రెండు రోజుల క్రితం హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ గా క్యాంప్ జరుపుకున్నాం.
చిన్న పెద్ద కలిసి దాదాపు 90 మంది హాజరయ్యారు.ఇంతమందిని కలుపుకొని ఒక ప్రదేశానికి వెళ్లి రెండు రోజులు చర్చ్ క్యాంపు కలిగి ఉండడానికి చాలా పని చేయాల్సి వస్తుంది.
ఆ రెండు రోజుల షెడ్యూల్ తయారు చేయడం,
స్పీకర్స్ యొక్క ప్రయాణాలు చూసుకోవడం,క్యాంపుకి వచ్చిన వారికి రూమ్స్ కేటాయించడం,
రూమ్స్ లో ఏదైనా సమస్య వస్తే త్వరగా పరిష్కరించడం, అందరినీ సమయానికి సెషన్స్ హాజరవ్వడానికి ప్రోత్సహించడం, సమయానికి భోజనం కొరకు అందరినీ సిద్ధపరచడం, రాను పోనూ అందరికీ రవాణా సౌకర్యం చూసుకోవడం మొదలైన ఎన్నో పనులు ఉంటాయి.
ఇవన్నీ కూడా కాపరిగా నేను కాకుండా మిగతా విశ్వాసులే చూసుకున్నారు.
నా మీద ఈ మాత్రం భారం పడకుండా కలిసి ఈ పరిచర్యలు చేశారు.
1 కొరింథీ 12 లో చెప్పబడిన విధంగా దేవుడు వారికిచ్చిన వరాలను సంఘానికి క్షేమం కలిగించడానికి వాడారు.
సంఘానికి కాపరిగా పరిచర్య చేసే వ్యక్తి అన్నీ తానే చేయాలి అనుకోకుడదు.
ఇటువంటి పరిచర్యలను నమ్మకమైన విశ్వాసులకు అప్పజెప్పాలి. వారికి పని అప్పజెప్పిన తరువాత వారిని నమ్మాలి.
కొంతమంది నాయకులు ఇతరులకు ఈ పరిచర్య చేయమని చెబుతారు కానీ వారిని నమ్మకుండా మాటి మాటికీ విషయాలు చెప్పి విసిగిస్తారు. వారికి కాస్త స్వేచ్ఛ నివ్వడం మంచిది.
అలాగని వారు ఏమి చేసినా అంగీకరించాలని కాదు. తప్పకుండా పై విచారణ చేయాలి.
ఈ పైన జరిగిన అన్ని పరిచర్యలను నేను గమనిస్తూ, సలహాలిస్తూ, సరైన విధంగా నడిపించే సహాయం చేశాను కానీ, ఆ భారం మొత్తంగా వారే తీసుకున్నారు.
అపోస్త 6వ అధ్యాయంలో సంఘములో సమస్య వచ్చినపుడు నాయకులు చేసింది ఇదే. ఆహారం పంచి పెట్టే పని ఇతరులకు అప్పజెప్పి, వారు ప్రార్థనలో,వాక్య పరిచర్యలో నిమగ్నం అయ్యారు.
ఆదివారం రోజు వాక్యం బోధించడానికి, క్యాంపు మధ్యలో,చివర్లో అందరికీ ధన్యవాదములు తెలిపి ప్రార్థించడానికి మాత్రమే నన్ను పిలిచారు. దీన్ని బట్టి నేనెంతో సంతోష పడ్డాను.
విశ్వాసులందరూ కలిసి అన్ని పనులు చూసుకుంటుంటే కాపరికి సంతోషమే కలగాలి.
దేవుడు తన సంఘము మీద కాపరులను నియమించేది అన్నీ వాళ్లే చేయాలని కాదు. ఇతరులకు పరిచర్యలు అందించి సంఘానికి క్షేమం కలగజేయడానికి అని మరిచిపోవద్దు.
విశ్వాసులు పరిచర్య భారమంతా కాపరి మీద వేసి సంఘానికి కేవలం హాజరు వేసుకొని వెళ్లిపోవడానికి రాకుండా దేవుని పరిచర్యలో తమ సహాయం అందించడానికి రావాలి.
అటువంటి సంఘాలుగా మన సంఘాలను దేవుడు చేయును గాక.
- డా. శంకర్ బాబు
Good to hear... Blessings
ReplyDelete