రోజు మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే దానికి ఒక ప్రధానమైన కారణం, పుస్తకాలు.
మన విద్యా విధానంలో గల పుస్తకాలు చదివి మనం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, సంస్థలను నడుపుతున్నాం. అంతేకాదు, ప్రతి దేశానికి ఆ దేశంలో నాయకులు, ప్రజలు ఏ విధంగా పనిచేయాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే సంగతులు కలిగిన పుస్తకం ఉంటుంది. అందుకే, దేశాలను నడిపించేది కూడా పుస్తకాలే అని మనం అనొచ్చు.
అందువల్లే, ఒకాయన “ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో,” అన్నాడు. పుస్తకాల్లో గల సాహిత్యంలో, సంగతుల్లో ఉన్న శక్తి అలాంటిది.
అయితే, వ్రాయడం అనేది కొందరికి మాత్రమే ఉండే దేవుని వరం.
రోజూ ఏదో ఒకటి రాయడం వారికి అలవాటుగా ఉంటుంది.
వ్రాయడం, దేవుడు వరంగా ఇచ్చినా, ఆ వరాన్ని క్రమశిక్షణగా వాడే వారే ఎక్కువగా వ్రాయగలరు. క్రమశిక్షణ కలిగి వ్యాసాలు పుస్తకాలు రాయడం అందరూ చేయలేరు.
ఎందుకంటే, ఒక వ్యాసం లేదా పుస్తకం రాయడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఆలోచించాలి, సరైన పదాలు వాడాలి, ఆ పదాలను సరైన వాక్యాలుగా అల్లాలి, మధ్యలో ఉదాహరణలు జోడించాలి, ఇదంతా చాలా ఒత్తిడితో కూడిన పని. చాలా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది.
ఇతర పనులు పక్కనబెట్టి మనసును కేంద్రీకరించి ఆలోచనలను పేపరు మీద పెట్టాలి. కానీ, ఇవేవీ రచయితలకు భారం అనిపించవు.
నాకెంతో ఇష్టమైన టిమ్ ఛాలీస్ అనే రచయిత “గాయకులు పాడతారు, రన్నర్లు పరుగెత్తుతారు, చిత్రకారుల పెయింట్ వేస్తారు మరియు రచయితలు వ్రాస్తారు.వారు రాయాలని కలలు కంటారు,కాబట్టి వారు వ్రాస్తారు. వారు వ్రాయుటను ఆనందిస్తారు, కాబట్టి వారు వ్రాస్తారు,వారు వ్రాయుటకు పిలువబడ్డారు, కాబట్టి వారు వ్రాస్తారు ” అని అంటాడు.
ఒక వ్యాసం లేదా పుస్తకం పూర్తిగా సిద్ధం అయ్యాక, అవి కొందరికైనా ఉపయోగకరంగా ఉంటే వచ్చే ఆనందం ముందు రాయడానికి పడిన శ్రమ మొత్తం ఎగిరిపోతుంది. ఇతరులను దేవుని మాటలతో ప్రభావితం చేయడం అనే మంచి పని చేసిన సంతృప్తి దొరుకుతుంది.
ఇక్కడ వ్రాయడం అనే క్రమశిక్షణ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ సమాజంలో సరైన అర్ధవివరణతో క్రైస్తవ రచనలు వ్రాసేవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోవడం నేను గమనిస్తున్నాను.
మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువయ్యాక పుస్తకాలు కొని చదవడం తగ్గిపోయింది, వ్రాసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది.
క్రైస్తవ నాయకులు కూడా సాహిత్యం వ్రాయడం కన్నా, ప్రసంగాలు చెప్పడం సులభమని ఎక్కువగా ప్రసంగ పరిచర్యకు సమయం ఇస్తుంటారు.
నేను ప్రసంగ పరిచర్యను ఇక్కడ తక్కువ చేయడం లేదు. నేను కూడా ప్రసంగీకూడనే.
కూర్చొని వ్రాసే సమయం చాలా ఎక్కువ కాబట్టి, అంత సమయం ఇవ్వలేము కాబట్టి మిగతా పనులు చేయడం మీద దృష్టి పెడుతున్నారు. వీరిలో వ్రాసే వరం ఉన్నవారు కూడా ఉన్నారు.
సి ఎస్ లూయిస్ అనే క్రైస్తవ రచయిత “ప్రపంచానికి ఎక్కువ క్రైస్తవ సాహిత్యం అవసరం లేదు. మంచి సాహిత్యాన్ని వ్రాసే ఎక్కువమంది క్రైస్తవులు అవసరం” అన్నారు.
మీకు వ్రాసే అలవాటు ఉంటే, దానిని మెరుగుపర్చుకొని మంచి క్రైస్తవ సాహిత్యం రాయండి. చిన్న చిన్న పేరాలు రాయడం మొదలుపెట్టండి. ప్రతి రోజూ రాయడం అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన రచయితల సహాయం తీసుకోండి.
చదివే అలవాటు లేకపోతే వ్రాసే అలవాటు ఉండదు అంటారు, కావున ఇతర పుస్తకాలు చదవండి.
దేవుడు మీకు దయచేసిన వరమును పదునుపెట్టి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడండి.
- డా.శంకర్ బాబు.

Comments
Post a Comment