లచ్చిమీ, లేవే, అయ్యో, నా పాణాన్ని పొట్టనవెట్టుకుండ్రు అని గుండెల మీద లచ్చమ్మ శవాన్ని వెట్టుకొని ఏడుస్తుండు రాములు. ఎవరో ఆమెను మెడ మీద కత్తితో పొడిచి చంపేశారు.
ఊరవతల రైస్ మిల్లు దగ్గర శవం దొరికింది.
లచ్చమ్మ, రాములు మంచి భార్యా భర్తలు. ఒకరంటే ఒకరికి మస్త్ ప్రేమ.
రాములు పెద్ద కులంకి చెందినోడు.
లచ్చమ్మ అదే ఊర్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన చిన్న కులపామె.
రాములు మొదటిసారి లచ్చమ్మను సూడంగనే మనసు పారేసుకుండు.
పోయి లచ్చమ్మని పెండ్లి చేస్కుంటనని వాళ్ల అయ్య దగ్గరికి పోయి అడిగిండు.
అట్ల కాదయ్యా, మేము కిరిస్తానీయులం, మీరు పెద్ద కులం వాళ్ళు అని వద్దన్నారు.
రాములు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పాస్టర్ సారు రాములును కూసోబెట్టి, బైబిల్ నుండి కొన్ని మాటలు సూయించి, యేసు సామి మన కోసం మన పాపాల కోసం సచ్చిపోయిండు అని మొత్తం చెప్పి, ముందు ఆ సామిని నమ్ముకో, పెళ్లి సంగతి తర్వాత అని సూటిగా చెప్పిండు.
రాములు,ఆలోచనలో పడిండు.
పాస్టర్ జెప్పిన మాటలు బాగా తాకినయి.
నెల రోజుల తరవాత ఆయన దగ్గరికి పోయి " సార్, నేను యేసు సామిని నమ్ముకుంటా, ఆ లచ్చమ్మ కోసం కాదు, నా కోసం" అన్నాడు.
అయితే " మా చర్చికి రా రాములు" అని సంతోషంగా అన్నాడు పాస్టర్.
రేయ్ రాములు, నువ్వు గిట్ట లచ్చమ్మను పెండ్లి చేసుకుంటే చస్తవ్ బిడ్డా అని వాళ్ళ కులపోళ్లు దబాయిస్తే,
నేను గామెనే చేస్కుంట, ఏం చేస్తరో చేస్కపొండి అని రాములు ధీటుగా సమాధానం ఇచ్చిండు.
రాములు లచ్చమ్మల పెండ్లి, అదే చర్చ్ బిల్డింగ్లో మూడు నెలల తర్వాత అయ్యింది.
పెండ్లై సరిగ్గా ఆరు నెలలయ్యింది.
లచ్చమ్మ చాలా మంచిది.
పది మందికి మంచి చేసేది.
ఎవ్వల్నీ పల్లెత్తు మాట అనేది కాదు.
ఒక రోజు రాములు ఇంటి పక్కనే ఉన్న నర్సింలు ఇంట్ల బంగారం దొంగతనం అయితే, లచ్చమ్మ మీద అనుమానం ఉందని ఇంటికొచ్చి సామాన్లన్ని కింద పడేసి, ఇల్లంతా చిందర వందర చేసిండ్రు.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయింది.
రాములు వచ్చి " ఎంత ధైర్యం ఆళ్లకి, నేను లేనప్పుడొచ్చి ఇట్ల చేస్తరా, గిప్పుడే పోయి, తాడో పేడో తెల్చుకుంటా" అని వెళ్తుంటే, తన చెయ్యి పట్టుకొని ఆపి,
"ఊకోవయ్య, వాళ్లు ఏదో తప్పు జేసిండ్రని, మనం కూడా చేస్తే, మనకు ఆళ్లకు తేడా ఎముంటది, శత్రువుల్ని క్షమించమని యేసు సామి చెప్పిండు. పోయిన వారం పాస్టర్ సార్ చెప్పిన మాటలు గుర్తు లేవా?
నీకోసం గుత్తి వంకాయ ఒండిన, దా తిను" అని బుజ్జగించింది.
రాములుకి తనతో గడిపిన ప్రతి క్షణం గుర్తుకొచ్చి గుండెలవిసేలా రోదిస్తుండు.
లచ్చమ్మ వాళ్ల అమ్మా నాన్న కూడా
" వొద్దు బిడ్డా, వాళ్ళు ఊర్కోరు, సంపుతారు అని చెప్పిన.
నాయనా, నాకు దేవుడున్నాడు.
నన్ను పెండ్లి చేస్కొనే రాములు ముఖ్యం గానీ, వాళ్ళ కులపోల్లతో నాకెంది అంటివి గదనే, ఓ లచ్చిమి లేవే అంటూ ఏడుస్తనే ఉన్నారు.
లచ్చమ్మకి కొంచెం వైద్యం తెలుసు.
పాము కరిస్తే ఏం చేయాలి అనే ముచ్చట
ఆ ఊర్ల మెడికల్ క్యాంపు పడ్డపుడు డాక్టర్ చెబితే విన్నది.
అట్ల ఓ ఇద్దరి ప్రాణం బతికించింది.
ఎవడ్రా సంపింది, ఎవడైనా చెప్పండ్రా అని రాములు అడుగుతూనే ఉండు.
ఒక్కడు కూడా నోరు తెరుస్తలేదు.
మీరసలు మనుషులేనా, ఇంకా కుల పిశాచాలకు భయపడతారెంట్ర అంటూ తిడుతూనే ఏడుస్తున్నాడు.
ఇంతలో రాములు ఇంటికి ఎదురుగా ఉండే జయమ్మ కూతురు పదేళ్ల స్వప్న వచ్చి, అంకుల్ నేను చెబుతా అని ముందుకొచ్చింది.
నేను మీ ఇంట్లో ఆంటీతో ఆడుకుంటున్న.
నారాయణ తాత (కులపెద్ద) మీ ఇంటికి వచ్చి ఎవరికో పాము కరిసింది, కొంచెం వచ్చి సూడమ్మా అని అనిండు.
ఆంటీ, పోదాం పా అయ్యా అని మీసాల తాతతో పోయింది అంకుల్ అని ఏడుస్తూ చెప్పింది.
కోపంతో ఊగిపోయాడు రాములు.
శవాన్ని కింద బెట్టి గొడ్డలి తీస్కొని కులపెద్ధ ఇంటి వైపు వెళ్తుంటే " రేయ్ రాములు, ఆవేశపడకురా, ముందు జరగాల్సిన కార్యం చూడు" అంటూ ఆపే ప్రయత్నం చేశారు ఊరి జనాలు.
తూ మీవి కూడా బతుకులేనా, నేను యేసు సామిని నమ్ముకున్ననని
కిరిస్తాని పిల్లను చేసుకున్ననని,
నన్నేం చేయలేక, నా పెళ్ళాన్ని పట్ట పగలు నరికి సంపితే, వాళ్లకు భయపడి ఎదురు మాట్లాడే శాతగాదు గానీ, నేను పోతుంటే, నన్ను ఆపుతారా ?
ఇదే భయంరా వాళ్ళకు బలం.
నేను పోతున్నా, వాన్ని సంపి జైలుకు పోతా" అంటూ ముందుకెళ్ళాడు.
ఇంతలో ఎవరో చెయ్యి పట్టుకున్నట్లు అన్పించి, వెనకకు తిరిగాడు.అక్కడ ఎవరూ లేరు.
ఆలోచిస్తూ నారాయణ ఇంటి వైపు వెళ్ళాడు.
ఇంటి ముందు నారాయణ భార్య,
రాములు చేతిలో గొడ్డలి చూసి,
"రాములు, నీకు దండం పెడతా, నా పెనిమిటిని ఏం జేయకు" అని రెండు చేతులెత్తి దండం పెడుతూ ప్రాధేయపడుతుంది.
కోపంతో రగిలిపోతూ వచ్చిన రాములు,
" నా పెండ్లాంని సంపినోన్ని సంపాలి అని నాకుంది. కానీ, నిన్న రాత్రే నేను నా భార్య ఇట్ల మాట్లాడుకున్నం.
" అందరం సస్తం, ఒకరు ముందు, ఒకరు తర్వాత. కానీ, సావును సంపి లేసిండు ఒక సాములోరు, గా సామిని సిలువేసి సంపిండ్రు.
వీళ్లేం జేస్తున్నరో వీళ్ళకి తెల్వదు, వీళ్ళను మాఫ్ చెయ్యి అని ప్రార్థన చేసిండట.
మన పాపాల కోసం సచ్చిన సామే మనల్ని క్షమిస్తే, మనల్ని తిట్టే, కొట్టే, ద్వేషించే, సంపే వారిపై కక్ష తీర్చుకునుడు ఎట్ల కరెక్ట్ అనుకున్నాం."
నీ భర్తను సంపితే, నేను పగ తీర్చుకున్నట్లు.
నీ భర్తను పోలీసులకు పట్టిస్తే, న్యాయం జరిగించినట్లు.
కానీ, నా పెండ్లాన్ని సంపిన నీ భర్తను, క్షమిస్తున్న, మీరు మంచిగ ఉండండి అని గొడ్డలి విసిరేసి, కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ వెనుదిరిగాడు రాములు.
ఇదంతా తలుపు వెనకాల బిక్కు బిక్కుమంటూ దాక్కుని వింటున్న కులపెద్ద నారాయణ ఆశ్చర్యపడి,ఏడ్వడం మొదలుపెట్టాడు.
సమాధి కార్యక్రమం ముగించి ఇంటికెళ్ళిపోయాడు రాములు.
ఒక పది రోజుల తర్వాత కృతజ్ఞత కూడిక జరుగుతుంది. ఒక్కొక్కరూ వచ్చి లచ్చమ్మ మంచితనం గురించి రెండు మూడు మాటలు మాట్లాడుతున్నారు.
ఇంతలో ఒకాయన మొఖానికి ముసుగుతో వచ్చి,ఈ లచ్చమ్మ వల్ల నేను యేసు సామిని నమ్ముకున్న. యేసు సామి మాటలు విని నా బ్రతుకు మార్చుకున్న అని ఏడ్చుకుంటూ ముసుగు తీశాడు.
అక్కడున్న వారందరూ ఆ కులపెద్ద నారాయణను చూసి ఆశ్చర్యపడ్డారు.
- డా.శంకర్ బాబు
Heart touching story of love and foegiveness overcoming caste and creed.could see characters come alive while reading. Beautifully written.
ReplyDelete