మా సంఘంలో ఉన్న ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది.
ఈ మధ్య నాతో ఈ విధంగా చెప్పింది.
మా కాలేజ్ లో నేను కొందరితో సువార్త సంభాషణలు చేయడానికి అవకాశాలు వస్తున్నాయి.
క్రీస్తు ఎవరో, క్రైస్తవ్యం అంటే ఏమిటో చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా మంచిది అని చెప్పి ఇంకా చేయమని ప్రోత్సాహపరిచాను. ఇతరులు అడిగే ప్రశ్నలకు సహాయకరంగా ఉండే పుస్తకం కూడా ఇచ్చాను.
మా సంఘానికి చెందిన మరో సోదరి సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. గత వారంలో తను ఆఫీస్ నుండి వస్తుంటే తన ముందే ఒక బైక్ యాక్సిడెంట్ అవ్వడంతో తన బైక్ పక్కన బెట్టి వెళ్లి చూసింది. ఆ వ్యక్తికి సాయం చేయడానికి ఎవరూ రాకపోయే సరికి, ఈ సిస్టర్ ఆ వ్యక్తికి సాయం చేయడానికి వెళ్ళింది.
తనని చూసి మరో ఇద్దరు వస్తే ఒక కార్లో అ వ్యక్తిని దగ్గర్లోని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చారు.
ఆ తర్వాత ఈ సోదరి తన భర్తతో కలిసి రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యక్తిని దర్శించి వచ్చారు.
ఆరు నెలల ప్రెగ్నన్సీతో ఉన్న మరో సిస్టర్ తన భర్తతో కలిసి గత వారంలో రోడ్డు మీద ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్న కొంత మంది దగ్గరికి వెళ్లి సువార్త పత్రికలు పంచుతూ కొంతమంది మహిళలతో సువార్త సంభాషణ చేసింది.
మిగతా సిస్టర్స్ కూడా సువార్త పరిచర్య కొరకు ముందుకు వచ్చారు. రోడ్డు మీద ధైర్యంగా పత్రికలు పంచుతూ, కొంతమందితో మాట్లాడుతూ ఉన్న నా భార్యను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది అని ఒక బ్రదర్ నాతో చెప్పాడు.
మహిళలు కేవలం ఇంట్లో పని చేసేవారు, చర్చి బిల్డింగ్లో క్లీనింగ్ చేసేవారు అనుకోవద్దు. వారు కూడా ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులే.
మా సంఘములో సండే స్కూల్ చూసుకునేవారు కూడా సిస్టర్సె.
సంఘానికి ఆతిథ్యం ఇచ్చే పరిచర్యను ఎంతో ఆసక్తిగలిగి ఇంట్లో భోజనం వండి సిద్ధపరిచేది కూడా వారే.
సంఘములో పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, సంఘ క్షేమం కొరకు సలహాలు సూచనలు ఇస్తారు.
ప్రసంగం తరువాత జరిగే చిన్న గ్రూపు చర్చలో స్త్రీలకు నాయకత్వం వహిస్తారు.
బైబిల్ ప్రకారం సంఘ నాయకత్వం పురుషులకు మాత్రమే ఇవ్వబడింది అని నేను నమ్ముతాను (1 తిమోతి 2:12-14).
నాయకత్వం కాకుండా సంఘ క్షేమాభివృద్ధికి స్త్రీలు చేయాల్సిన ఎన్నో పరిచర్యలు సంఘములో ఉన్నాయి
(రోమా 16:1,3,12,13,15 ).
సంఘములో స్త్రీలకు కూడా మనం పరిచర్య అవకాశాలు కలిగించాలి. దేవుడు పురుషులకు స్త్రీలకు కుటుంబంలో, సంఘములో వేరు వేరు బాధ్యతలు ఇచ్చినా, వారిద్దరికీ ఒకే రక్షణ ఇచ్చాడు, వారిద్దరికీ కృపావరాలు ఇచ్చాడు.
క్రైస్తవ్యంలో స్త్రీలను అణగదొక్కే సంస్కృతి ఉంది అని బయటి సమాజం అనుకుంటుంది.
క్రీస్తు, సమరయ స్త్రీతో మాట్లాడి సువార్తికురాలిగా చేసి పంపాడు, మార్త మరియల ఆతిథ్యం స్వీకరించాడు, రక్త స్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు, మగ్దలేనే మరియకు తిరిగి లేచిన తరువాత కనిపించాడు.
వివిధ పరిచర్యల్లో స్త్రీలకు కూడా అవకాశాలు ఇచ్చినపుడు దేవుడు సంతోషపడతాడు,
సమాజంలో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయి.
అందరూ కలిసి పరిచర్య చేసినపుడు దేవుని సంఘం దేవుని మహిమ కొరకు కట్టబడుతుంది, విస్తరిస్తుంది.
-డా. శంకర్ బాబు
Amen. Praise the Lord anna
ReplyDeletePraise the Lord 🙏
ReplyDelete