సంఘ కాపరి బాధ్యత ఈ ప్రపంచంలో అతి పెద్ద బాధ్యత కావొచ్చు. ఎందుకంటే, విశ్వాసుల ఆత్మీయ జీవితాలను ఆయన కాయాలి మరియు కాస్తాడు కాబట్టి.
క్రీస్తు కృపలో రక్షించబడి,
పాపముతో పోరాడుతున్న హృదయాలను క్రీస్తు వాక్యముతో సరిచేస్తూ, వారి కోసం ప్రార్థిస్తూ కాపరి చేసే పరిచర్య సామాన్యమైనది కాదు.
ఆదివారం కార్యక్రమం చూసుకోవాలి, బైబిల్ స్టడీలు చూసుకోవాలి, ప్రార్థనా కూటమి నడిపించాలి, గృహాలు దర్శించాలి. ఇలా ఎన్నో పనులు వారమంతా చేయాల్సి వస్తుంది.
అయితే, ఈ పరుగుపందెంలో పడి చాలా కాపరులు తమ స్వంత శరీరాలను, హృదయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని కొంత మందితో మాట్లాడితే నాకు అనిపించింది.
పరిచర్య అనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలవాలంటే లేదా ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కొన్ని మార్గాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను.
1. దేవుడు, నిన్ను మొదట రక్షించాడు. అంటే ముందుగా నీవు దేవునితో సంబంధం కలిగి, ఆయన్ను ప్రతిదినం ఆరాధిస్తూ, సంతోషంగా జీవించడానికి పిలవబడ్డావని గుర్తించాలి.
2. నీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నీవు దేవుని కొరకు, ఆయన సంఘము కొరకు ఏదైనా చేయగలవు కాబట్టి, నీ భౌతిక శరీరానికి అనవసరమైన వాటన్నిటినీ పక్కన బెట్టాలి.
3. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. బయట లభించే జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి.
4. విశ్వాసులు ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచినపుడు మీరు తీసుకునే ఆహారం ముందుగానే చెప్పి కొద్దిగా తినడం అలవాటు చేసుకోవాలి.
5. ప్రతి రోజు 15-20నిమిషాలు లేదా వారంలో 150 నిమిషాలు చెమట పట్టేవరకు వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా నడవడం అలవాటు చేసుకోవాలి.
6. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోయే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. శరీరానికి సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదమే.
7. సంఘములో అన్ని పనులు మీరే చేయకుండా, నమ్మకమైన విశ్వాసులకు బాధ్యతలు అప్పజెప్పి వారిని పని చేయడానికి ప్రోత్సహించాలి.
8. సంఘము యొక్క పనులు పరిచారకులకు ఇచ్చి, వాక్యము బోధించడానికి, ప్రార్థన చేయడానికి ప్రాథమికంగా సమయం వెచ్చించాలి (అపోస్త 6:3,4, 1 తిమోతి 3: 8-13).
9. భార్యకు అవసరమైన సమయం మనం ఇవ్వాలి. భార్యతో ఆరోగ్యకరమైన శారీరక సంబంధం కలిగియుండాలి (1 తిమోతి 3:2).
10. కుటుంబమును నిర్లక్ష్యం చేసి,
భార్యా పిల్లలను పట్టించుకోకుండా కాపరిగా నమ్మకమైన పరిచర్య చేయలేము కాబట్టి, కుటుంబంతో సమయం గడపాలి (1 తిమోతి 3:5).
ఇంకా ఎన్నో విషయాలు ఉండొచ్చు కానీ ఈ పది సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవని నేను నమ్ముతాను.
ప్రభువు కోసం పౌరుషంగా పరుగుపందెంలో పరుగెత్తడం మంచిదే కానీ కాస్త ఆగి ఈ విషయాలు పాటిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవడం మనకు క్షేమకరం.
దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక.
ఆమేన్.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment