మొదటిగా విశ్వాసులనగా ఎవరో చూద్దాం. యేసుక్రీస్తు యొద్ద పాపములు ఒప్పుకొని, మారు మనస్సు పొందుకొని వాక్యానుసారముగా జీవించే వారిని విశ్వాసులుగా చెప్పవచ్చును. ఏ క్షణములో అయితే ఒక వ్యక్తి ప్రభువు యందు విశ్వాసముంచుతాడో , అప్పుడే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి నిత్యజీవమును పొందుకుంటాడని, ఆ వ్యక్తిని క్రైస్తవ విశ్వాసిగా బైబిల్ బోధిస్తుంది. ఆత్మీయ మరణానికి లోనైన పాపిని, ఆయన చిత్తములో, ఆయన మహిమ కొరకు, తన కుమారుడైన క్రీస్తు మరణ పునరుత్తానం ద్వారా, పాప క్షమాపణ నిచ్చి కాపాడుటను "రక్షణ"గా నిర్వచించవచ్చు. రక్షణ కార్యం ద్వారా దేవుని వలన కలిగిందే . దేవుడు, రక్షించబడిన వ్యక్తికి నూతన హృదయమునిచ్చి, పరిశుద్ధాత్మ చేత ఆత్మీయ జీవితములో కొనసాగుటకు సహాయం చేస్తాడు. అయితే కొంతమంది ఎప్పుడైతే ఈ రక్షించబడిన వ్యక్తి పాపం చేస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి రక్షణ కోల్పోతాడని చెబుతుంటారు. వాక్యము ప్రాథమికంగా, ప్రాముఖ్యముగా వీరి మాటలతో ఏకీభవించట్లేదు కావున నేను కూడా వారితో ఏకీభవించను. విశ్వాసి రక్షణ కోల్పోడు అని బోధించే వాక్య భాగాలను పరీక్షించే ప్రయత్నం చేద్దాం. ...