముగా మన సంఘాలను కట్టుకోడానికి దేవుడు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment