సంఘం అంటే ఆదివారం రెండు గంటలు కూర్చుని ప్రసంగం విని వెళ్లిపోయే ఒక కార్యక్రమం అని చాలామంది క్రైస్తవులు అనుకుంటుంటారు అదే విధంగా చాలా మంది కాపరులు కూడా సంఘాన్ని నడిపిస్తుంటారు.
కానీ సంఘమంటే దేవుని కుటుంబమని (1తిమోతి 3:15), సంఘములోని విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ సంబంధాలు కట్టుకోవాలని (యోహాను 13:34,35) బైబిల్ గ్రంధం బోధిస్తుంది.
కుటుంబం పట్ల నిబద్ధత కలిగి ఉండడం చాలా ముఖ్యం.
దేవునిలో అభివృద్ధి చెందడానికీ, దేవుడు ప్రసాదించిన తలాంతులను వరాలను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడడానికీ ఆ కుటుంబంతో అంటుకట్టబడి ఉండడం చాలా ప్రాముఖ్యం.
ఇక్కడ అంటుకట్టబడడం అంటే సంఘ కార్యక్రమాలకు క్రమంగా హాజరవడం, సంఘంతో కలిసి వాక్యం నేర్చుకోవడం,సంఘములో గల ఇతరులతో సంబంధాలు కట్టుకోవడం, వారి సుఖదుఖాలలో భాగం పొందుకోవడం మొదలులైనవి చేయడం అని అర్థం.
ఇది పాటించడానికే మా సంఘములో ఎవరైనా సభ్యులు కాదలిస్తే వారికి సభ్యత్వ తరగతులు తీసుకుంటాం.
ఆ తరగతుల్లో కల్తీ లేని వాక్యానుసారమైన సువార్త, నూతన నిబంధన సంఘము గూర్చిన బోధ, క్రీస్తు శిష్యులుగా కలిగి యున్న బాధ్యతలు, సంఘ విశ్వాసాలు మొదలైన సంగతులు బోధిస్తాము.
ఇంత అవసరమా అన్ని కొందరు అనుకోవచ్చు.
ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే, మొదట నీకు ఆ జాబ్ కొరకైన అర్హతలు ఉండాలి, ఆ తరువాత శిక్షణ గుండా వెళ్ళాలి, అప్పుడే నీవు నీ ఉద్యోగం ప్రభావవంతంగా చేయగలవు.
ఉద్యోగానికే ఇంత ఉన్నపుడు, జీవము గల దేవుని సంఘములో పైన చెప్పిన వాక్య సంబంధ విషయాలు తెలుసుకోకుండా ఉండడం క్షేమం కాదని నేను నమ్ముతాను.
ఈ తరగతులు ముగించుకొని, ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకున్న తర్వాత సంఘముతో తమ సాక్ష్యాలు పంచుకొని ఆ పిదప సంఘముతో సభ్యులు నిబంధన చేస్తారు.
ఇలా నిబంధన చేయడం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా రావొచ్చు.
నన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి.
బాప్తీస్మం ఇచ్చేప్పుడు మనం అడిగే ప్రశ్నలు ఎక్కడున్నాయి?
వివాహం చేసేపుడు ప్రమాణాలు చేయమని ఎక్కడుంది?
ఇవన్నీ వాక్యానుసారంగా మనం రాసుకున్న సూత్రాలు.
అలాగే సంఘములో సభ్యులు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధన రాసుకున్నాము.
గత ఆదివారం 13 మంది కొత్త సభ్యులు ఆ నిబంధన చేసి మా కుటుంబానికి జతపరచబడ్డారు.
దేవునికి స్తోత్రం.
నిబంధన చేసేవాళ్ళు తప్పకుండా ఆ నిబంధన పాటిస్తారా అంటే కొందరు చల్లబడి పోయే అవకాశం ఉండొచ్చు. కానీ సంఘము వారికి ఆ నిబంధన గుర్తు చేస్తూ ప్రోత్సాహించడానికి కూడా సహాయకరంగా ఉంటుంది.
అందుకే, ప్రతి వారం సంఘ నిబంధనను సంఘముగా అందరం కలిసి చదువుతాం.
ఇలా తప్పకుండా ప్రతి సంఘము చేయాలి అని నేను చెప్పట్లేదు. చేయడంలో తప్పు లేదు అని, చేయదలిస్తే ఇది మీకు కూడా సహాయకరంగా ఉంటుంది అని చెబుతున్నాను.
చివరిగా, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము (అపొస్త 20:28) పట్ల మన వైఖరి చాలా తీవ్రంగా ఉండాలని, దానికి ఉపయోగపడే ప్రతి విధానాన్ని సంఘములో వాడి, సంఘ క్షేమాభివృద్ధికై పాటుపడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.
అటువంటి సంఘాలను దేవుడు లేపును గాక.
ఆమేన్.
డా. శంకర్ బాబు
Wonderful 👍
ReplyDelete