సంఘాల్లో ఐక్యత లేకపోవడానికి ఒక కారణం సమూహవాదం ( groupism ). ఒక్కటిగా ఉండాల్సిన సంఘములో చిన్న చిన్న గ్రూపులు చేయడం.
1 కొరింథీ 1:10 - సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
ఎందుకు ?
ఎందుకంటే కొరింథీ సంఘములోని విశ్వాసులు కొందరు పౌలు గ్రూపు, అపొల్లో గ్రూపు, పేతురు గ్రూపు, క్రీస్తు గ్రూపుగా ఏర్పడి సంఘములో చెలామణీ అవుతున్నారు.
రక్షించబడిన వ్యక్తులే అయినా, ఒకే సంఘములో ఉన్నా, ఈ విశ్వాసులు ఇలా గ్రూపులుగా విడిపోయారు.
ఎప్పుడు గ్రూపులు మొదలైతాయో తెలుసా ?
వేర్వేరు ప్రజలకు దేవుడు వేర్వేరు వరాలు (gifts) దేవుడిస్తాడు. అపోల్లో పౌలు పేతురు ముగ్గురూ వేర్వేరు గిఫ్ట్స్ కలిగినవారు. వారి వరాల నుండి విశ్వాసులు మేలు పొందుకున్నారు. కానీ, దేవుడు వారికిచ్చిన వరాలను బట్టి, వారినే వెంబడిస్తూ గ్రూపులుగా విశ్వాసులు తయారయ్యారు.
ఈ మాటలు గుర్తు పెట్టుకుందాం : నాయకులని వెంబడించడం తప్పు కాదు కానీ నాయకులను క్రీస్తు స్థానంలో ఉంచడం మాత్రం చాలా పెద్ద తప్పు.
బైబిల్ టీచర్ నీ కోసం చనిపోలేదు, పాస్టర్ నీ కోసం సిలువెక్కలేదు. కేవలం క్రీస్తే నీ కొరకు మరణించాడు.
సంఘములో గల నాయకులకు లోబడండి,గౌరవించండి కానీ వారిని విగ్రహాలుగా ఆరాధించకండి. లేదంటే సంఘానికి చాలా ప్రమాదం.
సంఘము ఇతర సంఘాలుగా ఏర్పడి పరిచర్య చేయడానికి విభజించబడాలి కానీ, దెబ్బలాడుకొని, గ్రూపులు కల్పించుకొని కోర్టుల చుట్టూ తిరగడానికి విభజించబడకూడదు.
మరొక కారణం కూడా ఇప్పుడు చూద్దాం.
విశ్వాసులకు సంఘములో ఇష్టమైన వారుంటారు. వారి నేపథ్యం ఒకేలా ఉంది కాబట్టి, ఒకే హోదాలో ఉన్నారు కాబట్టి, ఒకే ఆర్ధిక స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీరందరూ ఒక గ్రూప్ గా ఉంటారు, వీరు వీరే కలుస్తారు, సమయం గడుపుతారు. కులాన్ని బట్టి కూడా ఎవరికీ తెలియకుండా సంఘాల్లో గ్రూపులు పెట్టుకునే అవకాశం ఉంది.ఇది కూడా సంఘములో ఐక్యత దెబ్బ తీసే విషయం.
దానిలో తప్పేంటి అని మీరనొచ్చు. సంఘము అంటే దేవుని కుటుంబం అని బైబిల్ చెబుతుంది కదా (ఎఫెసీ 2:19). మరి అలాంటప్పుడు కుటుంబములో కొంత మంది మాత్రమే మాటి మాటికీ కలిసి, ప్రేమలో సహవాసములో ఎదుగుతూ ఇతరులను నిర్లక్ష్యం చేయడం కరెక్టా ?
చాలా దగ్గరిగా ఉండే వారు, స్నేహితులుగా ఉన్నవారు కొంతవరకు ఇలాంటి దగ్గరి సంబంధాలు కలిగిఉంటారు అందులో తప్పేం లేదు కానీ, మిగతా వారిని అసలు పట్టించుకోకపోవడం సరియైనది కాదు. డబ్బును బట్టి, చదువును బట్టి, కులాన్ని బట్టి, హోదాను బట్టి ఇతరులను చిన్నచూపు చూడడం, వారిని అస్సలు పట్టించుకోకుండా ఉండడం వాక్య పరంగా పాపమే (యాకోబు 2:1-4).
సంఘములో గ్రూపులు ఉండకుండా ఉండాలంటే అందరినీ ఒకేలా చూసే, అందరితో సంబంధాలు కలిగిన వాతావరణం ఉండడం చాలా మంచిది.
యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళడానికి ముందు తన ప్రజల గురించి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన చేశాడు. యోహాను 17: 11 - పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
సంఘములో లేదా ఇతర వాక్యానుసారమైన సంఘాలతో ఐక్యత లేకపోతే ప్రభువు సిలువ కార్యాన్ని మనం చిన్నచూపు చూస్తున్నట్లే, ప్రభువు మాటలను నిర్లక్ష్యం చేస్తున్నట్లే.
దేవుడు ఉద్దేశించిన ప్రకారం ఐక్యత కలిగి జీవించడానికి దేవుని సంఘానికి దేవుడు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment