యేసుక్రీస్తు ప్రభువు పునరుత్తానుడైన తరువాత "మీరు సర్వ లోకమునకు వెళ్లి సువార్త ప్రకటించి శిష్యులను చేయుడి" అని శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రతి తరంలో గల క్రీస్తు శిష్యులకు వర్తిస్తుంది.
సువార్త సందేశం ప్రజలకు చెప్పే బాధ్యత విశ్వాసులందరిది.
ప్రతి సంఘము సువార్త పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
విశ్వాసులను సువార్త ప్రకటన చేయాలని సంఘ నాయకత్వం ప్రోత్సాహించాలి.
ఈ క్రిస్మస్ సీజన్లో సువార్త చేయడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, దేవుని శుభవార్తను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి.
మా సంఘంలో గల విశ్వాసులు వారి కాలనీలో, అపార్ట్మెంట్లో చిన్న క్రిస్మస్ మీటింగ్ ఉంది రండి అని ఇరుగుపొరుగు వారిని పిలవమని చెప్పాం.
అలా దాదాపు నాలుగు ప్రదేశాలలో సువార్త ప్రకటనకు ప్రణాళిక సిద్ధమయ్యింది.
కేవలం క్రీస్తుని ఎరుగని వారినే ఆహ్వానించమని చెప్పాము.
మొన్న ఒక మీటింగ్, నిన్న మరో మీటింగ్ ప్రభువు కృపలో ముగించబడినాయి. సంఘమంతా పాల్గొని పరిచర్య చేశారు.
ఈ వారం మరో రెండు సువార్త మీటింగ్స్ ఉన్నాయి.
ప్రసంగీకులుగా సువార్త సభల్లో లేదా క్రిస్మస్ మీటింగ్స్ లో
బోధించడం వల్ల ఒకే సారి చాలా మందికి సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక ప్రసంగీకునిగా వివిధ ప్రదేశాలలో సువార్త సందేశం అందిస్తున్నాను, వ్యక్తిగతంగా సువార్త చెబుతున్నాను.
కానీ మా సంఘములో గల సభ్యులు చేస్తున్న సువార్త పరిచర్యను బట్టి ఎంతో ఆనందిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తున్నాను.
చాలా మంది ప్రసంగీకులు లేదా సువార్తికులు మాత్రమే ఈ పరిచర్య చేయాలని అనుకుంటారు.బైబిల్ ప్రకారం ఇది సరియైనది కాదు.
ఇరుగు పొరుగు వారిని, తెలిసిన వారిని పిలిచి సువార్త చెప్పినప్పుడు అందరికీ ఇవ్వబడ్డ గొప్ప ఆజ్ఞ విశ్వాసులందరూ పాటించడానికి సహాయకరంగా ఉంటుంది.
క్రిస్మస్ నెలలో మాత్రమే సువార్త చెప్పడం కాదు గానీ, మిగతా 11 నెలల్లో కూడా సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
క్రిస్మస్ సీజన్లో ఉండే అవకాశాన్ని కూడా వినియోగించుకుని సువార్త చెప్పడానికి సంఘముగా ప్రయత్నం చేయాలి.
దేవుడు తన ప్రజలకు నమ్మకంగా చేయమని ఇచ్చిన సువార్త పరిచర్యను అంతే నమ్మకంగా చేయడానికి సిద్ధపడుదుము గాక, ఆమేన్.
-డా. శంకర్ బాబు
Comments
Post a Comment