ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని హుస్సేన్ సాగర్ కి చేరుకున్నాడు కిరణ్.
ప్రేమించినవాడు మోసం చేయడంతో జీవితం మీద విరక్తి చెంది చావాలని అదే హుస్సేన్ సాగర్ కి వచ్చింది సుధ.
ఇద్దరూ కాస్త దూరంలో నిల్చున్నారు. ఒకరికి ఒకరు పరిచయం లేదు.
ఇద్దరూ నీళ్ల వైపు సీరియస్ గా చూస్తున్నారు.
ఇక దూకేద్దాం అనుకుని కిరణ్ రెడీ అవుతున్నాడు. ఇనుప రేలింగ్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు.
ఎందుకో అటువైపు చూసిన సుధకి, కిరణ్ దూకబోతున్నాడని అర్థమయ్యింది.
పరుగున వచ్చి, ఏ అబ్బాయి ఏమైంది, ఎందుకు చావాలనుకుంటున్నావ్ ? అని అడిగింది.
ఉలిక్కి పడిన కిరణ్ దూకే ప్రయత్నం ఆపి నిలబడ్డాడు.
విరక్తి ఈ జీవితం మీద విరక్తి అన్నాడు.
తను కూడా అదే ఆలోచనలో ఉన్న సంగతి పక్కన బెట్టి, జీవితం మీద విరక్తి పుడితే జీవితాన్ని ముగించమని ఎవరు చెప్పారు ? తనకు తాను చెప్పుకుంటూ కిరణ్ తో అనేసింది సుధ.
కష్టాలు, కన్నీళ్లు జీవితంలో కామన్. అసలు అవి లేకపోతే జీవితమే బోరింగ్ గా ఉంటుంది. నీకే కష్టం ఉందో నాకు తెలియదు కానీ, కాస్త ఓపిక పట్టు అన్నీ సర్దుకుంటాయేమో అంటూ చిన్న లెక్చర్ ఇచ్చేసింది.
ఎవరో తెలియని అమ్మాయి ఇలా మంచి మాటలు చెబుతుంటే, కిరణ్ కి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.
నీకో విషయం చెప్పనా, నేను కూడా చావడానికే వచ్చాను. కానీ, ఈ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఇంతమంది జనాన్ని చూశాక, ఎందుకో అసలు ఎందుకు చావాలి అనే ప్రశ్న కలిగింది. వీళ్ళందరూ కష్టాలు లేని వాళ్ళు కాదు కదా ! ఏదో రకంగా ఇబ్బందుల గుండా వెళ్ళేవారే కదా ! మరి వీళ్ళందరూ ఎందుకు చావట్లేదు అనిపించింది. అందరూ చస్తే ఈ హుస్సేన్ సాగర్ లో శవాల గుట్టలు చూడాల్సి వస్తుందేమో.
కిరణ్ కి కొంచెం కొంచెంగా జ్ఞానోదయం అవుతున్నట్లు అనిపిస్తోంది. కరెక్టే కదా, సమస్యలు ఉన్నవారు అందరూ చచ్చిపోతే అసలు ఈ భూమ్మీద మనిషి అనేవాడు ఉండడు కదా అనే అలోచన కాస్త గట్టిగానే తాకింది.
అతి కష్టంగా చాలా థాంక్స్ అండి. జాబ్ దొరకలేదని చావాలనుకున్నా, కానీ ఇప్పుడు బ్రతుకుతా.ఎవరికోసమో కాదు, నా కోసం, నా తల్లిదండ్రుల కోసం బ్రతికి చూపిస్తా.
థాంక్యూ అనుకుంటూ కిరణ్ వెళ్తుంటే,
కళ్ళలో తిరుగుతున్న నీళ్ళని అదిమిపెట్టడం కష్టంగా ఉండడం వల్ల, చున్నీతో కన్నీటిని తుడుచుకుంటూ తాను కూడా బ్రతకడానికి బయలుదేరింది సుధ.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment